గంగుల గ్యాంబ్లింగ్.. ముఖ్య అనుచరుడికి మూడేళ్లుగా గవర్నమెంట్ సాలరీ!

by Disha Web Desk 4 |
గంగుల గ్యాంబ్లింగ్.. ముఖ్య అనుచరుడికి మూడేళ్లుగా గవర్నమెంట్ సాలరీ!
X

దిశ బ్యూరో, కరీంనగర్ : వడ్డించే వాడు మన వాడైతే బంతీలో ఏడ కూర్చున్న ఓ బోక్క (ముక్క) ఎక్కువ పడుతుంది అన్న చందంగా తయారైంది బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి గంగుల కమలాకర్ వ్యవహరం. అధికారంలో ఉండగా పారదర్శక పాలన అంటూ పబ్లిక్ మీటింగుల్లో ఊకదంపుడు ఉపన్యాసాలతో అదరగొట్టిన గంగుల కమలాకర్ మంత్రిపదవి ఊడి ఆ పార్టీ అధికారం చేజారగానే అడుగడున తన అనుచరులు చేసిన భూ ఆక్రమణలు, అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.

అయితే ఈ వరుస ఘటనలు బీఆర్ఎస్ భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుండగా తానేమి తక్కువ కాదన్నట్టు గంగుల కమలాకర్ అనుచరుడికి ప్రభుత్వ ఖజానా నుంచి అప్పనంగా దోచిపెట్టారు. ఇందుకు అధికారికంగా ఆ శాఖకు సిఫారసు లేఖ పంపి ఆదేశించారు. దీంతో జీ హుజూర్ అంటూ అధికారులు సైతం ప్రభుత్వం మారేదాక తనకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతం అందించారు. ఇప్పుడు ఈ విషయం గంగుల అధికార దుర్వినియోగానికి అద్దం పడుతుంది. అయితే ఈ విషయం ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో చర్చానీయంశంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే... నారంభట్ల మహేందర్ కరీంనగర్‌లో ఓ హోటల్ యజమాని. మాజీ మంత్రి గంగుల కమలాకర్‌కు అత్యంత సన్నిహితుడు. గంగుల కమలాకర్ కార్పొరేటర్‌గా గెలిచిన నాటి నుంచి తన వెన్నంటి ఉండే సహచరుల్లో ప్రధాన వ్యక్తి. ఇంత వరకు బాగానే ఉన్న మాజీ మంత్రి గంగుల తనకు అధికారికంగా ప్రభుత్వం నుంచి మూడు సంవత్సరాలు జీతం ఇప్పించడం వివాదాస్పదంగా మారింది. కరీంనగర్‌లో గంగుల అనుచరులు చేసిన గాయాలతో జనం గోసరిల్లి వారి అధికారం చేజారగానే ఎదురుతిరిగి చట్టాన్ని ఆశ్రయించడంతో ఒక్కొక్కరిగా కటకటాల పాలవుతుంటే తానేమి తక్కువ కాదన్నట్టు గంగుల కమలాకర్ వ్యవహరించడం వివాదాస్పదంగా మారింది.

మంత్రి పేషీలో పలు సేవలు అందించేందుకు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లో పలు ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం అంటు తెలంగాణ బీసీ వెల్ఫేర్ కో ఆపరేటీవ్ ఫైనాన్స్ కార్పొరేషన్ హైదరాబాద్ ద్వారా నియమించారు. జీతం మాత్రం కరీంనగర్ బీసీ కార్పొరేషన్ నుంచి ఇవ్వడం కరీంనగర్‌లో తనతోపాటు పార్టీకోసం పనిచేసే వ్యక్తి అని బహిరంగ రహస్యమే అయినప్పటికీ కరీంనగర్‌తో పాటు పలు జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణకు అంటు ప్రోసిడింగ్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.

అధికారులు సైతం నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి ప్రభుత్వ ఖజానా నుంచి అనుచరుడికి దోచిపెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారులు సైతం నిబంధనలు పక్కకు పెట్టి పనిచేయడం ఆ ప్రభుత్వ హయాంలో అధికార దుర్వినియోగానికి అద్దం పడుతుంది. బీఆర్ఎస్ పాలనలో అవినీతికి ఆస్కారం లేదు. నేను ప్రజా సేవకోసం పనిచేస్తున్నా అంటూ చెప్పిన గంగుల చెప్పేవి నీతి సూత్రాలు.. చేసేవి మరోలా ఉన్నాయనే చర్చ సాగుతోంది. అనుచరులు చేసిన అరాచకాలు కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని కుదిపేస్తుండగా ఇప్పుడు గంగుల గ్యాంబ్లింగ్ జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.



Next Story

Most Viewed