- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీహెచ్ఎంసీ బడ్జెట్ రూ. 11,460 కోట్లు.. ఆమోదించిన కౌన్సిల్.. సభ్యుల కీలక వ్యాఖ్యలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వార్షిక బడ్జెట్‌ను చివరి స్పెషల్ జనరల్ బాడీ సమావేశం ఆమోదించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వార్షిక బడ్జెట్‌ను చివరి స్పెషల్ జనరల్ బాడీ సమావేశం ఆమోదించింది. శనివారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన జీహెచ్‌ఎంసీ 10వ ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో కమిషనర్ కర్ణన్, అడిషనల్ కమిషనర్(ఫైనాన్స్) అనురాగ్ జయంతి ప్రవేశపెట్టిన ప్రతిపాదనలపై సభ్యులు చర్చించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ పార్టీల నుంచి సభ్యులు చర్చలో పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ మొత్తం బడ్జెట్ రూ. 11,460 కోట్లుగా పేర్కొంది. ఆదాయం రూ. 6,441 కోట్లు, జీహెచ్ఎంసీ ఖర్చు రూ. 4,057 కోట్లు, రెవెన్యూ మిగులు రూ.2,384 కోట్లు, రెవెన్యూ గ్రాంట్స్ రూ. 400 కోట్లు, కొత్తగా విలీనమైన మున్సిపాలిటీల కోసం రూ.2,260 కోట్లను కేటాయించింది. విలీనమైన 27 మున్సిపాలిటీల నుంచి వచ్చిన రెవెన్యూ రూ. 1,860 కోట్లుగా పేర్కొంది. జీహెచ్ఎంసీ బడ్జెట్ కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
జీహెచ్ఎంసీని హైడ్రా ఆక్రమిస్తోంది : బీజేపీ సభ్యుడు శ్రవణ్
జీహెచ్ఎంసీ పరిధిలో 10 ఫ్లోర్ల కంటే ఎక్కువగా ఉంటే హెచ్ఎండీఏ అనుమతులు జారీ చేయడంతో జీహెచ్ఎంసీ ఆదాయం తగ్గిపోతుందని, ఈ అధికారాలను జీహెచ్ఎంసీకే ఉండాలని బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా చేసిన తర్వాత బడ్జెట్, ఆదాయం, అప్పులను ఏం చేస్తారని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీని హెచ్ఎండీఏ, హైడ్రా వంటి శాఖలు ఆక్రమిస్తున్నాయని, జీహెచ్ఎంసీకే అన్ని రకాల అధికారాలు ఉండాలని కీలక వ్యాఖ్యలు చేశారు.
వీధి కుక్కలపై కమిటీ ఏమైంది? : సామల హేమ
జీహెచ్ఎంసీ పరిధిలో వీధికుక్కల నియంత్రణకు వేసిన కమిటీ ఏమైందని బీఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమ ప్రశ్నించారు. ఫిర్యాదులు చేసినా టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. దోమల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సీఆర్ఎంపీ రోడ్ల నిర్వహణ, అడ్వర్ టైజ్ మెంట్ నుంచి వచ్చే ఆదాయం గురించి క్లారిటీ ఇవ్వాలని కోరారు.
జోన్ల వారీగా బడ్జెట్ కేటాయింపులేవి?
జీహెచ్ఎంసీని విస్తరించిన అధికారులు 12 జోన్లకు సంబంధించిన ఆదాయ, వ్యయాలు, బడ్జెట్ కేటాయింపు లేవని ఎంఎల్ఏ మాజీద్ హుస్సేన్ ప్రశ్నించారు. 20 ఏండ్ల కాలంలో ఆస్తిపన్ను పెంచలేదని బడ్జెట్ లో పొందుపర్చారు. కానీ పేదలకు సంబంధించిన టాక్స్ పెంచి, పెద్దలకు సంబంధించిన టాక్స్ ను పెంచలేదన్నారు. ఆఫ్జల్ సాగర్ నాలా, బుల్కాపూర్ నాలా అభివృద్ధి పనులు ఏమయ్యాయని ప్రశ్నించారు. దేవునికుంట హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి పనులు రెండేండ్ల నుంచి నిలిచిపోయాయని, ఎన్ని స్మశాన వాటికలను అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. శివారు ప్రాంతాల్లోని ఎంత ఆదాయం వస్తుందని, విలీన మున్సిపాలిటీల్లో ఎన్ని అప్పులు ఉన్నాయో బడ్జెట్ లో చెప్పలేదన్నారు.
