అన్నదాతలకు ఇక తీపికబురు.. త్వరలోనే అందుబాటులోకి ‘భూభారతి’ యాప్

by Kema Shiva Kumar |

భూ సమస్యల పరిష్కారం, భూ హక్కుల పరిరక్షణ కోసం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. త్వరలో భూభారతికి సంబంధించి యాప్ తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నది.

అన్నదాతలకు ఇక తీపికబురు.. త్వరలోనే అందుబాటులోకి ‘భూభారతి’ యాప్
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూ సమస్యల పరిష్కారం, భూ హక్కుల పరిరక్షణ కోసం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. త్వరలో భూభారతికి సంబంధించి యాప్ తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. సరికొత్త ఫీచర్స్ తో దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే డిజైన్, బ్యాక్ ఎండ్ వర్క్ దాదాపుగా పూర్తయినట్లు తెలిసింది. ‘నా భూమి హక్కులు.. నా చేతుల్లో (మొబైల్)నే’ అన్నట్లుగా ఈ యాప్ ను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ యాప్ అందుబాటులోకి వస్తే ఎక్కడైనా, ఎప్పుడైనా రైతులు తమ రికార్డులను చూసుకునే వీలుంటుంది. సదరు రైతు భూమిలో కొంత అమ్మేందుకు స్లాట్ బుక్ చేసినా.. ఏదైనా మార్పును కోరుకున్నా వెంటనే మొబైల్ కు మెసేజ్ వచ్చేలా యాప్ ను డిజైన్ చేస్తున్నారు. దీంతో పట్టాదారు అనుమతి లేకుండా ఎవరైనా రికార్డుల్లో మార్పులకు ప్రయత్నించినా వెంటనే రైతు అలర్ట్ అయ్యే అవకాశముంటుందని సీసీఎల్ఏ వర్గాలు తెలిపాయి. ఇలాంటి ఫీచర్స్ తో అనుమతి లేకుండా డేటా చేంజెస్ కు అవకాశముండదు.

కనుబొమ్మతో ఓపెన్!

భూ భారతిలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. యాప్ ద్వారా తమ భూములను వీక్షించేందుకు కూడా కనుబొమ్మలతో డేటా ఓపెన్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇతరులెవరూ మొబైల్ లో ఓపెన్ చేసి మార్పులు చేయకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆర్వోఆర్, పహానీలను కూడా మొబైల్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రతి పహానీ, ఆర్వోఆర్ కు క్యూఆర్ కోడ్ ను ఇవ్వాలని భావిస్తున్నారు. ఆ క్యూఆర్ ను ఎక్కడైనా చూపించి ఫిజికల్ కాపీ తీసుకునే వీలుంటుంది. ఆర్ఐఎఫ్ డీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) సెన్సార్ మాదిరిగా చేయాలని వ్యూహరచన చేస్తుండడం విశేషం. మొబైల్ చేతిలో ఉండి, భూ భారతి యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే రైతుల భూ హక్కులు భద్రంగా ఉండేలా యాప్ ను రూపొందిస్తున్నారు.

తాత్కాలిక భూదార్ నంబర్

ఆర్వోఆర్-2025 చట్టంలో పేర్కొన్నట్లుగా ప్రతి రైతుకు భూదార్ నంబర్ జారీ చేయనున్నారు. ప్రస్తుతం తాత్కాలిక భూదార్ నంబర్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే 14 డిజిట్ల నంబర్ ఇవ్వాలా? 12 డిజిట్ల నంబర్ ఇవ్వాలా? అన్న అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. 14 అంకెల నంబరుతోనే భద్రత ఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మొదట డిస్ప్యూట్ ఫ్రీగా ఉన్న ల్యాండ్స్ కు మాత్రమే భూదార్ నంబర్ ఇవ్వాలని భావించారు. ఇలా చేస్తే కొందరు రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశముండడంతో.. తాత్కాలికమే కనుక అందరికీ భూదార్ నంబర్ ఇవ్వడం ద్వారా గందరగోళం తలెత్తదని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రతి రైతుకు సిస్టం భూదార్ నంబర్ జనరేట్ చేస్తుంది. ఆ నంబర్ క్లిక్ చేయగానే రైతు తన భూమి వివరాలన్నీ చూసుకోవచ్చు. అంతేకాకుండా తర్వాతి రోజుల్లో యాప్ లోనే హద్దులు (సర్వే మ్యాప్)ను రైతు స్వయంగా అప్ లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. తన భూమి చుట్టూ తిరిగి కో ఆర్డినేట్స్ ను నమోదు చేస్తే దాన్ని సర్వేయర్ వ్యాలిడేషన్ చేస్తారు. అది సరిగ్గా ఉందని నిర్ధారిస్తే పర్మినెంట్ భూదార్ నంబర్ కూడా ఆటోమెటిక్ గా జనరేట్ అవుతుంది. భూ భారతి యాప్ తోపాటే దీన్ని అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ కు సీసీఎల్ఏ సీఎమ్మార్వో ప్రాజెక్టు డైరెక్టర్ మందా మకరంద్ నేతృత్వంలో టీమ్స్ పని చేస్తున్నాయి.

ఐదేండ్ల ప్రణాళిక

భూ భారతి చట్టంలో ప్రస్తావించిన అంశాలన్నింటినీ అమలు చేసేందుకు సమయం పడుతుంది. ఇప్పటికిప్పుడు అన్నింటిని అమలు చేయడం కుదరదు. ప్రస్తుతం తాత్కాలిక భూదార్ నంబర్ ఇవ్వడం వరకు పరిమితం. ఈ నంబర్లు ఆటో జనరేట్ అవుతాయి కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ పర్మినెంట్ భూదార్ నంబర్ కు చాలా టైం పట్టే అవకాశం ఉంది. ప్రతి భూ కమతానికి హద్దులు పక్కాగా నిర్ధారించాలి. అయితే ఏ రైతైనా స్వయంగా తన భూముల హద్దులను సర్వే చేయించి సర్వేయర్ చేత వ్యాలిడేషన్ చేయిస్తే పర్మినెంట్ భూదార్ నంబర్ ఇచ్చేస్తారు. ఇదంతా పూర్తి కావడానికి కనీసం ఐదేండ్లయినా పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మొదటగా భూ భారతి యాప్ తోనే తాత్కాలిక భూదార్ నంబర్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి యాప్ ద్వారా సమాచారం ఇస్తారు. అలాగే వెబ్ సైట్ లో పేర్కొన్న ప్రతి అప్లికేషన్ ఎలాంటి సేవలు అందిస్తుందో.. అది మొబైల్ యాప్ ద్వారానూ పొందే వీలుంది.

Next Story