- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. స్థానిక ఎన్నికలు ముగియడమే ఆలస్యం!
స్థానిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. రెండేండ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఎంప్లాయీస్‌ను బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. రెండేండ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఎంప్లాయీస్‌ను బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించిన ఫైల్.. ఫైనాన్స్ శాఖ నుంచి సీఎంఓకు చేరినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నెల మొదటివారంలో బదిలీల ప్రక్రియ ప్రారంభించి నెలాఖరులోపు పూర్తి చేయాలని తొలుత సర్కారు భావించింది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల ముందు బదిలీలు చేపట్టడం వల్ల ఇబ్బందులు వస్తాయనే కారణంతో వాయిదా వేసినట్టు అధికార వర్గాల్లో టాక్.
ప్రతి ఏటా సాధారణ బదిలీలు
రెగ్యూలర్‌గా బదిలీలు చేపట్టకపోవడంతో ప్రభుత్వంపై పైరవీలు, సిఫార్సు లెటర్ల ఒత్తిడి పెరుగుతున్నది. అందుకే ఇప్పటి నుంచి ప్రతి ఏటా సాధారణ బదిలీలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది. గతేడాది జులై మాసంలో సాధారణ బదిలీలు జరిగాయి. కానీ అప్పుడు సుదీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ బదిలీ అవకాశం దక్కలేదు. ఈ ఏడాది జులైలో బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని సీఎం ఆదేశించగా.. ఆర్థిక శాఖ సంబంధిత ఫైల్‌ను రెడీ చేసిందని, దానిని ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపినట్టు సమాచారం. కానీ ఈలోపే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ఆర్డినెన్స్ ప్రస్తుతం రాజ్‌భవన్‌లో ఉన్నది. దానిపై గవర్నర్ సంతకం చేసిన వెంటనే షెడ్యూలు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో బదిలీలు చేపడితే, స్థానికంగా సమస్యలు వస్తాయని కారణంతో ఆ ఫైల్‌ను సీఎంఓలో పెండింగ్ పెట్టినట్టు తెలిసింది. సెప్టెంబర్ చివరి నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకున్నది. ఎన్నికలు ముగిశాక అక్టోబరులో జనరల్ ట్రాన్స్‌ఫర్స్ ప్రక్రియ మొదలవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
విద్యాశాఖలో ముందు హెచ్ఎంల బదిలీ?
గత ఏడాది మల్టీజోన్-1 పరిధిలోని హెడ్‌మాస్టర్ల బదిలీలు, ప్రమోషన్లు, స్కూల్ అసిస్టెంట్ల ట్రాన్స్‌ఫర్స్ చేపట్టారు. కానీ, కోర్టు కేసులతో ఆ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది. ఈసారి ముందుగా హెచ్ఎంల బదిలీలు చేపట్టిన తర్వాతనే ప్రమోషన్లు ఇవ్వాలని దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న హెచ్ఎంలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమకు అన్యాయం జరుగుతుందని ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎంకు పలుసార్లు విజ్ఞప్తి చేశారు. దీంతో ముందుగా బదిలీలు చేపట్టిన తర్వాత హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది.






