- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆశావహులకు తీపికబురు.. పంచాయతీ డ్రాఫ్ట్ ఓటరు లిస్ట్ రిలీజ్
గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా ముసాయిదాను ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా ముసాయిదాను ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డుల వారీగా ఓటరు జాబితాను గురువారం విడుదల చేశారు. ముసాయిదా ఓటరు జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయం, మండల ప్రజా ప్రరిషత్ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. ముసాయిదా ఓటరు జాబితా https://finalgprolls.tsec.gov.in/gpwardwisevoterlistrural1.do వెబ్‌సైట్‌లో ఓటరు జాబితా అందుబాటులో ఉంది. ఈ జాబితాను వార్డుల వారీగా రూపొందించారు. ఈ జాబితాపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 30వ తేదీ వరకు తెలపవచ్చు. ఈనెల 31న అభ్యంతరాలను డీపీవో పరిశీలిస్తారు. సెప్టెంబర్2న తుది ఓటరు జాబితాను గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా ప్రచురిస్తారు. ఓటరు జాబితా, పంచాయతీ ఎన్నికలకు పోలింగ్కేంద్రాల నిర్ణయానికి శుక్రవారం జిల్లా స్థాయిలో, శనివారం మండల స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహిస్తారు. వారి అభిప్రాయాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటారు. ఓటరు జాబితాతో పాటుగా సెప్టెంబర్ 2న పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటిస్తారు.
ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి..
ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించడానికి మండల ప్రజాపరిషత్ అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పెద్ద కసరత్తే చేశారు. వార్డుల వారీగా జాబితాను తయారు చేసే సమయంలో ఒక కుటుంబంలోని సభ్యులందరూ ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో పంచాయతీ కార్యదర్శులు మరోసారి ఓటరు జాబితాను పరిశీలించి ఒక ఇంటి కుటుంబ సభ్యులందరూ ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ప్రతి వార్డుకూ కనీసం ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గరిష్ఠంగా 600 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 650 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉంటే రెండో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏదైనా ఒక వార్డులో 1300 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉంటే మూడో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. శివారు గ్రామానికి సంబంధించి అక్కడే పోలింగ్కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పోలింగ్కేంద్రం ఒక కిలోమీటరు దూరం కంటే ఎక్కువగా లేకుంటే.. ఉండేలా ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలను మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాల్లో ఏర్పాటు చేయరాదని ఈసీ స్పష్టంచేసింది.






