- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ghar Wapsi: తిరిగి కాంగ్రెస్ లో చేరిన ముగ్గురు సీనియర్లు.. నాడు కన్నీరు.. చెప్పు దెబ్బల వార్నింగ్‍లు!
తెలంగాణ కాంగ్రెస్ లో ఘర్ వాపసీ మొదలైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ (Telangana) రాజకీయాల్లో ఘర్ వాపసీ (Ghar Wapsi) పాలిటిక్స్ సంచలనంగా మారుతోంది. ఇటీవల ప్రకటించినట్లుగానే కాంగ్రెస్ (Congress) పార్టీ ఘర్ వాపసీ ప్రారంభించింది. ఇవాళ ఆదిలాబాద్ (Adilabad) జిల్లాకు చెందిన సీనియర్ నేతలు, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి హైదరాబాద్ లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) సమక్షంలో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ముగ్గురు నేతలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ టికెట్ ఆశించి భంగపడ్డారు. తమ ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పని చేస్తామని ప్రకటించారు. కానీ అధిష్టానం మాత్రం కంది శ్రీనివాస్ రెడ్డికి టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఈ ముగ్గురిలో సంజీవరెడ్డి స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి పాయల్ శంకర్ విజయం సాధించగా బీఆర్ఎస్ అభ్యర్ధి జోగురామన్న రెండో స్థానంలో, కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి మూడో స్థానంలో నిలువగా సంజీవ్ రెడ్డి (Sanjeev Reddy) నాలుగో స్థానంలో నిలిచారు.
నాడు కన్నీళ్లు.. చెప్పు దెబ్బల హెచ్చరికలు:
ఈ ముగ్గురు నేతలు 2023 నవంబర్ లో కాంగ్రెస్ పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ఆసమయంలో నియోజకవర్గంలో ఎమోషనల్ అండ్ హై వోల్టేజ్ పాలిటిక్స్ నడిచాయి. పార్టీకి రాజీనామా చేస్తున్న సమయంలో సాజిద్ ఖాన్ (Sajid Khan) కన్నీరు పెట్టుకున్నారు. తన కుటుంబం మొత్తం ఎన్నో ఏండ్లుగా కాంగ్రెస్‍లో పని చేస్తోందని ఇప్పుడు పార్టీ వీడాలంటే బాధగా ఉందంటూ భావోద్వేగానికి లోనయ్యారు. సంవత్సరాలుగా పనిచేస్తున్న తమను కాదని కొత్తగా వచ్చిన ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న కంది శ్రీనివాస్ రెడ్డికి అధిష్టానం టికెట్ ఇచ్చిందని ఆవేదన చెందారు. ఇక తనపై కంది శ్రీనివాస్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే చెప్పుతో కొడతానంటూ గండ్రత్ సుజాత (Gandrath Sujatha) చేసిన హెచ్చరికలు తీవ్ర కలకలం రేపాయి. పబ్లిక్ గా చెప్పు చూపిస్తూ ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యారు. సీన్ కట్ చేస్తే మారిన రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పిలుపు మేరకు ఈ ముగ్గురు నేతలు తిరిగి తమ సొంత పార్టీ గూటికి చేరుకున్నారు.
స్థానిక సంస్థలపై వ్యూహాత్మకంగా:
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్, బీజేపీలను కట్టడి చేసే వ్యూహంలో భాగంగా ఘర్ వాపసీ కి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీలోకి నేతలు రాక మొదలు కావడం ఆసక్తిని రేపుతోంది. భవిష్యత్తలో మరింత మంది నేతలు ముఖ్యంగా పెద్ద తలకాయలే కాంగ్రెస్ లో చేరబోతున్నాయని అధికార పార్టీలో చర్చ జరుగుతుండటంతో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి ఎవరెవరు పార్టీ మారబోతున్నారనే టాక్ ఆయా జిల్లాల్లో జోరుగా జరుగుతోంది. స్థానిక సంస్థల్లో ప్రభావం చూపే నాయకులపై హస్తం పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో జరుగబోయే పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి.






