- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుదిబండలా మారిన జీవో నెం.317.. స్పౌజ్ బదిలీలకు తప్పని ఎదురుచూపులు
రాష్ట్రంలో 317 జీవో బాధిత భార్యాభర్తలు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 317 జీవో బాధిత భార్యాభర్తలు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన జీవో 317 బాధితులు అనేక మార్లు ధర్నాలు, నిరసనలు తెలిపారు. అయితే గత ప్రభుత్వం స్పందించకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ సమస్యపై దృష్టి పెట్టింది. కేబినెట్ సబ్ కమిటీని నియమించి ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో కమిటీ నివేదిక అనంతరం ఉద్యోగులుగా ఉన్న భార్యాభర్తలను ఒకే చోటుకు బదిలీ చేసే విధంగా అవకాశం కల్పించారు. అయితే భార్యాభర్తల్లో ఒకరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, మరొకరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న వారికి మాత్రం స్పౌజ్ గ్రౌండ్‌లో బదిలీలకు చాన్స్ ఇవ్వడం లేదు. వీరు అనేకమార్లు వినతి పత్రాలు ఇచ్చినా, మొరపెట్టుకున్న ఫైల్ మాత్రం ముందుకు కదలడంలేదు. వీరు కేవలం 40 మంది మాత్రమే ఉన్నారని అధికారులు గుర్తించారు. ఆ కొద్ది మందికీ స్పౌజ్ బదిలీలకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
వారికో న్యాయం.. మాకు మరో న్యాయమా?
పోస్టల్, ఆర్మీ, బీఎస్ఎన్ఎల్, డీఆర్‌డీవో, ఏజీ ఆఫీసు, జీఎస్ఐ, షాద్ నగర్‌లో ఉన్న ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్సీ), రైల్వే, తదితర కార్యాలయాల్లో పనిచేస్తున్న వారు ఈ లిస్టులో ఉన్నారు. వీరిలో అనేక మంది నాన్ట్రాన్స్ఫరబుల్ పోస్టుల్లో పనిచేస్తున్నారు. కొద్ది మంది మాత్రమే హైదరాబాద్ జిల్లాకు రావాల్సి ఉంటుంది. మిగిలిన వారందరూ హైదరాబాద్‌యేతర జిల్లాలకు బదిలీ చేయాలని కోరుకుంటున్నారు. హైదరాబాద్‌కు బదిలీ చేయడానికి ప్రభుత్వానికి ఇబ్బంది ఉండొచ్చు.. కానీ ఇతర జిల్లాలకు బదిలీ చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్యాభర్తలకు ఒక న్యాయం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరొక న్యాయమా? అని నిలదిస్తున్నారు. ఈ ఉద్యోగులు హైకోర్టుకు వెళ్లినా న్యాయస్థానం ఆదేశాలను సైతం ప్రభుత్వం అమలు చేయడంలేదని ఆరోపిస్తున్నారు. సరైన కారణం కూడా చూపించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కువ మంది విద్యా శాఖకు చెందిన వారే..
తమ విజ్ఞప్తిని కనీసం పరిశీలించడంలేదని, సచివాలయంలోని ఒకరిద్దరు ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగా తమ పట్ల నిర్లక్ష్యంగా, చిన్నచూపు చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. 40 మంది ఉద్యోగుల్లో ఎక్కువ మంది విద్యాశాఖకు సంబంధించిన వారే ఉన్నారు. వారు కూడా హైదరాబాద్ జిల్లాకు సంబంధంలేని వారేనని చెబుతున్నారు. మరి ఎందుకో.. ప్రభుత్వానికి ఎక్కడ ఇబ్బంది వస్తుందో.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరుతున్నారు. వెంటనే భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు.






