Medaram Jatara 2026 : మరికొన్ని గంటల్లో సారాలమ్మ ఆగమనం.. రహస్య పూజలు షురూ

by Bhoopathi Nagaiah |

కోటి మంది భక్తజనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. సారాలమ్మ తల్లి నేటి రాత్రి మేడారం గద్దెను ఎక్కనుంది.

Medaram Jatara 2026 : మరికొన్ని గంటల్లో సారాలమ్మ ఆగమనం.. రహస్య పూజలు షురూ
X

దిశ, మేడారం: కోటి మంది భక్తజనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. సారాలమ్మ తల్లి నేటి రాత్రి మేడారం గద్దెను ఎక్కనుంది. ఈ క్రతువును పూర్తి చేయడం కోసం ప్రధాన పూజారి కాక సారయ్య బుధవారం సాయంత్రం 3 :30 గంటలకు కన్నెపల్లిలోని అమ్మవారి గుడికి తరలిపోయారు. సారాలమ్మ వనదేవత బుధవారం రాత్రి గద్దెపై చేరనున్న సందర్భంలో వేలాది మంది భక్తులు కన్నెపళ్లి చేరుకొని అమ్మవారి దీవెనల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో పూజారి గుడిలోకి ప్రవేశించి రహస్య పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సామాన్య ప్రజలు ఇతర వ్యక్తులు గుడి సమీపంలోకి చేరకుండా అభ్యుదయ సంఘం సభ్యులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోగా జిల్లా పోలీసు యంత్రాంగం మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేసింది.

గంటన్నర పాటు రహస్య పూజలు

ప్రధాన పూజారీ సారయ్య తన ఇంటి నుండి బయలుదేరుతున్న సమయంలో భక్తులు ఎదుర్కొని అమ్మవారి దీవెనల కోసం సాష్టాంగ నమస్కారం చేసి ఎదురుగా నిలబడ్డారు. ఈ సందర్భంలో ప్రధాన పూజారిని తాకకుండా పోలీసులు, అభ్యుదయ సంఘ సభ్యులు పర్యవేక్షించారు. నాలుగు గంటల సమయంలో ఆలయంలో చేరుకున్న సారయ్య దాదాపు గంటన్నర పాటు రహస్య పూజలు నిర్వహించిన అనంతరం కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య తన సోదరుడు జంపన్న ను ముద్దాడి గద్దెపైకి చేరుకోరున్నారు. తొలి ఘట్టం బుధవారం రాత్రితో ముగుస్తుండడంతో తదుపరి ఘట్టం మహాదేవత అయిన సమ్మక్కను గురువారం సాయంకాలం గద్దెపై చేర్చనున్నారు. దీంతో పూర్తి స్థాయిలో వనదేవతలు గద్దెలపై ప్రతిష్టించిన అనంతరం నిండు పండుగ జరగనున్నది.

హనుమంతుని రక్షా కవచం నీడలో..

ఆదివాసీ గిరిజన సాంప్రదాయం, ఆచారాలతో మరి కొన్ని గంటల్లో మేడారం సమీపంలోని కన్నెపల్లి నుండి సారలమ్మ గద్దెపైకి రానుంది. బుదవారం మహా జాతర అంకురార్పణతో గిరిజన పూజారులు, అధికారులు ​గద్దెల శుద్ధీకరణ చేశారు. సాయంత్రం 5గంటల నుండి 6 గంటల సమయంలో కన్నెపల్లి నుంచి హనుమంతుని రక్షా కవచం నీడలో సారలమ్మ రాక జంపన్న వాగు మీదుగా బయలుదేరి రాత్రి 9 నుండి 10 గంటల మద్యలో గద్దెలకు చేరుకోనున్నారు. ఇప్పటికే కొండాయి నుండి గోవిందరాజులు, పూనుగొండ్ల నుంచి పగిడిద్ద రాజులను ఆదివాసీ గిరిజన పూజారులు మేడారం గద్దెలపై ప్రతిష్టించారు. సారలమ్మ రాక కోసం ప్రభుత్వం, ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ లు తెలిపారు.

Next Story