360 లైఫ్ ప్రాజెక్టుపై జీహెచ్ఎంసీకి ఎందుకంత ప్రేమ.. స్పెష‌ల్ ట్రీట్‌మెంట్‌ అందుకేనా..?

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-08-28 12:03:22  IST  )

హైటెక్ సిటీ(Hi-Tech City)కి సమీపంలో నిర్మిస్తోన్న 360 లైఫ్ (360 Life Project) ప్రాజెక్టు గురించి తెలుసుకుంటే నిజమేననిపిస్తున్నది.

360 లైఫ్ ప్రాజెక్టుపై జీహెచ్ఎంసీకి ఎందుకంత ప్రేమ.. స్పెష‌ల్ ట్రీట్‌మెంట్‌ అందుకేనా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్‌లో కొన్ని నిర్మాణ సంస్థలు నిబంధనలను తుంగలో తొక్కుతాయి. వారికి అధికారులు కూడా వత్తాసు పలుకుతుండడంతో ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది. కొంద‌రు బిల్డర్లు(Builders) కడుతున్న నిర్మాణాలను చూస్తుంటేనే ఇది అర్థమవుతుంది. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నిర్మాణాల్ని చేప‌డుతున్నా జీహెచ్ఎంసీ (GHMC) క‌ళ్లు మూసుకుంటుంద‌న్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైటెక్ సిటీ(Hi-Tech City)కి సమీపంలో నిర్మిస్తోన్న 360 లైఫ్ (360 Life Project) ప్రాజెక్టు గురించి తెలుసుకుంటే నిజమేననిపిస్తున్నది. 25 అంత‌స్తుల అపార్టుమెంట్‌కు అగ్నిమాప‌క శాఖ(Fire Department) నుంచి ఎన్వోసీ, పౌర‌ విమాన‌యాన శాఖ (Department of Civil Aviation) నుంచి నిర‌భ్యంత‌ర ధృవీక‌ర‌ణ ప‌త్రం లేకున్నా అనుమతులు దక్కాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అదొక్కటే కాదు.. పదికి పైగానే లోపాలు ఉన్నాయని సమాచారం. న‌మితా హోమ్స్(Namita Homes) ఇచ్చే కాసుల‌కు కక్కుర్తిప‌డిన జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం అనుమతులు జారీ చేసినట్లు రియల్ ఎస్టేట్ (Real estate) వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అధికారులు క‌ళ్లు మూసుకొని అనుమతులు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం త‌ర‌హాలో తాము కొందరు బిల్డర్లకు స్పెష‌ల్ ట్రీట్‌మెంట్ ఇవ్వలేమని క్రెడాయ్ హైద‌రాబాద్ ప్రాప‌ర్టీ షో(CREDAI Hyderabad Property Show)లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)స్పష్టం చేశారు. కానీ ఈ కంపెనీ మీద జీహెచ్ఎంసీ అధికారులకు వల్లమాలిన ప్రేమ కనిపిస్తున్నది. ఇలాంటి బిల్డర్లకు ప్రత్యేక బహుమతులు ఎందుకు ఇస్తున్నారని మార్కెట్ నిపుణులు విస్తుపోతున్నారు.

360 డిగ్రీస్ ప్రాజెక్టుతో జీహెచ్ఎంసీకి ఉన్న దోస్తానా గురించి హైకోర్టు మొట్టికాయలు వేసేంత‌ వ‌ర‌కు బ‌య‌టికి రాలేదు. హైటెక్ సిటీ చేరువ‌లో ఫైర్ డిపార్టుమెంట్, ఎయిర్‌పోర్టు ఎన్వోసీ లేకుండా, అక్రమంగా అద‌న‌పు అంత‌స్తుల్ని నిర్మిస్తుంటే జీహెచ్ఎంసీ ఆ నిర్మాణాన్ని నిలిపి వేయ‌కుండా ఏం చేస్తోంద‌ని తెలంగాణ హై కోర్టు(Telangana High Court) ఇటీవల ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేసింది. హైటెక్ ‌సిటీ చేరువ‌లో న‌మితా హోమ్స్‌ 25 అంత‌స్తుల ఎత్తులో నిర్మిస్తున్న 360 లైఫ్ ప్రాజెక్టును 2025 మే నెల‌లో బల్దియా నిలిపివేసింది. ప్రాజెక్టులోని అక్రమాలను సరి చేయకుండా నెల రోజుల్లోనే మళ్లీ అనుమ‌తులను జారీ చేయడం ఏమిటని జీహెచ్ఎంసీని నిల‌దీసింది.

సరి చేయకుండానే..

న‌మితా హోమ్స్ సంస్థ హైటెక్స్ చేరువ‌లో 360 లైఫ్ అనే ప్రాజెక్టుకు చెందిన కొంద‌రు షేర్ హోల్డర్లు జీహెచ్ఎంసీ తిరిగి అనుమ‌తులు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో కేసు దాఖ‌లు చేశారు. ఈ నిర్మాణంలో సుమారు ప‌ద్దెనిమిది లోపాల‌ను గ‌మ‌నించిన జీహెచ్ఎంసీ వాటిని స‌రిదిద్దకుండా తిరిగి అనుమ‌తిని ఎలా మంజూరు చేసిందంటూ ప్రశ్నించారు. దీనికి జీహెచ్ఎంసీ స‌మాధాన‌మిస్తూ ఒక‌వేళ నిర్మాణ లోపాల్ని స‌వ‌రించ‌క‌పోతే, ఆక్యుపెన్సీ స‌ర్టిఫికెట్ జారీ చేసేట‌ప్పుడు త‌గిన చ‌ర్యల్ని తీసుకుంటామ‌ని కోర్టుకు తెలిపింది. ఐతే దీనిపై హైకోర్టు ఘాటుగా స్పందించింది. అలాంటి చ‌ర్యల వ‌ల్ల అక్రమ నిర్మాణాల్ని ప్రోత్సహించిన‌ట్లు అవుతుంద‌ని స్పష్టం చేసింది. ముందుగా జారీ చేసిన నిర్మాణం నిలిపివేయమనే ఆదేశం గురించి రీవాలిడేషన్ లేఖలో ఒక్కసారి కూడా ఎందుకు ప్రస్తావించలేద‌ని బెంచి ప్రత్యేకంగా ప్రశ్నించడం విశేషం. ఈ మొత్తం నిర్మాణంపై స్టే విధిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. మ‌రి ఇప్పుడు ఈ ప్రాజెక్టులో కొన్న వారి ప‌రిస్థితి ఏమిటో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ టాపిక్ పై రియల్ ఎస్టేట్ మార్కెట్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది.

Next Story