హాట్ టాపిక్‌గా గాజులరామారం ల్యాండ్స్ ఇష్యూ.. సర్వే నెం.307లో‌ యథేచ్ఛగా దందా

by Kema Shiva Kumar |

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో హైడ్రా దూకుడు పెంచింది.

హాట్ టాపిక్‌గా గాజులరామారం ల్యాండ్స్ ఇష్యూ.. సర్వే నెం.307లో‌ యథేచ్ఛగా దందా
X

దిశ, తెలంగాణ బ్యూరో: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో హైడ్రా దూకుడు పెంచింది. సర్వే నం.307 లోని ప్రభుత్వ భూముల రక్షణే ధ్యేయంగా చర్యలు చేపడుతున్నది. పలు నిర్మాణాలను కూల్చివేస్తున్నది. అయితే దీని వల్ల కొందరు పేదలు సైతం నష్టపోతున్నట్లు తెలుస్తున్నది. దశాబ్దాలుగా రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు మౌనంగా ఉండటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే చర్చ జరుగుతున్నది. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా అధికారులు సకాలం లో స్పందించకపోవడంతో.. ఇప్పుడు ప్రజలు హైడ్రాను ఆశ్రయిస్తున్నారు. అయితే హైడ్రా ఫీల్డ్ మీదికి వచ్చినప్పుడు.. వారి వెంట ఇన్నాళ్లు మౌనంగా ఉన్న అధికారులు సైతం దర్శనమిస్తున్నారు.

ఇన్నాళ్లు మౌనంగా ఉండడంతోనే..

గాజులరామారం సర్వే నం.307 లోని సీలింగ్, ప్రభుత్వ భూమిని కాపాడడంలో రెవెన్యూ అధికారులు అనేక ఏండ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆ భూమిని పక్క సర్వే నంబరుతో అమ్మేస్తుంటే మౌనంగా ఉన్నారు. రూ.15 వేల కోట్ల విలువైన భూమి వివాదాస్పదంగా మారినా చర్యలు చేపట్టకుండా కాలయాపన చేశారు. పైగా పక్క సర్వే నంబరు ల్యాండ్ కు సీలింగ్ సర్ ప్లస్ ల్యాండ్ ను నాలా కన్వర్షన్ చేసి ఉత్తర్వులను చేతుల్లో పెట్టారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. దీనిపై అక్రమార్కులతో పాటు రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులోనూ కేసులు దాఖలయ్యాయి. అయితే అనేక మంది పేదలు తెలిసీ తెలియక ఆ భూములను కొనుగోలు చేసి మోసపోయారు. ఈ బాధితులకు సమాధానం చెప్పాలింది మాత్రం తహశీల్దార్, ఆర్డీవోలే. ఇన్నాండ్లుగా కబ్జాకు గురవుతుంటే ఏనాడూ వారిపై చర్యలకు ఉపక్రమించలేదు. దీంతో హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇప్పుడేమో సీరియస్ యాక్షన్ తీసుకోవడం వల్ల బాధితులు కూడా గగ్గోలు పెడుతున్నారు. అయితే ఇప్పుడు అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నదే ప్రశ్న. ఏ భూమి చూపించి, ఏ భూమిని అంటగట్టారన్నదే సందేహం. అలాగే రిజిస్ట్రేషన్లు, జీవో 58, 59 ల కింద రెగ్యులరైజేషన్లు చేసిన అధికారుల పాత్రపై సమగ్ర దర్యాప్తు చేయాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. పేదలే నష్టపోతున్నారని, ఆ ల్యాండ్ ను అమ్మేసి రూ.కోట్లు మూటగట్టుకున్న వారంతా సేఫ్ గా ఉన్నారన్న అభిప్రాయం వినిపిస్తున్నది.

