జీహెచ్ఎంసీలో బోగస్ విలేకరుల ఆరోపణల వెనుక రాజకీయ డ్రామా

by Bhanu |

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పాలకవర్గం నాలుగున్నరేండ్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

జీహెచ్ఎంసీలో బోగస్ విలేకరుల ఆరోపణల వెనుక రాజకీయ డ్రామా
X

దిశ, సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పాలకవర్గం నాలుగున్నరేండ్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు, స్టాండింగ్ కమిటీ సమావేశాలు, జనరల్ బాడీ సమావేశాల నిర్వహణ విజయవంతం కావడంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని పలుమార్లు పాలకవర్గం సభ్యులు ప్రస్తావించారు. కానీ నాలుగున్నరేండ్ల తర్వాత బోగస్ విలేకరుల నియంత్రణ అంశం ఎందుకు తెరపైకి వచ్చిందని, దీనికి వెనుక ఎవరున్నారని సచివాలయం, జీహెచ్ఎంసీ, ప్రభుత్వ కార్యాలయాల్లో తీవ్రంగా చర్చ జరుగుతున్నది.

ఆ నలుగురే ఎందుకు?

గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సమావేశంలో చర్చించడానికి బోలెడన్ని సమస్యలు ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి అధికార పార్టీలో చేరిన సభ్యులు ‘నకిలీ విలేకరులు, బోగస్ విలేకరులు’ అంటూ కామెంట్ చేయడం విడ్డూరంగా ఉందని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీరిలో ఓ సభ్యుని ఏరియాలో ఓ నాయకుని ఆత్మహత్య ఎంత దుమారం లేపిందో చెప్పనక్కర్లేదు. ఈయనగారి దగ్గర పనిచేసిన ఎంతో మంది జర్నలిస్టులు టార్చర్ భరించలేక వెళ్లిపోయినట్టున్నారు.

మరో సభ్యుడైతే ఏకంగా అధికారులపైనే దాడులకు తెగపెడిన విషయం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ విషయాలను రాసిన జర్నలిస్టులు నకిలీ అయ్యారు. మరో ఇద్దరు సభ్యుల పరిస్థితి అదే తరహాలో ఉందని చెబుతున్నారు. పైగా ఈ నలుగురు సభ్యులు బయట మాత్రం ‘మేము అసలు ఈ విషయాన్నే చర్చకు పెట్టలేదు. అనవసరంగా మాపై నిందలేస్తున్నారు’ అని చెబుతున్నారు. స్టాండింగ్ కమిటీ సమావేశంలో మీడియా ప్రతినిధిగా ఉన్న అధికారి సైతం జర్నలిస్టుల తరఫున మాట్లాడకపోవడం శోచనీయం.

జర్నలిస్టు సంఘాల ఖండన

జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయాన్ని పలు జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. జర్నలిస్టులను నకిలీ, బోగస్ అనడం తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

Next Story