- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో వైద్య పరికరాల తయారీ యూనిట్.. సీఎం రేవంత్ రెడ్డితో జర్మనీ బృందం భేటీ
వైద్య పరికరాల తయారీలో జర్మనీకి చెందిన ప్రసిద్ధ కంపెనీ బెబిగ్ మెడికల్ తన ఉత్పత్తి యూనిట్‌ను తెలంగాణలో ప్రారంభించడానికి ఆసక్తిని వ్యక్త పరిచింది.

దిశ తెలంగాణ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మెడికల్ ఎక్విప్ మెంట్ (Medical Equipment) తయారీ రంగంలో సేవలు అందిస్తున్న జర్మనీకి చెందిన బీబిగ్ కంపెనీ (BEBIG Medical) రాష్ట్రంలో మెడికల్ ఎక్విప్ మెంట్ ఉత్పత్తి యూనిట్ ను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కంపెనీ చైర్మన్ & సీఈవో జార్జ్ చాన్ (George Chan) తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్ లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జర్మనీ కంపెనీ ప్రతినిధులు భేటీ అయ్యారు. తెలంగాణలో మెడికల్ ఎక్విప్ మెంట్ ఉత్పత్తి యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. అనువైన స్థలం, ఇతర అంశాలకు సంబంధించి అధ్యయనం చేసి రిపోర్టు అందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడికల్ ఎక్విప్ మెంట్ తో పాటు, క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే రేడియేషన్ సెంటర్స్ ను ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు. కాగా... ప్రపంచవ్యాప్తంగా 80 కంటే ఎక్కువ దేశాల్లో 700 పైగా ఇన్‌స్టాలేషన్‌లతో బీబిగ్ పనిచేస్తోందని కంపెనీ చైర్మన్ జార్జ్ చాన్ వెల్లడించారు. యూరప్, అమెరికా, ఆసియాలోని కార్యాలయాలు, అనుభవజ్ఞులైన నిపుణుల బృందం ద్వారా కంపెనీ సేవలను అందిస్తోంది. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ చవకైన ఆరోగ్య సంరక్షణ కోసం పరిష్కారాలను అందించడం లక్ష్యంగా బీబిగ్ మెడికల్ పనిచేస్తోందని ఆయన తెలిపారు. క్యాన్సర్ చికిత్సలో రేడియేషన్ థెరపీ చికిత్సలో బీబిగ్ గ్లోబల్ లీడర్ గా ఉందన్నారు. తెలంగాణలోనూ తమ సేవలను విస్తరించేందుకు ఉత్సాహంగా ఉన్నామని తెలిపారు.






