ఇంటి నుంచే జీహెచ్‌ఎంసీ సేవలు.. వాట్సాప్‌ మీసేవకు మంచి స్పందన

by Ramesh Naini |

జీహెచ్‌ఎంసీకి సంబంధించిన పౌర సేవలను కొత్తగా మీసేవ వాట్సాప్‌, చాట్‌బాట్‌ ద్వారా తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజలకు మరింత సౌకర్యవంతంగాను పారదర్శకత కల్పించే దిశగా ఈ సేవలను విస్తరించారు.

ఇంటి నుంచే జీహెచ్‌ఎంసీ సేవలు.. వాట్సాప్‌ మీసేవకు మంచి స్పందన
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్‌ఎంసీకి సంబంధించిన పౌర సేవలను కొత్తగా మీసేవ వాట్సాప్‌, చాట్‌బాట్‌ ద్వారా తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజలకు మరింత సౌకర్యవంతంగాను పారదర్శకత కల్పించే దిశగా ఈ సేవలను విస్తరించారు. ఈ మేరకు ఎలక్ట్రానిక్‌ సర్వీస్‌ డెలివరీ విభాగం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నాయకత్వంలో మీసేవ ద్వారా పౌర సేవలను మరింతగా తీర్చిదిద్దుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్‌ సేవల ప్రధాన వేదికగా ఉన్న మీ-సేవను వాట్సాప్‌, చాట్‌బాట్‌ ద్వారా మరింత విస్తరించారు. ఈ అదనపు డిజిటల్‌ ఛానల్‌ను 2025 నవంబర్‌ 18న ప్రారంభించారు. కొత్తగా జీహెచ్‌ఎంసీ ప్రాపర్టీ అసెస్‌మెంట్‌ రివిజన్‌, జనన ధ్రువీకరణ సవరణ, మరణ ధ్రువీకరణ సవరణ, బర్త్‌ హోమ్‌ (ఇంటి దగ్గర పుట్టిన), డెత్‌ హోమ్‌(ఇంటి దగ్గర చనిపోయిన), ప్రాపర్టీ డోర్‌ నంబర్‌ సవరణ, ప్రాపర్టీ పేరు సవరణ, ప్రాపర్టీ ట్యాక్స్‌ సేవలు, ట్రేడ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ సేవలను వాట్సాప్‌ మీసేవలో చేర్చారు. రాష్ట్రవ్యాప్తంగా పౌరులు ఈ సేవలను వాట్సాప్‌ ద్వారానే పొందవచ్చని ఎలక్ట్రానిక్‌ సర్వీస్‌ డెలివరీ విభాగం తెలిపింది.

వాట్సాప్ నంబర్ 8096958096..

సేవలు పొందేందుకు ముందుగా 8096958096 నంబర్‌ను మొబైల్‌లో ‘MeeSeva Telangana’ పేరుతో సేవ్‌ చేసుకోవాలి. అనంతరం వాట్సాప్‌లో ఆ నంబర్‌కు ‘Hi’ సందేశం పంపాలి. అవసరమైన సేవ పేరు టైప్‌ చేసి, మెనూలో కనిపించే ‘Open Service’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఫారంలో అడిగిన వివరాలు, చెల్లింపు పూర్తిచేస్తే దరఖాస్తు వెంటనే వాట్సాప్‌ ద్వారా నమోదవుతుంది. వాట్సాప్‌ ఆధారిత మీసేవ వేదికకు ప్రారంభం నుంచి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని ప్రభుత్వం వెల్లడించింది. జనన ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, పోలీస్‌ చలాన్‌, విద్యుత్‌ బిల్లు, బీఐఈ ఫలితాల సేవలను ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నట్లు తెలిపింది. రోజువారీ పరిపాలన సేవలకు వాట్సాప్‌పై ప్రజల ఆధారపడటం పెరుగుతోందని పేర్కొంది. డిజిటల్‌ సేవలను నిరంతరం విస్తరించడం, ప్రభుత్వ వ్యవస్థల విశ్వసనీయతను బలోపేతం చేయడం, పౌరులకు సులభమైన అనుభవం కల్పించడం తమ లక్ష్యమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

Next Story