- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PF Money: ఎన్‌హెచ్ఎం పీఎఫ్ సొమ్ములో ‘గోల్‌మాల్’.. రూ.50 కోట్లు స్వాహా!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్ఎం) ఉద్యోగుల పీఎఫ్ నిధుల మళ్లింపు ఉదంతం బహుళ కోట్ల కుంభకోణంగా మారుతోంది.

జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్ఎం) ఉద్యోగుల పీఎఫ్ నిధుల మళ్లింపు ఉదంతం బహుళ కోట్ల కుంభకోణంగా మారుతోంది. గత 20 నెలలుగా సుమారు 12 వేల మంది ఉద్యోగుల వేతనాల నుంచి పీఎఫ్ రికవరీ చేసినా, అది వారి ఖాతాల్లో జమ కాకపోవడం అధికారుల పనితీరుపై సందేహాలను పెంచుతోంది. దాదాపు రూ. 50 కోట్ల భారీ సొమ్ము పక్కదారి పట్టినట్లు ప్రాథమిక అంచనాలు వెలువడుతుండటంతో ఉద్యోగ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల మౌనం వెనుక ఉన్న ఆంతర్యమేమిటో స్పష్టం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులైన ఏజెన్సీలు, అధికారులపై విచారణ జరిపి తమ కష్టార్జితాన్ని వెనక్కి ఇవ్వాలని వారు కోరుతున్నారు. పర్యవేక్షణ లోపం వల్ల జరిగిన ఈ భారీ మోసంపై ప్రభుత్వం స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని బాధితులు హెచ్చరిస్తున్నారు.
దిశ, నల్లగొండ బ్యూరో : ప్రతి మారుమూల పల్లె నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో 2008లో జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం (ఎన్ఆర్‌హెచ్ఎస్) ప్రారంభించింది. ఆ తర్వాత కొంతకాలానికి జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్ఎం)గా ప్రభుత్వం పేరు మార్పు చేసింది. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో వైద్యం అందించేందుకు సిబ్బందిని నియమించింది. ప్రతి 1000మంది జనాభాకు ఒక ఆశా వర్కర్‌ను నియమించగా, 4వేల జనాభా ఉంటే నలుగురు ఆశాలను నియమించారు. ఇదే పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.1500 మంది వైద్యులు, దాదాపు 10 వేల మంది ఆశాలతోపాటుగా ల్యాబ్ టెక్నీషియన్లు 300, ఫార్మాసిస్ట్‌లు 150, రెండవ ఏఎన్ఎంలు 1500, స్టాఫ్ నర్సులు 1500 తోపాటుగా అవసరమైన సిబ్బందిని సుమారు 2500 పైగా నియమించారు.
ప్రతి నెల రూ.2.5కోట్లు ఈపీఎఫ్..
ఈ పథకంలో పని చేసే ఉద్యోగులు ఆశ వర్కర్ల నుంచి వైద్య సిబ్బంది వరకు రూ.9 వేల నుంచి రూ.50 వేల వేతనం ప్రభుత్వం అందిస్తుంది. అయితే సుమారు రూ.22,500 వరకు వేతనం ఉన్న వారికే ఈపీఎఫ్ వర్తిస్తుంది. వీరికి దాదాపు 13 శాతం పీఎఫ్ కటింగ్ కూడా ఉంటుంది. ప్రభుత్వం అంతే శాతం జమ చేస్తుంది. అయితే ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విధుల్లో చేరిన ఉద్యోగులకు 2015 ఈపీఎఫ్ ఖాతాను తెరిచారు. ఈ మొత్తం ఉద్యోగులలో సుమారు 12వేల మందికి ప్రతి నెలా ఈపీఎఫ్‌లో దాదాపు రూ.2.5కోట్ల వరకు జమ చేసినట్లు తెలిసింది. అదే ఖాతాను దాదాపు ఏడేళ్ల వరకు కొనసాగించారు. అయితే 31 మార్చి 2022న ఉద్యోగులను వారి ఈపీఎఫ్ ఖాతా నుంచి తొలగించారు. తిరిగి 2023 డిసెంబర్ 1న ఆ ఉద్యోగులందరికీ కొత్తగా మరో ఖాతాను తెరిచారు.
20 నెలల ఈపీఎఫ్ సొమ్ము మాయం..?
జాతీయ ఆరోగ్య మిషన్‌లో పని చేసే ఉద్యోగులకు 2022 ఏప్రిల్ నుంచి 2023 నవంబర్ వరకు పీఎఫ్ నెంబర్ లేదు. కానీ ఉద్యోగుల నుంచి పీఎఫ్ సొమ్ము కట్ చేశారు. ఆ సొమ్ము దాదాపు ప్రతి నెలకు రూ.2.50 కోట్ల వరకు ఉంటుంది. అట్లా 20 నెలలకు సుమారు రూ.50 కోట్ల వరకు ఉంటుంది. ఆ సొమ్ము ఇప్పటి వరకు ఎక్కడ జమ చేశారో కూడా అధికారులకు స్పష్టత లేదు. అయితే ఇప్పుడు పూర్తిగా మాయమైనట్లు తెలుస్తోంది.
అధికారులే సూత్రధారులా..?
జాతీయ ఆరోగ్య మిషన్ విభాగంలో పనిచేసే వైద్య ఉద్యోగుల 20 నెలల పీఎఫ్ సొమ్ము మాయం కావడానికి సంబంధిత శాఖ అధికారులే సూత్రధారులని విమర్శలు వినిపిస్తున్నాయి. పీఎఫ్ సొమ్ము చెల్లించాల్సిన సంస్థలు ఒక్క నెల, లేదా రెండు నెలలు చెల్లించకపోతే అడగాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారులకు ఉంటుంది. దాంతోపాటు ఉద్యోగులకు కూడా సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుంది. కానీ ఆ ప్రయత్నం చేయకపోగా తమకు జరిగిన అన్యాయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే స్పందించడం లేదు. దానికి తోడు జిల్లా స్థాయిలో పనిచేసే అధికారులకు ఫోన్లు చేసి మరి ప్రశ్నించిన వారిని బెదిరించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ శాఖ అధికారులకు సంబంధం లేకపోతే ఎందుకు ఈ అంశాన్ని ఉద్యోగులు అడగక ముందే బయటకు చేయలేదో స్పష్టం చేయాల్సిన బాధ్యత వారిదే. అందుకే మాయమైన సుమారు రూ.20 కోట్ల సొమ్మును సంబంధిత ఏజెన్సీల నుంచి వసూలు చేయడమా?, లేకపోతే ఆ సొమ్ము మాయం కావడానికి కారణమైన బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు ఫిర్యాదు చేశాం - రవి, నల్లగొండ
జాతీయ ఆరోగ్య మిషన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన 20నెలల పీఎఫ్ సొమ్ము ఉద్యోగులకు చెందకుండా మాయం చేశారు. ఇదే విషయం డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌లో దాదాపు మూడు నెలల కింద అధికారులకు ఫిర్యాదు చేశాం. అయినా ఆ అంశంపై ఇంతవరకు విచారణ చేయలేదు.






