- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీవించే హక్కు కోసం భవిష్యత్తులో పోరాటాలు : ఐద్వా జాతీయ ఉపాధ్యక్షులు సుధా సుందర రామన్
జీవించే హక్కు కోసం భవిష్యత్తులో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) పోరాటాలు కొనసాగిస్తుందని ఆ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సుధా సుందర రామన్ తెలిపారు.

దిశ, రాంనగర్ : జీవించే హక్కు కోసం భవిష్యత్తులో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) పోరాటాలు కొనసాగిస్తుందని ఆ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సుధా సుందర రామన్ తెలిపారు. మనిషి జీవించేందుకు తప్పనిసరి అయిన గాలి, నీటిని సైతం ప్రయివేటుపరం చేస్తున్న పాలకుల విధానాలకు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటాల దిశగా ముందుకెళ్లనున్నట్టు ఆమె చెప్పారు. మంగళవారం హైదరాబాద్ లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఐద్వా 14వ జాతీయ మహాసభల మూడవ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 1981లో ఆవిర్భవించిన ఐద్వా దేశవ్యాప్తంగా 1.6 కోట్ల సభ్యత్వంతో దేశం ఆ మూల నుంచి ఈ మూల వరకు 26 రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాన్ని చేస్తున్నదని గుర్తుచేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలు మహిళలపై దాడులను తీవ్రతరం చేశాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పౌరసత్వాన్ని నిరూపించుకోలేని విధంగా డాక్యుమెంట్లను సమర్పించాలని కోరుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్ పేరుతో బీహార్ లో ఎన్నికలకు ముందు 65 లక్షల మంది ఓట్లను తొలగిస్తే అందులో 45 లక్షల మందికి పైగా మహిళలున్నారని ఆమె తెలిపారు. ఇందులోనూ బతుకుదెరువు కోసం వలస వెళ్లిన వారిని లక్ష్యంగా చేసుకుని బీజేపీ వారి ఓటు హక్కును తొలగించిందని తెలిపారు. చనిపోయిన తమ తండ్రుల బర్త్ సర్టిఫికెట్లు సమర్పించాలని కొర్రీలు పెడుతూ మహిళలను వేధిస్తున్నారని చెప్పారు. వాతావరణ మార్పుల ప్రభావం మహిళలను మరింత ఒత్తిడికి గురి చేస్తున్నదని సుధా సుందర రామన్ తెలిపారు. అనేకసార్లు ప్రకృతి విపత్తుల కారణంగా మహిళలకు నివసించేందుకు చోటు కూడా లభించని పరిస్థితి నెలకొందని తెలిపారు. అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ల కోసం అనేక రాష్ట్రాల్లో అడవులను నరికేస్తుంటే వాతావరణంలో అనూహ్యమైన మార్పులు సంభవించి వరదలు తదితర ప్రకృతి విపత్తులు వస్తున్నాయని తెలిపారు. దీంతో స్వచ్ఛమైన గాలి, తాగునీరు కోసం కూడా అల్లాడే పరిస్థితి దాపురిస్తుందని చెప్పారు. ఇప్పటికే ఢిల్లీలో స్వచ్ఛమైన గాలి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారని గుర్తుచేశారు. అన్ని సహజ వనరులను ప్రయివేటీకరిస్తూ, విద్యను కాషాయీకరణ, ప్రయివేటీకరణ చేస్తున్న సర్కారు పాఠశాలల విలీనం, మూసివేతలతో బాలికలను చదువులకు దూరం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యలోనూ ఇదే పరిస్థితిని తెచ్చిందని తెలిపారు.
కేరళ వామపక్ష ప్రభుత్వానికి ధన్యవాదాలు
వాతావరణ మార్పుల నుంచి మహిళలకు భద్రత కల్పించేందుకు కేరళ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆమె ధన్యవాదాలు తెలిపారు. మహిళల సాధికారతకు కుటుంబశ్రీని అమలు చేస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల్లో మైక్రో ఫైనాన్స్ వేధింపులతో మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బతుకు కోసం, ఆత్మగౌరవం కోసం, మనువాదానికి వ్యతిరేకంగా, మానవ, మహిళల హక్కుల కోసం తాము పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.
