GHMC: నాలాలకు ఇక స్పెషల్ మాస్టర్ ప్లాన్.. ఆ టెక్నాలజీతో మ్యాపింగ్

by Kema Shiva Kumar |

గ్రేటర్ హైదరాబాద్‌లో నాలాల వ్యవస్థ, సీవరేజీ వ్యవస్థలను వేర్వేరుగా నిర్వహిస్తున్నారు.

GHMC: నాలాలకు ఇక స్పెషల్ మాస్టర్ ప్లాన్.. ఆ టెక్నాలజీతో మ్యాపింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో నాలాల వ్యవస్థ, సీవరేజీ వ్యవస్థలను వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. జలమండలి ఆధ్వర్యంలో సీవరేజీ మాస్టర్ ప్లాన్ రూపొందించారు. దీన్ని అమలు చేయడానికి సుమారు రూ.17వేల కోట్లు అవుతుందని అంచనా వేశారు. అదే తరహాలో వరద నీటి నాలాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అసలు గ్రేటర్‌లో నాలా వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఎక్కడి నుంచి ఎక్కడి నీరు పారుతోంది? ఈ నీరంతా ఎటు పోతుంది? భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల మునక, వాటర్ లాగింగ్ పాయింట్లు వంటి వాటిని పూర్తిగా అధ్యయనం చేయడంతో పాటు ప్రణాళికాబద్దంగా నిర్వహించడానికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సంబంధిత అధికారులకు కమిషనర్ ఇలంబర్తి సూచించారు.

నాలాలు ఇలా..

మహానగరంలో చిన్న, మధ్య, భారీ తరహా నాలాలన్నీ సుమారు 800 కి.మీ.ల పొడువున ప్రవహిస్తుండగా, వీటిలో ఐదు మేజర్ నాలాలు దాదాపు 339 కి.మీ.ల మేరకు ప్రవహిస్తున్నాయి. మహానగరంలో చినుకు పడిందంటే చాలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావాల్సిందే. ఎందుకంటే నీరు ఇంకిపోవడానికి లేదు.. ఆ నీళ్లు సాఫీగా వెళ్లడానికి లేదు. ఈ సమస్య దశాబ్దాల పాటు నగరాన్ని వెంటాడుతూనే ఉంది. 20 ఏళ్ల క్రితం నగరాన్ని వర్షం ముంచెత్తినప్పుడు శాశ్వత పరిష్కారం కోసం అప్పటి ప్రభుత్వం నియమించిన కిర్లోస్కర్ కమిటీ చేసిన ఈ సిపార్సులను అమలు చేసి, నాలాలపై ఆక్రమణలను తొలగించాల్సిన అధికారులు ఎప్పటికప్పుడు ఆక్రమణలు పెరుగుతున్నా చూసీచూడనట్లుగా వ్యవహరించడం వల్లే నేడు ఈ దుస్థితి నెలకొందనే విమర్శలు ఉన్నాయి. దీంతో పాటు వయాంట్స్ ఏజెన్సీ ద్వారా కూడా సర్వే చేయించారు. తర్వాత జేఎన్టీయూ సర్వే చేసి రిపోర్టు ఇచ్చింది. ఆ నివేదికలను అటకెక్కించారు. 2020 వరదల తర్వాత నగరంలో వరదనీటి కాలువలను అభివృద్ధి చేయడానికి స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రొగ్రామ్(ఎస్ఎన్డీపీ) విభాగాన్ని ఏర్పాటు చేశారు.

స్టార్మ్ వాటర్ నాలా మాస్టర్ ప్లాన్..

రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ తరహాలోనే హైదరాబాద్ నగరం వర్షపు నీటి పారుదల క్రమబద్ధమైన అభివృద్ధి, నిర్వహణ, విస్తరణను నిర్ధారించడానికి నాలా అభివృద్ధికి మాస్టర్ ప్రణాళిక అవసరమని కమిషనర్ ఇలంబర్తి సూచించారు. ఇది వరద తగ్గింపునకు పరిష్కారంతో పాటు ఇప్పటికే ఉన్న నాలాలను కొత్త పట్టణ విస్తరణతో అనుసంధానించడానికి ఉపయోగపడేలా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలో వరద నీటి కాలువలకు సంబంధించిన నెట్‌వర్క్‌ను గుర్తించడానికి శాటిలైట్ ఇమేజింగ్ ఆధారంగా మ్యాపింగ్ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన మ్యాపింగ్ పనులను జీహెచ్ఎంసీ ఐటీ విభాగం ద్వారా చేయించాలని నిర్ణయించారు. డీపీఆర్ తయారు చేయడానికి ఇంజినీరింగ్ అధికారులు సర్వే చేయనున్నారు.

మూసీకి అనుసంధానంగా..

నగరంలో వరద నీటి కాలువలకు మాస్టర్ ప్లాన్ తయారు చేయడంతో వర్షపు నీటిని మూసీలోకి పంపించేవిధంగా నెట్‌వర్క్ ఏర్పాటు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో పాటు వర్షాకాలంలో వరద నివారణ కోసం ప్రధానమైన ప్రాంతాల్లోని వాటర్ లాంగింగ్ దగ్గర రూ.100 కోట్ల అంచనా వ్యయంతో 50 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించింది. మొదటి దశలో భారీగా నీరు నిలిచి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతున్న వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించి రూ.17.09 కోట్ల వ్యయంతో 12 లొకేషన్లలో 13 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ల నిర్మాణ పనులు చేపట్టారు. రాజ్‌భవన్ ముందు, ఆర్టీఏ ఆఫీసు ఎదురుగా ఉన్న ప్రాంతంలో వీటిని పూర్తిచేశారు. ఈ నీటిని సమీపంలోని నాలా ద్వారా మళ్లించనున్నారు.

నత్తనడకన ఎస్ఎన్డీపీ పనులు..

నగరంలో 2020 భారీ వరదల కారణంగా నగరం అతలాకుతలమైన సందర్భంగా ఎస్ఎన్డీపీ ద్వారా వరదనీటి కాలువను నిర్మించాలని నిర్ణయించారు. నిధులు పుష్కలంగా ఉన్నా.. పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. మొదటి దశలో రూ.780 కోట్లతో 50.70 కిలోమీటర్ల పోడవులో 40 పనులు చేయాలని గుర్తించారు. వీటిలో 28 పనులు మాత్రమే పూర్తిచేశారు. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. రెండో దశలో రూ.2141.22 కోట్లతో 148 పనులు చేయాలని గుర్తించారు. వీటిలో ప్రాధాన్యత క్రమంలో 54 కిలో మీటర్ల పాటు 40 పనులను రూ.667.28 కోట్లతో చేపట్టాలని నిర్ణయించారు. గతేడాది డిసెంబర్ నాటికి ఒక్క పని కూడా పూర్తికాలేదు. ఏడు పనులు పురోగతిలో ఉన్నాయి. 13 పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. మిగిలిన 16 పనులు టెండర్ దశలోనే ఉన్నాయి. 2025-26 లో రూ.374 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. పాతబస్తీలో రూ.545 కోట్ల వ్యయంతో ఎస్ఎన్డీపీ చేపట్టేందుకు టెండర్ పక్రియ పూర్తి చేయాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. దారుసలాం నుంచి చక్నావాడి కల్వర్ట్ వరకు ఆర్సీసీ బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి రూ.7.40 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. జూబ్లీహిల్స్‌లోని బంజారా భవన్ నుంచి బంజారా చెరువు వరకు వరద నీటి కాలువను నిర్మించడానికి రూ.22.17 కోట్లు మంజూరు చేయాలని స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది.

Next Story