మేయర్ భావోద్వేగం…
జీహెచ్ఎంసీ చివరి జనరల్ బాడీ సమావేశం కావడంతో మేయర్ విజయలక్ష్మి భావోద్వేగానికి గురయ్యారు. తమ పాలకవర్గ ఐదేళ్ల పాలనా కాలంలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుద్ధ్య వ్యవస్థ బలోపేతానికి అధిక ప్రాధాన్యతనిచ్చామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. ఐదేండ్ల తన ప్రస్థానాన్ని గద్వాల్ గుర్తు చేసుకున్నారు. మేయర్ గా పదవీ బాధ్యతల స్వీకరణలో సహకరించిన ఎక్స్ అఫిషియో సభ్యులు, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్ లు, కమిషనర్ ఆర్వీ.కర్ణన్, పూర్వ కమిషనర్లు లోకేశ్ కుమార్, రోనాల్డ్ రాస్, అమ్రాపాలి, ఇలంబర్తిలకు మేయర్‌గా అవకాశం ఇచ్చిన నగర ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మేయర్ పదవి కాలం తో పాటు మా కార్పొరేటర్లు పదవీకాల ప్రస్థానం వచ్చే నెల ఫిబ్రవరి 10వ తేదీతో ముగియనుందన్నారు. గత ఐదు ఏండ్ల పాలకవర్గ పాలన కాలం విజయవంతంగా పూర్తయింది. అంటే దానికి కౌన్సిల్ సభ్యులుగా మీరు ఇచ్చిన మార్గదర్శనం, సూచనలు, విమర్శలు కూడా నాకు బలాన్నిచ్చాయి. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, కార్పొరేటర్లు, పారిశుద్ధ్య కార్మికులు ఎండా వానా చూడకుండా, పగలు రాత్రి తేడా లేకుండా నగర అభివృద్ధి కోసం చేసిన మీ సేవలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ ,రోడ్ల అభివృద్ధి, జంక్షన్ల అభివృద్ధి, పౌర సేవల డిజిటలైజేషన్, ప్రజారోగ్య కార్యక్రమాలు వంటి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఇవన్నీ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఒక్క లక్ష్యంతోనే చేపట్టామని, ఈ కృషికి గుర్తింపుగా జీహెచ్ఎంసీ జాతీయ స్థాయిలో అనేక అవార్డులు, ప్రశంసలు, గుర్తింపులు పొందడం మనందరికీ గర్వకారణమన్నారు. ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన, బాధ్యతాయుతమైన సేవలు అందించడంలో మనం సాధించిన పురోగతి, రాబోయే తరాలకు బలమైన పునాది అవుతుందని నాకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. పదవి ముగిసినా, హైదరాబాద్ పట్ల నా ప్రేమ, నా బాధ్యత, నిబద్ధతత ఎప్పటికీ తగ్గదని అన్నారు.
ఐదేండ్ల పదవీకాలం సంతృప్తినిచ్చింది
తన ఐదేళ్ల పదవీ కాలం సంతృప్తి మిగిల్చిందని డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన కమిషనర్లకు, అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజా ప్రతినిధులు అధికారులు అందరి సమిష్టి కృషి ఫలితంగానే గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పథకాలను ,విజయవంతంగా అమలు చేయగలిగామని తెలిపారు. కమిషనర్ల దూరదృష్టి, వేగవంతమైన నిర్ణయాలు, సమన్వయం వల్ల అనేక సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొని ముందుకు సాగమన్నారు. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కృషి చేయాలని ఆమె కోరారు.
విలీన ప్రాంతాల్లో ఆన్ లైన్ సేవలు
2026–2027 ఆర్థిక సంవత్సర బడ్జెట్ తయారీలో అనేక సవాళ్లు ఎదురయ్యాయని తెలిపారు. 27 పురపాలికలు జీహెచ్ఎంసీ లో విలీనం తర్వాత వాటి లయబిలిటీ, అస్సెట్ ను లెక్కించామని చెప్పారు. ప్రాపర్టీ టాక్స్ అసెస్మెంట్, కలెక్షన్స్ ను ఎండ్ టూ ఎండ్ పూర్తిగా ఆన్లైన్ చేశాం.. కొత్తగా విలీన పురపాలికల్లో కూడా ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. ప్రజా అవసరాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇలా అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకుని బడ్జెట్ ను రూపొందించామని కమిషనర్ తెలిపారు.
వంగ మధుసూదన్ రెడ్డికి అశ్రునివాళి
జీహెచ్ఎంసీ స్పెషల్ జనరల్ బాడీ సమావేశంలో ఇటీవల మరణించిన చంపాపేట్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డికి సమావేశం సంతాపం ప్రకటించింది. మేయర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఆయన మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కార్పొరేటర్లు కొప్పుల నర్సింహ్మారెడ్డి, పవన్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు సామల హేమ, పద్మ వెంకట్ రెడ్డి, వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, జగదీశ్వర్ గౌడ్, బాబా ఫసియుద్దీన్, బొంతు శ్రీదేవి, మజ్లిస్ పార్టీ కార్పొరేటర్లు బేగ్ మాట్లాడారు. వంగ మధుసూదన్ రెడ్డి సేవలను కొనియాడారు. ఆయన అందరివాడు.. పార్టీలకతీతంగా ఆయనతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలు, అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.






