డిగ్రీ కాలేజీ కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరో ఏడాది సేవల పొడిగింపు

by Ramesh Naini |

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగుల సేవలు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.

డిగ్రీ కాలేజీ కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరో ఏడాది సేవల పొడిగింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగుల సేవలు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. కళాశాల విద్య కమిషనరేట్ పరిధిలో కొనసాగుతున్న మొత్తం 2,784 మంది వివిధ కేటగిరీల ఉద్యోగుల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పొడిగింపు సేవలు ఏప్రిల్ 1, 2026 నుంచి మార్చి 31 వరకు ఒక సంవత్సరం పాటు కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో కాంట్రాక్టు లెక్చరర్లు 451 మంది, అవుట్ సోర్సింగ్ సిబ్బంది 349 మంది, గెస్ట్ ఫ్యాకల్టీ 1,984 మంది ఉన్నారు.

ఈ ఉత్తర్వుల ప్రకారం, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వివిధ సబ్జెక్టుల (బోటనీ, కెమిస్ట్రీ, కామర్స్, ఎకనామిక్స్ తదితర) లెక్చరర్లకు నెలకు రూ. 58,850 వేతనం చెల్లించనున్నారు. అలాగే టీఎస్ కేసీ ఫుల్ టైమ్ మెంటర్లు, సీనియర్ అసిస్టెంట్లకు నెలకు రూ. 22,750, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మెకానిక్‌లకు నెలకు రూ. 19,500, ఆఫీస్ సబార్డినేట్లు, రికార్డ్ అసిస్టెంట్లు, హెర్బెరియం కీపర్లు, సెక్యూరిటీ గార్డులకు నెలకు రూ. 15,600 చొప్పున వేతనాలు అందనున్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న వేలాది మంది తాత్కాలిక సిబ్బందికి పెద్ద ఊరట లభించినట్లయింది.

Next Story