నగరవాసులకు తీపికబురు.. మెట్రో సెకండ్ ఫేజ్‌కు గ్రీన్ సిగ్నల్

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-17 04:10:33  IST  )

ప్రతిష్టాత్మంగా చేపట్టబోతున్న హైదరాబాద్‌ మెట్రో రైలు సెకండ్ ఫేజ్ (బి) (Hyderabad Metro Rail Second Phase (B)) ప్రాజెక్ట్‌కు తెలంగాణ సర్కార్ పరిపాలనా పరమైన అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

నగరవాసులకు తీపికబురు.. మెట్రో సెకండ్ ఫేజ్‌కు గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మంగా చేపట్టబోతున్న హైదరాబాద్‌ మెట్రో రైలు సెకండ్ ఫేజ్ (బి) (Hyderabad Metro Rail Second Phase (B)) ప్రాజెక్ట్‌కు తెలంగాణ సర్కార్ పరిపాలనా పరమైన అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఇలంబర్తి (Ilambarti) సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ ఫేజ్‌లో భాగంగా మొత్తం రూ.19,579 కోట్ల అంచనా వ్యయంతో 86.1 కి.మీ మేర ప్రాజెక్ట్‌ నిర్మాణం కానుంది. ఇందులో కారిడార్-9‌లో ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిమీ., కారిడార్-10లో JBS నుంచి మేడ్చల్ వరకు 24.5 కి.మీ., కారిడార్-11లో JBS నుంచి శామీర్‌పేట్ వరకు 22 కి.మీ మేర ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నారు.

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ (Hyderabad Airport Metro Limited) ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్‌ వెంచర్‌గా హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ ఫేజ్ పనులు కొనసాగుతాయి. కాగా, ఇందులో తెలంగాణ ప్రభుత్వ వాటా 30 శాతం, కేంద్ర ప్రభుత్వ వాటా 18 శాతం, జైకా (JAICA), ఏడీబీ (ADB), ఎన్డీబీ (NDB) నుంచి రుణం వాటా 48 శాతం, పీపీపీ కాంపోనెంట్‌ 4 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మెట్రో రైలు సెకండ్ ఫేజ్ (బి) పరిపాలనా అనుమతుల ఆర్డర్ కాపీతో పాటు DPRకు జత చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు.

Next Story