Congress: స్థానిక ఎన్నికల్లోపే మాకు పదవులివ్వండి.. టీ కాంగ్రెస్ లో మరో డిమాండ్

by Prasad Jukanti |

తెలంగాణ కాంగ్రెస్ లో మరో డిమాండ్ వినిపిస్తోంది.

Congress: స్థానిక ఎన్నికల్లోపే మాకు పదవులివ్వండి.. టీ కాంగ్రెస్ లో మరో డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రేపు జరగబోయే పీసీసీ, కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల (PAC meeting) కమిటీ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. హైదరాబాద్ గాంధీ భవన్ లో రేపు సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, కమిటీల సభ్యులు పాల్గొననున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో తదుపరి కార్యాచరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. రిజర్వేషన్ల అంశం ఇంకా కొలిక్కి రాకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ చేపట్టాలా వద్దా? ఒక వేళ ఎన్నికలకు వెళ్లాలనే భావిస్తే రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇవ్వాలా లేదా మరేదైనా మార్గం చూడాలా అనే విషయంలో పార్టీలోని మెజార్టీ నేతల అభిప్రాయం మేరకు నిర్ణయించబోతున్నారు. దీంతో రేపటి సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకోంది. అయితే పీఏసీ సమావేశం ముగిశాక ఈ నెల 25న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతున్నది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు, రిజర్వేషన్ల విషయంలో అధికార పక్షం తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

మాకు పదవులివ్వండి:

కాంగ్రెస్ పై యాదవ (Yadavs) సామాజిక వర్గ నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే తమకు పదవుల్లో అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి పదవి, ప్రభుత్వ సలహాదారు, 5కార్పొరేషన్ చైర్మన్లు, 5 డీసీసీ అధ్యక్ష పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే వైన్ షాప్ లలో ఎస్సీ, ఎస్టీ, గౌడ్స్ తో పాటు బీసీలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే యాదవులకు జరిగిన అన్యాయంపై రేపటి పీఏసీ సమావేశంలో చర్చించాలని కోరుతున్నారు.

Next Story