GHMC : కార్మికులతో వెట్టిచాకిరి.. ప్రశ్నిస్తే బెదిరింపులు

by Naga Rani Yarlagadda |

జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ కార్మికుల జీతాలను ఏజెన్సీలు దోచుకుంటున్నాయి. 2021 కరో నా ఎమర్జెన్సీ సమయంలో పనిచేసేందుకు 220 మంది కార్మికులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో జీహెచ్ఎంసీ నియమించింది.

GHMC : కార్మికులతో వెట్టిచాకిరి.. ప్రశ్నిస్తే బెదిరింపులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ కార్మికుల జీతాలను ఏజెన్సీలు దోచుకుంటున్నాయి. 2021 కరోనా ఎమర్జెన్సీ సమయంలో పనిచేసేందుకు 220 మంది కార్మికులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో జీహెచ్ఎంసీ నియమించింది. ఇందుకుగాను జోన్ వారీగా అప్పట్లో(పాత జీహెచ్ఎంసీ) ఆరు జోన్లకి జోన్ల వారీగా టెండర్ల ద్వారా నియమించారు. జోన్ కి సంబంధించిన సూపరింటెండెంట్ ఇంజినీర్ల (ఎస్ఈ) కు ఈ ఏజెన్సీల బాధ్యతలను అప్పగించారు. ఆ తరువాత ప్రతిఏటా టెండర్ల ద్వారా ఏజెన్సీలను ఎస్​ఈలు నియమిస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌లో చివరగా టెండర్లు జరిగాయి. టెండర్ నిబంధనల ప్రకారం ఒక్కో కార్మికుడికి రోజుకు రూ.805 చెల్లించాల్సి ఉంది. నెలకు 26 రోజులకు సంబంధించి రూ.20,930 చెల్లించాల్సి ఉంది. ఏజెన్సీలు మాత్రం కార్మికులకు సగానికిపైగా కోతలు విధించి చెల్లిస్తున్నట్లు తెలిసింది. కొన్ని జోన్లలో అయితే కేవలం నెలకి రూ.9 వేల వేతనాలు చెల్లిస్తున్నట్లు సమాచారం. ప్రతి నెలా ఒక్కో కార్మికుడి నుంచి ఏజెన్సీలు సుమారు రూ.11,930 అక్రమంగా కాజేస్తున్నట్లు తెలిసింది. ఏజెన్సీ కోతలపై చర్యలు తీసుకోవాలని, విజిలెన్స్ విచారణ చేసి ఏజేన్సీల నుంచి రికవరీ చేయాలని కొందరు జీహె చ్ఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

ప్రశ్నిస్తే బెరిదింపులు..

ప్రతి నెలా జీహెచ్ఎంసీ నుంచి టెండర్ల ప్రకారం బిల్లులు తీసుకుంటున్న ఏజేన్సీలకు అదే టెండర్ ప్రకారం ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వడంలేదు. దీనిపై ఎవరైనా కార్మికులు ప్రశ్నిస్తే ఏజేన్సీలు వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఉద్యోగాల నుంచి తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తామని హెచ్చరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎప్పటికైనా పూర్తి వేతనాలు అందుతాయమోనని కార్మికులు ఆశతో పనిచేస్తున్నారు.

లెస్ తో టెండర్లు వేశాం : ఏజెన్సీలు..

కార్మికులను నియమించుకునే సమయంలో పిలిచిన టెండర్లలో లెస్‌తో టెండర్ దాఖలు చేశామని, అందుకు తక్కువ వేతనాలు ఇస్తున్నామని ఓ కాంట్రాక్టు ఏజెన్సీ నిర్వాహకుడు చెప్పడం శోచనీయం. ఒక్కో కార్మికుడి వేతనంలో రూ.11,930 కాజేయడంతో వర్కులు ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీల బెదిరింపులతో ఇచ్చినంత తీసుకుంటున్నారు. వీళ్ల గురించి అధికారులు సైతం పట్టించుకోవడంలేదు. కాంట్రాక్టర్లకు వత్తాసుపలుకుతున్నారనే విమర్శలూ లేకపోలేదు.

పీఎఫ్,ఈఎస్​ఐ లేవు..

కార్మికుల్లో కొన్ని జోన్లలో మినహా చాలా వాటిల్లో పీఎఫ్, ఈఎస్​ఐ సదుపాయం కూడా కల్పించడంలేదు. నగరంలో దోమల నివారణ కోసం యాంటి లార్వా ఆపరేషన్‌ డ్యూటీల్లో పనిచేసే వీరికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఏర్పడితే కనీసం ఈఎస్​ఐ కూడా కల్పించడంలేదు. ఇలా అన్ని విధాలుగా ఏజెన్సీలు మోసం చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలేదు. ఏజెన్సీలు ఇంతటి భారీ అక్రమాలకు పాల్పడుతున్నా, జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కార్మికులకు పూర్తిస్థాయి వేతనం అందేలా చూడాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Next Story