బీసీలకు తీపి కబురు.. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు!

by Kema Shiva Kumar |

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నది.

బీసీలకు తీపి కబురు.. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. గతంలో కామారెడ్డి వేదికగా అధికార పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించగా.. ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రిజర్వేషన్ల అమలుకు సబ్ కమిటీ వేస్తూనే.. ముసాయిదా బిల్లును తీసుకొచ్చింది. అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించింది. స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులను తీసుకొచ్చింది. వాటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసి.. ఆ వెంటనే కేంద్రానికి పంపించింది.

సీఎం కీలక ఆదేశాలు..

మరోవైపు.. రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించక 16 నెలలు కావొస్తున్నది. గ్రామాల్లో పాలకవర్గాలు లేక పాలన అస్తవ్యస్తంగా తయారైంది. పంచాయతీల పదవీ కాలం 2024 జనవరి 31న.. జిల్లా, మండల పరిషత్‌ల గడువు జూలై 2024లో ముగిసింది. స్థానిక సంస్థలకు పాలక మండళ్లు లేకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధుల విడుదలలో జాప్యం జరుగుతున్నది. తద్వారా ఏటా ప్రభుత్వం రూ.1,500 కోట్లు నష్టపోతున్నది. అందుకే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధం అవుతున్నది. ఇప్పటివరకు 42 శాతం రిజర్వేషన్ల కోసం వేచిచూసిన ప్రభుత్వం.. ఆ మేరకు రిజర్వేషన్లు కల్పిస్తూనే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలనే లక్ష్యంతోనే ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించలేదు. అయితే.. రిజర్వేషన్ల అమలుపై, స్థానిక సంస్థల ఎన్నికలపై అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.

ఎన్నికలకు ఏర్పాట్లు..

ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఆలస్యం అవుతుండటంతో.. వెంటనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అనుకున్న ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూనే ఎన్నికలకు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఖరారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని సమాచారం. మరోవైపు.. ఇప్పటికే 42 శాతం రిజర్వేషన్ బిల్లును కేంద్రానికి పంపించారు. కేంద్రం నుంచి సైతం రిజర్వేషన్ బిల్లుకు సానుకూల స్పందన వచ్చే అవకాశాలు ఉన్నట్లు సీఎం భావిస్తున్నారు. అందులో భాగంగానే.. ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయని తెలిసింది. వచ్చే ఒకటి రెండు నెలల్లోనే ఎన్నికల క్రతువు ముగించేలా కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది.

చట్టబద్ధం కాకుంటే.. రాజకీయంగా..

ఒక వేళ కేంద్రం 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలపకుంటే.. ఇచ్చిన మాట ప్రకారం రాజకీయంగా రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇటీవల జరిగిన ఓ సభలోనూ రేవంత్‌ రెడ్డి ఇదే అంశాన్ని వెల్లడించారు. కేంద్రం ఒప్పుకోని పక్షంలో.. రాజకీయపరంగా పార్టీ తరఫున 42 శాతం బీసీలకు సీట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే మిగతా పార్టీలకు సైతం సవాల్ విసిరారు. అన్ని పార్టీలు 42 శాతం కేటాయించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఆలస్యం జరుగుతుండటంతో.. కేంద్రం వైఖరిపై ఎదురుచూస్తూనే.. రాష్ట్రంలో తదుపరి కార్యాచరణను అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలిసింది. అందుకే.. అధికారులకు సీఎం నుంచి ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. వెంటనే 42 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారని తెలిసింది.

Next Story