Gajwel Bandh: కొనసాగుతున్న గజ్వేల్ బంద్‌.. రోడ్డెక్కిన గులాబీ శ్రేణులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-06 03:16:46  IST  )

గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ బంద్‌కు పిలుపునిచ్చింది. ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ ధర్నా చేపట్టారు.

Gajwel Bandh: కొనసాగుతున్న గజ్వేల్ బంద్‌.. రోడ్డెక్కిన గులాబీ శ్రేణులు
X

దిశ, వెబ్‌డెస్క్: గజ్వేల్ (Gajwel) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ (BRS) పార్టీ పిలుపునిచ్చిన ‘గజ్వేల్ బంద్’ ఉదయం నుంచే ఉధృతంగా కొనసాగుతోంది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతుండటంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. బంద్‌లో భాగంగా గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి (Vanteru Prathap Reddy) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వీరంతా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బస్ డిపో ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. తెల్లవారుజాము నుంచే బస్సులు బయటకు రాకుండా అడ్డుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

దాడికి నిరసనగా ఆందోళన..

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ (Congress) కార్యకర్తలు చేసిన దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని, ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వంటేరు ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. నిందితులను వెంటనే గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బంద్ పిలుపుతో గజ్వేల్ పట్టణంలోని ప్రధాన మార్కెట్లు, వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పట్టణవ్యాప్తంగా భారీగా మోహరించారు. ప్రధాన కూడళ్ల వద్ద పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు.

Next Story