- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నాళ్లు ఇలా..?
భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని దోతిగూడెం గ్రామంలోని రసాయన కంపెనీల నుంచి వెలువడుతున్న విషవాయువులు పరిసర గ్రామాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని దోతిగూడెం గ్రామంలోని రసాయన కంపెనీల నుంచి వెలువడుతున్న విషవాయువులు పరిసర గ్రామాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో దుర్వాసనతో గ్రామాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయని, పిల్లల నుంచి వృద్ధుల వరకు ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారుతోందని చెబుతున్నారు. కంపెనీల యాజమాన్యాలకు, అధికారులకు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదని ఆరోపిస్తున్నారు.
గ్రామాలను కమ్మేస్తున్న కాలుష్యం..
రసాయన కంపెనీల నుంచి విడుదలవుతున్న కలుషిత నీటిని భూమిలోకి వదులుతున్నందున వ్యవసాయ భూములు, ప్రజలు, మూగజీవాలు తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. విషవాయువుల లీకేజీలను అరికట్టకపోతే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు మరింత పెరిగి ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలపై వెంటనే చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.
పరిశ్రమల్లో భద్రత గాలికొదిలి..
రసాయన పరిశ్రమల్లో దహనశీల పదార్థాల వినియోగంలో భద్రతా ప్రమాణాలు సక్రమంగా పాటించకపోవడం, యంత్రాంగ నిర్లక్ష్యం, రియాక్టర్లలో ఒత్తిడి పెరగడం, గ్యాస్ లీకేజీలు, షార్ట్‌సర్క్యూట్లు వంటి కారణాలతో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. గతంలో మండలంలోని ఇండస్ట్రియల్ జోన్‌లో జరిగిన ఘటనల్లో పలువురు కార్మికులు గాయపడగా, కొన్నిచోట్ల ప్రాణనష్టం కూడా సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదాలు తప్పిన సందర్భాలు ఉన్నాయి.
ఆరు నెలల్లో ఇద్దరు బలి..
మండలంలోని రసాయన పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 21న విజే సాయి కంపెనీలో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గట్టు సింగారం గ్రామానికి చెందిన కెమిస్ట్ ధారా పవన్ (36) రియాక్టర్ పేలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తాజాగా జూలై 16న హేజోలో కంపెనీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా సింగనమల మండలం ఉల్లికల్లు గ్రామానికి చెందిన కెమిస్ట్ ఆలమూరు కృష్ణారెడ్డి (43) రియాక్టర్‌లో పడి ఊపిరాడక మృతి చెందాడు.
నిద్రపోతున్న కాలుష్య నియంత్రణ మండలి..
కాలుష్య నియంత్రణ మండలి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పరిశ్రమల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రమాదాల తర్వాత కొంతకాలం హడావుడి చేసి, అనంతరం మళ్లీ నిర్లక్ష్యమే కొనసాగుతోందని విమర్శిస్తున్నాయి. రసాయనాల నిల్వ, నిర్వహణ, భద్రతా పరికరాల వినియోగంలో లోపాలు కొనసాగుతున్నాయని, సరైన రక్షణ పరికరాలు లేక కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల ప్రశ్నలకు జవాబెవరు?
అగ్ని ప్రమాదాలు జరిగిన ప్రతిసారీ, అలాగే రాత్రి వేళల్లో ఫార్మా కంపెనీల నుంచి వెలువడే విషవాయువులు పరిసర గ్రామాల పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దుర్వాసన, పొగతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, చర్మ వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని వాపోతున్నారు. పర్యావరణ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రమాదం తర్వాతే అధికారుల హడావుడి..
ప్రతి ఘటన అనంతరం తనిఖీలు, నోటీసులు, కేసులు నమోదు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ, అమలు స్థాయిలో నిరంతర పర్యవేక్షణ లేకపోవడం వల్లే ప్రమాదాలు, కాలుష్య సమస్యలు పునరావృతమవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పరిష్కారం ఎప్పుడో..?
ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు కాకుండా, ముందస్తు జాగ్రత్తలే ప్రాణనష్టాన్ని నివారించగలవని నిపుణులు సూచిస్తున్నారు. పరిశ్రమల భద్రతపై సమగ్ర ప్రణాళిక అమలు చేసి, కాలుష్య నియంత్రణ నిబంధనలు కఠినంగా అమలు చేస్తేనే కార్మికులు, ప్రజల ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామాలను కమ్మేస్తున్న విషవాయువులకు, వరుస ప్రమాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలని మండల ప్రజలు కోరుతున్నారు.






