- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాధి హామీ కూలీలకు గుడ్‌న్యూస్.. వేతనాలపై వర్క్‌షాప్‌లో స్పష్టత
హైదరాబాద్‌లోని ఐసీఏఆర్- జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థలో మంగళవారం ‘వీబీ- జీ రామ్ జీ’ చట్టంపై పీఐబీ ఆధ్వర్యంలో వార్తాలాప్ మీడియా వర్క్‌షాప్ నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఐసీఏఆర్- జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థలో మంగళవారం ‘వీబీ- జీ రామ్ జీ’ చట్టంపై పీఐబీ ఆధ్వర్యంలో వార్తాలాప్ మీడియా వర్క్‌షాప్ నిర్వహించారు. పాత్రికేయులకు అవగాహన కల్పించడం, ప్రతిపాదిత చట్టంపై వస్తున్న అసత్య సమాచారాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఈ వర్క్‌షాప్ నిర్వహించారు. జాతీయ గ్రామీణాభివృద్ధి- పంచాయతీ రాజ్ సంస్థ (ఎన్ఐఆర్‌డీపీఆర్) డైరెక్టర్ జనరల్, ఐఏఎస్ డాక్టర్ జి. నరేంద్ర కుమార్, ఎన్ఏఏఆర్ఎం తాత్కాలిక డైరెక్టర్ డాక్టర్ గోపాల్ లాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వేతనాలకు పూర్తి స్థాయి రక్షణ
పాత్రికేయులనుద్దేశించి డాక్టర్ జి. నరేంద్ర కుమార్ మాట్లాడుతూ... ‘వికసిత భారత్’గా ఎదగాలన్న దేశ ఆకాంక్షలకు అనుగుణంగా.. 2047 నాటికి ఆ లక్ష్యాన్ని చేరుకునేలా ఓ స్పష్టమైన ప్రణాళికను వీబీ- జీ రామ్ జీ చట్టం అందిస్తుందన్నారు. “జాతీయ అభివృద్ధి ప్రాధాన్యాలతో గ్రామ పంచాయతీలను అనుసంధానించడం ద్వారా.. ఉపాధి కల్పనలోనూ, సుస్థిర - సమ్మిళిత గ్రామీణాభివృద్ధిలోనూ వీబీ- జీ రామ్ జీ చట్టం కీలక పాత్ర పోషిస్తుంది’’ అని ఆయన అన్నారు. కనీస వేతనాలు తగ్గుతాయన్న ఆందోళనలను డాక్టర్ నరేంద్ర కుమార్ తోసిపుచ్చారు. కొత్త చట్టం కింద కనీస వేతనాలకు పూర్తి స్థాయి రక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, గ్రామ స్థాయిలో ప్రాథమిక సదుపాయాలను అందించడం వీబీ- జీ రామ్ జీ చట్టం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జీవన నాణ్యత గణనీయంగా మెరుగుపడుతుందన్నారు.
సంస్థాగత సంస్కరణలను ప్రస్తావిస్తూ, మూడు అంచెల్లోనూ ఉన్న పంచాయతీ రాజ్ సంస్థల అధికారిక భాగస్వామ్యం ద్వారా ఈ చట్టం వికేంద్రీకృత ప్రణాళిక, పర్యవేక్షణలను బలోపేతం చేస్తుందని డాక్టర్ జి.నరేంద్ర కుమార్ అన్నారు. పనుల్లో నాణ్యత, జవాబుదారీతనం లక్ష్యంగా.. ఈ చట్టం జిల్లా స్థాయిలో పర్యవేక్షణను మరింత మెరుగుపరుస్తుందని తెలిపారు. నిబంధనల ఆధారంగా రాష్ట్రాలకు కేటాయింపు పద్ధతిని కూడా ఈ విధానం ప్రవేశపెడుతోందనీ, దీంతో నిధుల కేటాయింపుల్లో స్పష్టత పెరగడమే కాకుండా, కేంద్రం - రాష్ట్రాల మధ్య ‘సహకార సమాఖ్య’ స్ఫూర్తి మరింత బలపడుతుందనీ అన్నారు.
ప్రజల్లోకి వెళ్లకుండా చూసేందుకే ఈ వర్క్‌షాప్
కార్మిక సమస్యలపై డాక్టర్ గోపాల్ లాల్ మాట్లాడుతూ.. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్నప్పటికీ, భారత్ నేడు వ్యవసాయ రంగంలో శ్రామికుల కొరతను ఎదుర్కొంటోందని తెలిపారు. వ్యవసాయం, అనుబంధ గ్రామీణ కార్యకలాపాల్లో కార్మికులను తిరిగి భాగస్వాములను చేయడం ద్వారా.. కొత్త చట్టం ఈ సమస్యను పరిష్కరిస్తుందన్నారు. కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించడంలో జర్నలిస్టులదే కీలక పాత్ర అని పీఐబీ డిప్యూటీ డైరెక్టర్ మానస్ కృష్ణకాంత్ స్పష్టం చేశారు. వీబీ- జీ రామ్ జీ చట్టంపై తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళ్లకుండా చూసేందుకు ప్రత్యేకంగా ఈ వర్క్‌షాప్ నిర్వహించినట్టు ఆయన తెలిపారు. ఈ చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని మీడియా ప్రతినిధులను కోరారు. కొత్త చట్టం వీబీ- జీ రామ్ జీని ప్రవేశపెట్టడమంటే పాత చట్టాన్ని నీరుగార్చడం కాదని ఎన్ఐఆర్‌డీపీఆర్ ప్రొఫెసర్ డాక్టర్ జ్యోతిస్ సత్యపాలన్ వ్యాఖ్యానించారు. ఎంజీఎన్ఆర్జీఏ చట్టానికి సవరణలు చేయాల్సిన ఆవశ్యకతను ప్రొఫెసర్ ప్రముఖంగా ప్రస్తావించారు. మెరుగైన ఫలితాలు లక్ష్యంగా చేసుకున్న దిద్దుబాటు చర్యగా దీనిని అభివర్ణించారు. వివిధ పత్రికలు, చానళ్లకు చెందిన జర్నలిస్టులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ఎన్ఏఏఆర్ఎం సీనియర్ అధికారులు, పీఐబీ మీడియా, కమ్యూనికేషన్ అధికారి వి. గాయత్రి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.






