హైడ్రా బాధితులకు గుడ్ న్యూస్.. CM రేవంత్ కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |

పేద‌వారిపేరుతో క‌బ్జాదారులు చేసే దుష్ప్ర‌చారానికి ప్ర‌భుత్వం చెక్ పెడుతోంది. పేద‌వారిని ముందు పెట్టి క‌బ్జాల‌కు పాల్ప‌డే బ‌డాబాబుల భ‌ర‌తం ప‌డుతూనే బాధితుల‌కు అన్యాయం జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్తలు తీసుకుంటోంది.

హైడ్రా బాధితులకు గుడ్ న్యూస్.. CM రేవంత్ కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: పేద‌వారిపేరుతో క‌బ్జాదారులు చేసే దుష్ప్ర‌చారానికి ప్ర‌భుత్వం చెక్ పెడుతోంది. పేద‌వారిని ముందు పెట్టి క‌బ్జాల‌కు పాల్ప‌డే బ‌డాబాబుల భ‌ర‌తం ప‌డుతూనే బాధితుల‌కు అన్యాయం జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్తలు తీసుకుంటోంది. చెరువుల‌ను పున‌రుద్ధ‌రిస్తున్న క్ర‌మంలో నివాసాలు కోల్పోయిన పేద‌లకు డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణ‌యించార‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ తెలిపారు. మాదాపూర్‌లోని సున్నం చెరువుతో పాటు ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని రామంతాపూర్ చెరువులో నివాసాలు కోల్పోయిన వారితో హైడ్రా క‌మిష‌న‌ర్ శుక్ర‌వారం స‌మావేశ‌మ‌య్యారు. చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌లో నివాసాలు కోల్పోయిన పేద‌లంద‌రికీ డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణ‌యించార‌ని.. ఈ విష‌యాన్ని చెప్పాల‌ని సూచించిన విష‌యాన్ని బాధితుల‌కు తెలిపారు. ఈ మేర‌కే చెరువు ప‌రిధిలో ఎన్ని గుడిసెలు ఉన్నాయి.. ఎంత మంది నివాసం ఉంటున్నార‌నే విష‌యాల‌పై పూర్తి స‌మాచారం సేక‌రిస్తున్నామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ చెప్పారు. త్వ‌ర‌లోనే అంద‌రికీ డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తుంద‌న్నారు.

అవ‌క‌త‌వ‌క‌ల‌కు ఆస్కారం లేకుండా..

గూగుల్ మ్యాప్స్‌, శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌ల‌కు ఆస్కారం లేకుండా ఈ జాబితాను సిద్ధం చేస్తున్నామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ తెలిపారు. 2024 జులై 19వ తేదీకి ముందు నివాసం ఉన్నవారి లెక్క‌లు సేక‌రిస్తున్నామ‌న్నారు. న‌గ‌రంలో చెరువుల‌ను పున‌రుద్ధ‌రించిన అన్ని చోట్ల ఇదే విధానాన్ని అనుస‌రించాల‌ని సీఎం సూచించార‌ని తెలిపారు. పేద‌వారికి ఎలాంటి అన్యాయం జ‌ర‌గ‌కుండా చూడాల‌నేదే ప్ర‌భుత్వ సంక‌ల్ప‌మ‌ని చెప్పారు. జీవ‌నోపాధికి న‌గ‌రానికి వ‌చ్చి చెరువుల చెంత గుడిసెలు వేసుకుని నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారి విష‌యంలో ప్ర‌భుత్వం చాలా సానుకూలంగా ఉంద‌న్నారు. ఎక్క‌డి నుంచి వ‌చ్చారు.. ఏం చేస్తున్నార‌నే విష‌యాల‌ను బాధితుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ అడిగి తెలుసుకున్నారు. న‌ల్గొండ‌, నాగ‌ర్‌క‌ర్నూలు, దేవ‌ర‌క‌ద్ర‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, ఆంధ్రాలోని ప‌లు జిల్లాల‌తో పాటు ప‌రిగి, తాండూరు ప్రాంతాల‌కు చెందిన వారిగా బాధితులు ప‌రిచ‌యం చేసుకున్నారు. చెత్త ఏరుకునేవారికి ఎక్క‌డా ఇళ్లు అద్దెకు దొర‌క‌ని ప‌రిస్థితుల్లో చెరువుల చెంత చేరామ‌ని బాధితులు ఈ సంద‌ర్భంగా తెలిపారు. క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి స్ప‌ష్ట‌మైన ఆధారాల‌తో జాబితాను సిద్ధం చేయాల‌ని ఈ సంద‌ర్భ‌గా అధికారుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఆదేశించారు.

Next Story