మూసీ ప్రాజెక్ట్ వివాదం.. సీఎం సమావేశంపై ఘంటా చక్రపాణి ట్వీట్ వైరల్

by Prasad Jukanti |   (  Updated:2026-03-12 09:19:55  IST  )

మూసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నేపథ్యంలో ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి కీలక వ్యాఖ్యలు చేశారు.

మూసీ ప్రాజెక్ట్ వివాదం.. సీఎం సమావేశంపై ఘంటా చక్రపాణి ట్వీట్ వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోగా ప్రతిపాదిత ప్రాజెక్టులో భాగంగా తమ స్థలాలు కోల్పోతున్న బాధితులు, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై (Musi River Front Project) ప్రాజాప్రతినిధులు, మేధావులు, పార్టీల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. అయితే ఈ సమావేశంపై తాజాగా అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ఘంటా చక్రపాణి (Ghanta Chakrapani) చేసిన ట్వీట్ ఆసక్తిగా మారింది.

చర్చించాల్సింది నిర్వాసితులతో కదా!

రేపటి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమావేశానికి సంబంధిన న్యూస్ క్లిప్ ను ఎక్స్ లో పోస్టు చేసిన ఘంటా చక్రపాణి 'చర్చించాల్సింది నిర్వాసితులతో కదా! అంటూ కామెంట్ చేశారు. ఈ ట్వీట్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. మనవరకు వస్తే కానీ నొప్పి తెలియదు కదా అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా అందుకు ప్రొఫెసర్ స్పందిస్తూ 'అవును మల్లన్న సాగర్ సందర్భంగా నేను మాట్లాడలేదు' అంటూ సమాధానం ఇచ్చారు.

మీరు చదువుకున్న వాళ్లే అనుకుంటున్నా:

మరో నెటిజన్ స్పందిస్తూ.. పరిపాలనలోని కఠినమైన వాస్తవం ఏమిటంటే ఒక ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేసే బృందాలతో కలిసి ఆ ప్రాజెక్ట్ విజన్ గురించి మీరు చర్చలు జరపలేరు. ఒకవేళ సాంకేతిక ప్రణాళికా సమావేశంలో (Technical Planning Table) నిర్వాసితులు ఉంటే మూసీ పునరుజ్జీవనం ఎప్పటికీ మొదటి అడుగు కూడా ముందుకు పడదు. అందువల్ల మొదటి దశలో నిపుణులతో కలిసి బ్లూప్రింట్‌ను ఖరారు చేయడం. రాజకీయ ఏకాభిప్రాయాన్ని సాధించడం. రెండవ దశలో పటిష్టమైన పునరావాస చర్చల ద్వారా మానవీయ కోణంలో (నష్టపోయిన వారికి జరిగే నష్టంపై) దృష్టి సారించడం. వీటన్నింటినీ ఒకే గదిలో కలిపి చర్చిస్తే.. మూసీ నది శాశ్వతంగా ఒక విషపూరిత మురికి కాలువలాగే మిగిలిపోతుందనడంలో సందేహం లేదు అంటూ కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన చక్రపాణి.. 'మీరు చదువుకున్న వాళ్లే అనుకుంటున్నా. భూసేకరణ చట్టం 2013 లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. దానింప్రకారం నిర్వాసితులు ప్రధానం. వారికి కొన్ని హక్కులుంటాయి. అవి పాటించకపోతే పాలకుల పరిస్థితి జీరో వ్యాల్యూ అవుతుంది' అని రిప్లయ్ ఇచ్చారు. అలాగే భూసేకరణ చట్టం-2013 చదివాక మాట్లాడుకుందాం. అంటూ ఇందుకు సంబంధించిన లింక్ ను షేర్ చేశాడు.

నెట్‍ఫ్లిక్స్ తో నా కల నిజం కాబోతోంది: సీఎం రేవంత్ రెడ్డి

Next Story