ప్రపంచ క్రిటికల్ మినరల్స్ రేసులో భారత్.. ఘనాలో సింగరేణి మైనింగ్

by Naga Rani Yarlagadda |

వజ్రాలు, బంగారం, బాక్సైట్, మాంగనీస్, లిథియం తదితర ఖనిజ ఉత్పత్తులకు పేరుగాంచిన ఘనా దేశం సింగరేణి సంస్థను తమ దేశంలో పెట్టుబడులకు ఆహ్వానం పలికింది.

ప్రపంచ క్రిటికల్ మినరల్స్ రేసులో భారత్.. ఘనాలో సింగరేణి మైనింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : వజ్రాలు, బంగారం, బాక్సైట్, మాంగనీస్, లిథియం తదితర ఖనిజ ఉత్పత్తులకు పేరుగాంచిన ఘనా దేశం సింగరేణి సంస్థను తమ దేశంలో పె ట్టుబడులకు ఆహ్వానం పలికింది. ఈ నేపథ్యంలో ఘనాలో క్రిటికల్ మినరల్స్ రంగంలో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను సింగరేణి సద్వనియోగం చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు హైదరాబాద్ సింగరేణి భవన్ లో శని వారం ఘనా దేశ బృందం సింగరేణి యాజమాన్యంతో సమావేశమయ్యారు.

క్రిటికల్ మినరల్స్ కు ఘనా‘పాటి’

ఇప్పుడు ప్రపంచమంతా క్రిటికల్ మినరల్స్ కోసం పాకులాడుతున్నాయి. ప్రస్తుతం లిథియం, కోబాల్ట్, నికెల్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వంటి ఖని జాలు ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీలకు ప్రధాన ముడిసరుకుగా మారాయి. అందుకే అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాతో పాటు మన దేశం కూడా తమ క్రిటికల్ మినరల్స్ భద్ర తను పెంచుకునే వ్యూహాలు రూపొందిస్తున్నాయి. క్రిటికల్ మినరల్స్ మైనింగ్ లో నెంబర్ వన్ గా ఉన్న చైనాకు ప్రస్తుతం ప్రపంచంలో మరే దేశం కూడా కనీసం దరిదాపుల్లో కూడా లేదు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో క్రిటికల్ మినరల్స్ ఉన్న దేశాలే ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో ఉంటాయనే చర్చ జరుగుతున్న తరుణంలో మన దేశం కూడా ఈ రంగంలో దూసుకుపోయేందుకు ప్రయత్నిస్తోంది. ఘనాలో ప్రధానంగా వజ్రాలు, బంగారంతో పాటు బాక్సైట్, మాంగనీస్, లిథియం వంటి క్రిటికల్ మినరల్స్ విస్తారంగా ఉన్నాయి. ఈ తరుణంలోనే ఆ దేశం తమ క్రిటికల్ మినరల్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే మైనింగ్ రంగంలో విశేషమైన పేరు, అనుభవం ఉన్న సింగరేణితో ఒప్పందం చేసుకునేందుకు ఆ దేశ ప్రతినిధి బృందం శనివారం హైదరాబాద్ వచ్చి సింగరేణి ఎండీ ఎన్ బలరాంతో చర్చలు జరిపారు.

నాన్ కోల్ మైనింగ్ దిశగా..

కోల్ మైనింగ్‌లో శతాబ్దానికి పైగా అనుభవం కలిగిన సింగరేణి కంపెనీ ఇటీవల కోల్ కాకుండా నాన్-కోల్ మినరల్స్ రంగంలో అడుగుపెడుతోంది. లిథియం, రేర్ ఎర్త్ మినరల్స్ వంటి కొత్త అవకాశాలపై ఇప్పటికే ఫీజిబిలిటీ స్టడీలు ప్రారంభించింది. బంగారం, రాగి గనుల అన్వేషణకు లైసెన్స్‌ దక్కించుకుంది. కర్ణాటకలోని దేవదుర్గ్‌ లో బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్‌ కోసం కేంద్ర ప్రభుత్వ ఆన్‌లైన్‌ వేలంలో 37.75 శాతం రాయల్టీని కోట్‌ చేయడం ద్వారా సింగరేణి ఎల్‌-1 బిడ్డర్‌గా నిలిచింది. తాజాగా ఘనా దేశంతో ఒప్పం దం కనుక కుదిరితే సింగరేణిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు అవకాశం ఉంటుంది.

క్రిటికల్ మినరల్స్ కు అధిక ప్రాధాన్యం : సింగరేణి సీఎండీ ఎన్ బలరాం

ఘనాలో మైనింగ్ జరపటానికి ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తామని, తొలిసారిగా ఒక ఆఫ్రి కా దేశంలో అడుగుపెట్టడానికి సింగరేణి సంస్థకు అవకాశం లభించిందన్నాని సింగరేణి సీఎండీ బల రాం అన్నారు. మరో నెల రోజుల్లో ఘనా దేశానికి చెందిన సాంకేతిక బృందం కేంద్ర ప్రభుత్వంతో సమావేశం కానుందని ఆ దేశ ప్రతినిధి బృందం పేర్కొంది. తమ దేశానికి సింగరేణి బృందాన్ని కూ డా పంపించాలని ఘనా ప్రతినిధి బృందం సీ ఎండీని కోరింది. దీనిపై సీఎండీ సానుకూలంగా స్పందించారు.

Next Story