మనుషులకు మేకల రక్తం..? హైదరాబాద్‌లో వెలుగు చూసిన మాఫియా బాగోతం

by Ramesh Naini |   (  Updated:2026-01-08 02:46:18  IST  )

మనుషులకు మేకల రక్తం.. ఇదేంటి మేకల రక్తాన్ని మనుషులకు ఎక్కిస్తారా? ఆశ్చర్యపోకండి.. అవును మీరు చదివింది నిజమే. అక్రమ సంపాదనకు అలవాటుపడిన బ్లడ్ మాఫియా ఈ తరహా దందాను ఎంచుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మనుషులకు మేకల రక్తం..? హైదరాబాద్‌లో వెలుగు చూసిన మాఫియా బాగోతం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మనుషులకు మేకల రక్తం.. ఇదేంటి మేకల రక్తాన్ని మనుషులకు ఎక్కిస్తారా? ఆశ్చర్యపోకండి.. అవును మీరు చదివింది నిజమే. అక్రమ సంపాదనకు అలవాటుపడిన బ్లడ్ మాఫియా ఈ తరహా దందాను ఎంచుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేకలు, గొర్రెల నుంచి అక్రమంగా సేకరించిన రక్తాన్ని మనుషులకు ఎక్కిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగారంలో ఇటీవల వెలుగుచూసిన ఓ ఘటన వైద్యరంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కీసర పోలీసులు ఈ నెల 4న నాగారంలోని చికెన్ షాపుపై దాడులు చేయగా.. 130 ప్యాకెట్ల మేకల రక్తం దొరికింది. అయితే ఈ రక్తాన్ని కాచిగూడలోని సీఎన్‌కే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌ పోర్ట్స్ సంస్థకు తరలించి.. అక్కడి నుంచి లేబొరేటరీల్లో ప్లేట్ లెట్ల తయారీకి వినియోగిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ‘గోట్ బ్లడ్ మాఫియా’ ఎటువంటి వైద్య ప్రమాణాలు పాటించకుండా మేకలు, గొర్రెల నుంచి అక్రమంగా రక్తం సేకరించి, దాన్ని ప్లేట్ లెట్ల తయారీకి తరలిస్తుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. దీంతో అనారోగ్యానికి గురై ప్లేట్ లెట్లు అవసరమైనప్పుడు మనిషి రక్తం ఎక్కిస్తున్నారా? లేక మేక బ్లడ్ ఎక్కిస్తున్నారా? అని అనుమానించాల్సిన పరిస్థితి నెలకొన్నది.

ఎక్కిస్తే ప్రాణాంతక రియాక్షన్లు..

డెంగీ, క్యాన్సర్ శస్త్రచికిత్సల సమయంలో తీవ్ర రక్తస్రావాన్ని నియంత్రించేందుకు ప్లేట్ లెట్ల పాత్ర కీలకం. ప్రభుత్వ అనుమతితో ఉన్న బ్లడ్ బ్యాంకులు, ల్యాబ్‌లలో కఠినమైన బయోసేఫ్టీ ప్రమాణాలతో మాత్రమే వీటిని తయారుచేస్తారు. మేకలు, గొర్రెల వంటి జంతువుల రక్తాన్ని ప్లేట్ లెట్ల తయారీలో వాడరు. జంతువుల రక్తంలోని ప్రొటీన్లు, యాంటీజెన్లు మనిషి శరీరానికి పడవు. జంతు రక్తానికి సంబంధించి ప్లేట్ లెట్లు ఎక్కిస్తే అక్యూట్ హీమోలిటిక్ రియాక్షన్ వల్ల రక్తం లోపలే పగిలిపోయి, కిడ్నీలు పాడై, గంటల్లోనే మరణం సంభవించవచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అనాఫైలాక్సిస్ (తీవ్ర అలర్జిక్ షాక్) వల్ల ఊపిరి అందక, గుండె ఆగిపోయే ప్రమాదముందని పేర్కొంటున్నారు. జంతురక్తంలోని వైరస్ లు, బ్యాక్టీరియా నేరుగా రోగి శరీరంలోకి చేరి సెప్సిస్ కు దారితీస్తాయని చెబుతున్నారు. జెనెటిక్, ఇమ్యూనాలజికల్ మిస్‌మ్యాచ్ కారణంగా జీవితాంతం ఇమ్యూన్ సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉందని వివరిస్తున్నారు. ఈ తరహా ప్రతికూల ప్రభావాలను జాతీయ స్థాయిలో ట్రాక్ చేసే వ్యవస్థను హీమోవిజిలెన్స్ అంటారు. ఇలాంటి అక్రమ రక్త ఉత్పత్తులు వాడితే వచ్చే రియాక్షన్లను ప్రభుత్వానికి తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ప్రాణాలతో చెలగాటం..

