నైపుణ్యాలు పెంచుకుంటేనే భవిష్యత్తు : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

by Muthe.Rajitha |

భవిష్యత్ అవసరాలకు తగినట్లు నైపుణ్యాలు పెంచుకుంటేనే యువత తాము కోరుకున్న ఉద్యోగాలను పొందగలుగుతారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు.

నైపుణ్యాలు పెంచుకుంటేనే భవిష్యత్తు : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో: భవిష్యత్ అవసరాలకు తగినట్లు నైపుణ్యాలు పెంచుకుంటేనే యువత తాము కోరుకున్న ఉద్యోగాలను పొందగలుగుతారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. బుధవారం టీ-వర్క్స్ ప్రాంగణంలో ‘పాత్ వే టు తైవాన్’ పేరుతో నిర్వహించిన తైవాన్‌లో ఉద్యోగాల కల్పనకు నిర్వహించిన మొదటి రౌండ్ ఇంటర్వ్యూల కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీ- వర్క్స్ సీఈవో జోగిందర్ తనికెళ్ల, తైవాన్ ప్రభుత్వ సంస్థ టేలెంట్ తైవాన్ ప్రతినిధి ఈడెన్ లియెన్ మంత్రి సమక్షంలో ఉద్యోగాల కల్పన, ఉన్నత విద్యా కార్యక్రమాలకు సంబంధించిన ఎంవోయూపై సంతకాలు చేశారు.

తైవాన్‌కు చెందిన రియల్ టెక్, లాజిటెక్, మీడియాటెక్, విస్ట్రాన్, హిమాక్స్, కౌపాంగ్, ఐటీఆర్ఐ ఇందుకు ముందుకొచ్చాయి. ఈ ప్రోగ్రాం ద్వారా ఇక్కడి విద్యార్థులను తైవాన్ కంపెనీలు మొదటి రౌండ్ ప్రాథమిక ఎంపిక ప్రక్రియ పూర్తి చేసుకుని తదుపరి దశలో తైవాన్‌కు ఆహ్వానిస్తాయి. మొదటి విడతగా 20 ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులు తొలిదశ ఇంటర్వ్యూల కోసం హాజరయ్యారు.

తొలిదశ ఇంటర్వ్యూలు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆరు నెలలపాటు ఇక్కడ (చైనీస్) మాండరిన్ భాషను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాండరిన్ భాష, సాంకేతిక పరిజ్ణానాల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులకు తైవాన్‌లో ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. దీని కోసం 8 తైవాన్ కంపెనీలు ఇక్కడికి వచ్చాయి.

నిధులకు ముందుకొచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ

ఈ సందర్భంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్ చల్లవర్ తమ సీఎస్ఆర్ ఫండ్ కింద టీ-వర్క్స్ ఫౌండేషన్‌కు రూ.1.5 కోట్లను సమకూర్చనున్నట్టు మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ప్రకటించారు. దీనిని పర్యావరణ అనుకూల విధానాల్లో వస్తూత్పత్తి, ఆవిష్కరణలు చేసే అంకుర సంస్థలకు సహాయనిధిగా అందజేస్తారు.

భవిష్యత్తు టెక్నాలజీల గురించి తైవాన్ ముందు చూపు, శ్రమించే తత్వాన్ని తెలంగాణ యువత ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో భాగంగా తైవానీస్ యూనివర్సిటీలు తమ విద్యాసంస్థల ప్రాముఖ్యతను వివరించే స్టాళ్లను ఏర్పాటు చేశాయి. 12వ తరగతి, డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులు తమ యూనివర్సిటీల్లో చేరితే వారికి ఉద్యోగావకాశాలు పెరుగుతాయని యూనివర్సిటీల ప్రతినిధులు వివరించారు.

ఈ కార్యక్రమంలో టీ-హబ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లెఫ్టినెంట్ కల్నల్ టీఎం ప్రవీణ్‌కుమార్, తైవాన్ ప్రభుత్వ సంస్థ టేలెంట్ తైవాన్ సీఈవో జోనాథన్ లియావో, ప్రతినిధులు టెర్రాలిన్, ఇడెన్ లియెన్, హైదరాబాద్ ఐఐటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొ.శివరామకృష్ణ వంజరి తదితరులు పాల్గొన్నారు.

Next Story