ఎస్సీ, ఎస్టీ, మహిళల పోరాటాలకు ఐద్వా అండ : ఎస్.పుణ్యవతి
ఎస్సీ, ఎస్టీ, మహిళల బతుకులపై బీజేపీ దాడి చేస్తోందని ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్.పుణ్యవతి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవించడానికి ఆ వర్గాలు చేస్తున్న పోరాటాలకు ఐద్వా అండగా ఉంటుందని ఆమె తెలిపారు. కార్మిక చట్టాలను రద్దు చేసి తెచ్చిన 4 లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో ఐద్వా పాల్గొంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఆర్బీఐ మైక్రో ఫైనాన్స్ కంపెనీలకు పావలా వడ్డీకి రుణాలిస్తే వారు రూ.2 నుంచి రూ.10 వడ్డీకి మహిళకిచ్చి పీడిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వేధింపులకు వ్యతిరేకంగా ఐద్వా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో పోరాటాలు చేసిందని గుర్తుచేశారు. డ్రగ్స్, మద్యం, గంజాయి వంటి మత్తుపదార్థాలకు పరోక్షంగా మహిళలు బలౌతున్నారనీ, దీనికి వ్యతిరేేకంగా పోరాటం చేసిన నెల్లూరు జిల్లాలో డీవైఎఫ్ఐ నాయకులు పెంచలయ్యను మాఫియా హత్య చేసిందని ఆమె గుర్తుచేశారు. తెలంగాణలో ఇప్పటికీ కుల దురహంకార హత్యలు జరుగుతున్నాయని పుణ్యవతి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇండ్ల స్థలాలు, ఇండ్ల కోసం పోరాటాలు చేస్తున్నట్టు తెలిపారు. ఆస్పత్రుల్లో వైద్యుల కొరత, సౌకర్యాల లేమిపై సర్వే చేసి వెలుగులోకి తెచ్చినట్టు చెప్పారు. మెరుగైన బతుకు కోసం మహిళలు సాగిస్తున్న పోరాటమే ఐద్వా పోరాటమన్నారు. మనువాద సంస్కృతిని ప్రతిఘటిస్తూ మహిళలను అగ్నికణాలుగా మారుస్తున్న ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు.
అభయహస్తం పొదుపు డబ్బులివ్వాలి : మల్లు లక్ష్మి
అభయహస్తం పథకంలో భాగంగా రాష్ట్రంలో మహిళలు పొదుపు చేసిన రూ.600 కోట్లను తిరిగి వారికివ్వాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అభయహస్తం పథకాన్ని పునరుద్ధరించాలని ఆమె కోరారు. 85 శాతం మంది మహిళలకు ఉపాధినిస్తున్న నరేగా పథకాన్ని పునరుద్ధరించాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక రాష్ట్రాల నిధులు కేంద్రానికి వెళుతున్న నేపథ్యంలో రాష్ట్రాల వాటాతో ముడిపెడుతూ తెచ్చిన వీబీజీరామ్ జీ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. దీంతో మహిళలు పని హక్కు కోల్పోతారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్ కే జీ టు పీీ జీ వరకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఇండ్ల హక్కుల కోసం భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని తెలిపారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయని మల్లు లక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. 19 ఏండ్ల నుంచి 45 ఏండ్ల మధ్య వయస్సు కలిగిన 57.6 శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హత్రాస్, ఉన్నావ్, బిల్కిస్ బానో, జాతీయ రెజ్లర్ తదితర ఘటనల్లో బీజేపీ నాయకులు, ఎన్నికైన ప్రజా ప్రతినిధుల తీరు పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లాలో 250 ఇండ్ల పట్టాలను ఐద్వా పోరాడి సాధించిందని తెలిపారు. ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి తదితరుల స్ఫూర్తితో భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని ప్రకటించారు. పుస్తకాల విడుదల మీడియా సమావేశంలో ఐద్వా నాయకులు ఏడు ప్రచురణలను విడుదల చేశారు.
ఏడు ప్రచురణలు
1) మహిళల పెరుగుతున్న రుణభారం మరియు ఎంఎఫ్‌ఐ దోపిడీ: దేశవ్యాప్త సర్వే మరియు జాతీయ ప్రజా విచారణ నివేదిక; 2) గీనా కుమారి రాసిన సుశీలా గోపాలన్; 3) మహిళల జీవితాలను మార్చడం వామపక్ష ప్రత్యామ్నాయం-కేరళ కథ (ఏఐడీడబ్ల్యూఏ కేరళ రాష్ట్ర కమిటీ ద్వారా); 4) ఏఐడీడబ్ల్యూఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ద్వారా ఆంధ్ర మహిళా సంఘం మొదటి రాష్ట్ర మహాసభ నివేదిక ఆంగ్ల అనువాదం; 5) సుభాషిణి అలీ రాసిన సామాజిక సంస్కరణ యాత్ర కోసం సీఈసీ బుక్‌లెట్ తెలుగు అనువాదం; 6) ఎస్. పుణ్యవతి రాసిన తెలుగు వ్యాసాల సంకలనం, 7) ఏఐడీడబ్ల్యూఏ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర కమిటీ ద్వారా తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్రపై బుక్‌లెట్ (పి. సుందరయ్య పుస్తకం నుంచి ఒక అధ్యాయం). ఈ రచనలు ఏఐడీడబ్ల్యూఏ, మహిళా హక్కుల ఉద్యమం దృక్పథం, చరిత్ర, ప్రచారానికి ఉపయోగపడతాయని భావిస్తున్నారు.






