డీసీఎంను వెనుకనుంచి ఢీకొట్టిన గౌతమ్ ట్రావెల్స్ బస్సు

by Naga Rani Yarlagadda |

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట సమీపంలో వేగంగా వెళ్తున్న గౌతమ్ ట్రావెల్స్ బస్సు ముందుగా వెళ్తున్న డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టింది.

డీసీఎంను వెనుకనుంచి ఢీకొట్టిన గౌతమ్ ట్రావెల్స్ బస్సు
X

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని కోదాడ మండలం దోరకుంట సమీపంలో వేగంగా వెళ్తున్న గౌతమ్ ట్రావెల్స్ బస్సు ముందుగా వెళ్తున్న డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతినగా, డ్రైవర్‌కు గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తూ ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన డ్రైవర్‌కు ప్రాథమిక చికిత్స అందించి సమీప ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉండగా.. అతివేగం లేదా నిర్లక్ష్య డ్రైవింగ్ కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో కొద్దిసేపు ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Next Story