వైద్య పర్యవేక్షణ లేకుండా మేకల నుంచి రక్తం తీసుకోవడంతో అవి కొద్ది గంటల్లోనే బలహీనమై మరణిస్తున్నాయని పోలీసుల విచారణలో తేలింది. రక్తం తీసిన తర్వాత వాటిని చంపి మటన్‌గా అమ్మడం మరో దారుణం. ఇది జంతు సంక్షేమ చట్టాల ఉల్లంఘనతో పాటు, డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ చట్టం, బ్లడ్ బ్యాంక్ నిబంధనల ఉల్లంఘన. కాగా, రోగుల ప్రాణాలతో చెలగాటమాడటం హత్యాయత్నంతో సమానమైన మెడికల్ నేరమని నిపుణులు పేర్కొంటున్నారు.

సమగ్ర దర్యాప్తు అవసరం..

ఈ అక్రమ రక్తం గతంలో ఎక్కడెక్కడికి వెళ్లింది? ఎన్ని ల్యాబ్‌లు, ఆస్పత్రులు దీనిని ఉపయోగించాయి? అనే వాటిపై సమగ్ర దర్యాప్తు చేయాలని వైద్య, ప్రజారోగ్య నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా వైద్యాధికారులు, డ్రగ్స్ కంట్రోల్, మెడికల్ కౌన్సిల్, వెటర్నరీ శాఖ, జీహెచ్‌ఎంసీ, పోలీసులు కలిసి రాష్ట్రవ్యాప్తంగా బ్లడ్ బ్యాంకులు, బయోలాజికల్ ఉత్పత్తుల ల్యాబ్‌లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని సూచిస్తున్నారు. నాగారంలో బయటపడిన ఈ ఘటన రాష్ట్రంలో నడుస్తున్న ఒక పెద్ద అక్రమ బ్లడ్ మాఫియాలో చిన్న భాగం మాత్రమేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కఠిన చర్యలు తీసుకోకపోతే ఇది ప్రజారోగ్యానికి తీవ్రమైన విపత్తుగా మారే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

రోగి చనిపోయే ప్రమాదం : డాక్టర్ జి.శ్రీనివాస్, వైస్ చైర్మన్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్

మనిషికి మనిషి రక్తం నుంచి సేకరించిన ప్లేట్ లెట్స్ మాత్రమే ఉపయోగించాలి. అలా కాకుండా మేక రక్తం నుంచి తీసిన ప్లేట్ లెట్స్ ఎక్కిస్తే అత్యంత ప్రమాదకరం. పేషెంట్ చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటి వాటిని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ ఇలాంటి ఘటన ఎవరి దృష్టికి వచ్చినా.. మాకు సమాచారమందించాలి.

సూక్ష్మజీవులను గుర్తించడానికి.. : ప్రొఫెసర్ సీఎస్ ముజీబుద్దీన్, సీఈవో, క్లినిసోల్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్

సూక్ష్మజీవులను గుర్తించడానికి, ఇన్ఫెక్షన్లను నిర్ధారించడానికి ప్రయోగశాలల్లో ఉపయోగించేందుకు గుర్రం, గొర్రెలు, మేకల రక్త ఉత్పత్తులు విస్తృతంగా వినియోగిస్తారు. అయితే ఈ రక్తం పశువైద్యుల పర్యవేక్షణలో మాత్రమే సేకరించాల్సి ఉంటుంది. అయితే జంతు రక్తాన్ని మానవ రక్తమని తప్పుగా లేబులింగ్ చేసి ప్రయోగశాలలకు లేదా ఇతర సంస్థలకు విక్రయించే ప్రమాదం ఉంది. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

Next Story