- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిధుల్లేవ్.. వసతుల్లేవ్.. ఈ ఏడాది గురుకులాల విద్యార్థులకు తప్పని తిప్పలు!
నిరుపేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు విద్యను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన గురుకులాలు, వసతి గృహాలు సమస్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: నిరుపేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు విద్యను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన గురుకులాలు, వసతి గృహాలు సమస్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. వేసవి సెలవుల తర్వాత తిరిగి వసతి గృహాలకు చేరుకుంటున్న విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలికాయి. అరకొర వసతుల మధ్య ఏడాదంతా ఎలా నెట్టుకోరావాలో అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జూన్ 15న విద్యా సంవత్సరం ప్రారంభం కాగా, ఆ రోజు అమావాస్య కావడంతో చాలా మంది విద్యార్థులు పాఠశాలలకు రాలేదు. మంగళవారం గురుకులాలు, వసతి గృహాలకు వచ్చిన స్టూడెంట్స్ కు సమస్యలే స్వాగతం పలికాయి.
పాత భవనాల్లో వసతి..
రాష్ట్రంలో చాలా గురుకులాలు, హాస్టళ్లు ఎప్పుడో నిర్మించిన భవనాల్లో నడుస్తున్నాయి. అవి వర్షం పడితే కురుస్తున్నాయి. పైకప్పు పెచ్చులూడిన ఘటనలు గతేడాది అనేకం జరిగాయి. చాలాచోట్ల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. సరిపడా మరుగుదొడ్లు, స్నానపు గదులు కూడా లేవు. కొన్ని చోట్ల వంద మంది విద్యార్థులుంటే నాలుగైదు గదులే ఉన్నాయి. వందలాది ప్రభుత్వ హాస్టళ్ల భవనాలకు ప్రహరీ కూడా లేదు. మరోవైపు చాలా వసతిగృహాలు, గురుకులాలు పట్టణాల చివరన మురుగు కంపులో కొనసాగుతున్నాయి. ఇక చాలా ప్రాంతాల్లో గురుకులాలు, హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వాటిల్లోనూ అరకొర సౌకర్యాలే ఉన్నాయి. పలుచోట్ల వంట గదుల్లో సమస్యలున్నాయి. మరికొన్ని తాగునీరు, విద్యుత్ సంబంధిత సమస్యలు ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందుల నడుమ విద్యార్థులు వసతిని పొందాల్సిన దుస్థితి వచ్చింది.
హామీ ఇచ్చారు.. మర్చిపోయారు..
నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మేపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల గతేడాది జల దిగ్బంధంలో చిక్కుకుంది. 500 మంది విద్యార్థులు, 26 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వరద నీటిలో చిక్కుకున్నారు. దానికి ప్రహరీ గోడ లేకపోవడమే కారణమని అధికారులు తేల్చారు. దీంతో ప్రహరీ కట్టిస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ సమయంలో హామీ ఇచ్చారు. కానీ దాదాపు ఏడాది గడచినా ప్రహరీ కట్టలేదు. దీంతో ఆ గురుకులానికి పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అనేక గురుకులాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లు సమస్యలతో సతమతం అవుతున్నాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడే అధికారులు, ప్రజాప్రతినిధులు హడావిడి చేసి.. ఆ తర్వాత అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి.
నిధులేవి..
గత విద్యా సంవత్సరం ముగిసే సమయంలో.. ఆయా గురుకులాలు, హాస్టళ్లలో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి ప్రతిపాదనలు పంపాలని ఉన్నతాధికారుల నుంచి వార్డెన్లు, ప్రిన్సిపల్స్ కు ఆదేశాలు వెళ్లాయి. చాలాచోట్ల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. కానీ, వాటికి సరిపడా నిధులను మాత్రం విడుదల చేయలేదు. కొద్ది మొత్తంలో వచ్చిన నిధులతో చిన్న చిన్న పనులు చేశారు. అయినా చాలాచోట్ల కనీసం కిటికీలు లేని భవనాలు కనిపిస్తున్నాయి. బాత్‌రూంలకు డోర్లు లేక పరదాలు అడ్డు కట్టారు. ఐదారు లక్షల రూపాయలు విడుదల చేస్తే.. వాటితో ఏం పనులు చేయించాలని అధికారులు ప్రశ్నిస్తున్నారు. కొన్నిచోట్ల ప్రభుత్వం విడుదల చేసిన నిధులను కూడా అధికారులు ఖర్చు చేయలేదు. ఫలితంగా విద్యార్థులు ఈ ఏడాది కూడా సమస్యల నడుమ చదువుకోవాల్సి వస్తుందేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలో గురుకులాలు ఇలా..
సాంఘిక సంక్షేమ గురుకులాలు- 268
బీసీ సంక్షేమ గురుకులాలు- 261
గిరిజన సంక్షేమ గురుకులాలు- 165
మైనారిటీ సంక్షేమ గురుకులాలు- 205
కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా టీపీఎస్.. ప్రభుత్వ విద్యలో కొత్త విప్లవం






