సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు మహర్దశ.. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-05 08:07:28  IST  )

సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు సమర్థవంతంగా, సులువుగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా మెరుగైన సేవలు అందించేందుకు అనేక సంస్కరణలు తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు మహర్దశ.. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో/వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆలోచనలకు అనుగుణంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు సమర్థవంతంగా, సులువుగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా మెరుగైన సేవలు అందించేందుకు అనేక సంస్కరణలు తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. ఇవాళ అసెంబ్లీలో ఏవీఎన్ రెడ్డి (AVN Reddy) అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ.. ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి గంటల తరబడి చెట్ల కింద నిరీక్షించే పరిస్థితికి తెరపడుతున్నామని తెలిపారు. సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ వ్యవస్థ వల్ల అవినీతికి అడ్డుకట్ట పడుతుందని అన్నారు. రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు గాను 94 అద్దె భవనాల్లో, 50 ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మూడు దశల్లో అన్నింటికీ శాశ్వత భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా, పరిపాలనకు ఇబ్బంది లేకుండా అత్యాధునికంగా కార్పొరేట్ స్థాయిలో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను దశలవారీగా నిర్మిస్తున్నామని అన్నారు.

ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా..

ఇందులో భాగంగా మొదటి దశలో ఔటర్ రింగ్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి నాలుగు జిల్లాల్లోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 11 క్లస్టర్లుగా విభజించి సమీకృత సబ్ రిజిస్ట్రార్ భవనాలు నిర్మిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి 69 శాతం ఆదాయం వస్తుందని అన్నారు. గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్, ఆర్వో రంగారెడ్డి, గండిపేట్, శేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్‌లను క్లస్టర్‌గా విభజించామని గుర్తుచేశారు. ఈ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన కూడా చేశారని పేర్కొన్నారు. ఈ నెల చివరి నాటికి మిగిలిన 10 సమీకృత భవనాలకు కూడా శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ప్రభుత్వ తరపున ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ప్రైవేట్ బిల్డర్లు ఈ భవనాలను నిర్మించేలా ప్రణాళికలు రూపొందించామని అన్నారు. ఒక్కో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి మూడు నుంచి నాలుగు ఎకరాల స్థలాన్ని కేటాయించామని సభలో ప్రస్తావించారు. రెండో దశలో జిల్లా కేంద్రాల్లో, మూడో దశలో నియోజకవర్గాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు భవనాలను నిర్మిస్తామని అన్నారు. మొదటి ఐదేళ్లు ఈ భవనాలను నిర్మించిన సంస్థ మెయింటెనెన్స్ చేస్తుందని ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదని విన్నవించారు. స్లాట్ బుకింగ్ విధానం తీసుకురావడం వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయం చాలా వరకు తగ్గిందని, ఒక్కో డాక్యుమెంట్‌కు 18 నుంచి 21 నిమిషాల్లోనే పూర్తవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Read More..

అసెంబ్లీ ముట్టడికి రిటైర్డ్ ఉద్యోగుల యత్నం.. బక్క జడ్సన్ అరెస్ట్

Next Story