పక్కనే ఉన్న సర్వే నంబర్లతో క్లెయిమ్స్

గాజులరామారం సర్వే నం.307లో మొత్తం 441 ఎకరాల విస్తీర్ణం ఉంది. అయితే పట్టాదారులు 317.25 ఎకరాలను సీలింగ్ సర్ ప్లస్ గా ప్రకటించారు. మిగతా 123.28 ఎకరాలు మాత్రమే పట్టా. 1991 నుంచి అనేక సేల్ డీడ్స్ అయ్యాయి. పట్టా భూమి దాదాపుగా నాలా కన్వర్షన్ గా మారింది. బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి. సర్వే నం.307, 308లో పట్టా భూమి ఎంత? ప్రభుత్వ భూమి ఎంత? అనే వివరాలను బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి, మరో ఎమ్మెల్యేతో కలిసి ఆర్టీఐ కింద సమాచారాన్ని సేకరించారు. దాని ప్రకారం నాలా కన్వర్షన్ గా మారిన దాంతో మొత్తం పట్టా భూమి 123.28 ఎకరాల నుంచి 146 ఎకరాలకు పెరిగింది. దీనికి రెవెన్యూ అధికారుల నుంచి ఎలాంటి సమాధానం లేదు. సీలింగ్ సర్ ప్లస్ ల్యాండ్ నుంచే నాలా కన్వర్షన్ చేసుకొని నిర్మాణాలు చేపట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. దీని వెనుక నగరానికి చెందిన ఎమ్మెల్యే అనుచరులే సూత్రధారులని ఆరోపిస్తూ హైకోర్టులో కేసు దాఖలైంది. సర్వే నం.307/1 పూర్తిగా సీలింగ్ సర్ ప్లస్ ల్యాండ్. కానీ అదే ల్యాండ్ పక్క సర్వే నంబరుతో క్లెయిమ్ చేస్తున్నారు. ధరణి పోర్టల్ అమల్లో ఉన్న కాలంలోనే వాళ్ల పేర్లను రికార్డుల్లో నమోదు చేయించుకున్నారని, ఆ తర్వాత నాలా కన్వర్షన్ చేసినట్లుగా రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. అయితే దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాలని కోరితే తహశీల్దార్, మల్కాజిరిగి ఆర్డీవోలు నిరాకరించారని, దీనిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుందంటూ అప్లికేషన్ ను తిరస్కరించినట్లు రాగిడి లక్ష్మారెడ్డి తెలిపారు.

ఎక్స్‌ట్రా 11 ఎకరాలు ఎక్కడివి?

సర్వే నం.307లో ఈ ఎక్స్ ట్రా 11 ఎకరాలు ఎక్కడివి? పట్టా ల్యాండ్ పూర్తిగా నిర్మాణాలతో నిండిపోయినప్పుడు ఈ ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది? సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా సర్వే నం.307/1 పూర్తిగా సీలింగ్ సర్ ప్లస్ ల్యాండ్/ప్రభుత్వ భూమిగా చెప్పారు. ఈ మేరకు సర్వే కూడా చేసినట్లు తెలిసింది. స్కెచ్ మ్యాప్ ను గూగుల్ మ్యాప్ సూపర్ ఇంపోజ్ కూడా చేశారు. అలాంటప్పుడు నాలా కన్వర్షన్ ఎలా చేశారన్న అనుమానాలు కలుగుతున్నాయి. అంటే సర్వే నం.307లోని పట్టా ల్యాండ్ ను కొనుగోలు చేసిన పత్రాలను చూపించి సర్వే నం.307/1(ప్రభుత్వ భూమి)లోని ల్యాండ్ ని కన్వర్షన్ చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పేదల ఇండ్లు కూల్చారు

వర్టెక్స్, వాసవి, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఓవైసీ లాంటివాళ్లు చెరువులను కబ్జా చేసి కమర్షియల్ భవనాలు, ఫాంహౌస్‌లు కట్టుకున్నారు. అయినా హైడ్రా వాటి జోలికి వెళ్లడం లేదు. గాజులరామారంలో మాత్రం పేదల ఇండ్లు కూల్చారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధించి చెరువులు, ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు లేవా? చెరువులను, ప్రభుత్వ భూములను అమ్మిన వారిపైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. చట్టాలు సంపన్నులకు చుట్టాలవుతున్నాయి. పేదల పాలిట శాపాలవుతున్నాయి. చేతనైతే సంపన్నుల అక్రమ నిర్మాణాలను కూల్చి హైడ్రా నిజాయితీని రుజువు చేసుకోవాలి.

- నారగోని ప్రవీణ్ కుమార్, అధ్యక్షుడు, తెలంగాణ రియల్టర్ల సంఘం

Next Story