GHMC: జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. స్ట్రీట్ లైట్స్ మెయిన్‌టెనెన్స్‌కు న్యూ పాలసీ

by Kema Shiva Kumar |

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వీధి దీపాల నిర్వహణకు కొత్త విధానాన్ని తీసుకురావడానికి జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

GHMC: జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. స్ట్రీట్ లైట్స్ మెయిన్‌టెనెన్స్‌కు న్యూ పాలసీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వీధి దీపాల నిర్వహణకు కొత్త విధానాన్ని తీసుకురావడానికి జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికోసం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, భువనేశ్వర్, సూరత్ నగరాల్లో వీధి లైట్ల నిర్వహణకు ఇండ్యూడవల్ లైట్ మానిటరింగ్ (ఐఎల్ఎం) విధానాన్ని అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయడంతోపాటు నివేదిక తయారుచేయాలని నిర్ణయించారు. పాత విధానంలో విద్యుత్ దుర్వినియోగంతోపాటు బిల్లుల చెల్లింపులోనూ అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు కమిషనర్ ఇలంబర్తి ప్రత్యేక దృష్టి సారించారు.

విద్యుత్ వినియోగం ఆధారంగా..

జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. 30 సర్కిళ్ల పరిధిలో వీధి దీపాల లెక్కలే సరిగ్గాలేవని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు ఎన్ని లైట్లు ఉన్నాయి? ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారో కూడా లెక్కల్లేవని అధికారులు చెబుతున్నారు. బిల్లుల చెల్లింపులోనూ స్పష్టమైన విధానం లేదని గుర్తించారు. క్షేత్ర స్థాయి అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీలు ఇచ్చినవే తప్ప వీటిని పక్కాగా లెక్కించిన దాఖలాలు లేవు. పాత లెక్కలకు స్వస్తి పలకడంతోపాటు అసలు స్తంభాలు, లైట్లు ఎన్ని ఉన్నాయి? అనే లెక్క తేల్చడానికి స్ట్రీట్ లైట్ నిర్వహణ సిస్టమ్ యాప్ ద్వారా సర్వే చేయనున్నారు. విద్యుత్ మీటర్లు, సెంట్రలైజ్డ్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ప్యానల్స్, లైట్లు, పోల్స్ వంటి అన్ని ఆస్తుల వివరాలను నమోదు చేసి వాటి పనితీరును ట్రాక్ చేయనున్నారు. ఎక్కడైనా వీధి దీపాలు పని చేయకపోతే ఆ సమస్యను తక్షణమే గుర్తించి వెంటనే పరిష్కరించేలా వ్యవస్థను తయారు చేస్తున్నారు. కొత్త విధానంలో ఎంత విద్యుత్ వినియోగిస్తే అంతే బిల్లు చెల్లించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

ఒక్కో లైట్‌కు రూ.18 నుంచి రూ.22..

గ్రేటర్‌లో వీధి దీపాల నిర్వహణ బాధ్యతను ఈఈఎస్ఎల్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే ఈ టెండర్ ఈనెల 30తో ముగియనున్నది. దీంతో మరో రెండు నెలలపాటు ఈఈఎస్ఎల్ సంస్థకు ఇవ్వాలని నిర్ణయించారు. ఒక్కో లైట్‌కు రూ.18 నుంచి రూ.22 ఇవ్వాలని నిర్ణయించారు. గ్రేటర్‌లోని 5.40 లక్షల లైట్లకుగాను రూ.18 చొప్పున అయితే నెలకు రూ.98 లక్షలు అవుతుందని అధికారులు గుర్తించారు రెండు నెలలకు సుమారు రూ.2 కోట్ల బిల్లు అవుతుంది. కొత్త విధానం, ఈఈఎస్ఎల్‌కు రెండు నెలలపాటు పొడిగింపు అంశాలను త్వరలో జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు అధికారులు చెబుతున్నారు.

Next Story