సమ్మర్ క్యాంపులు నుంచి కల్చరల్ పోటీల వరకు.. రేపటి నుంచి విద్యా వారోత్సవాల సందడి

by Ramesh Naini |

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యాశాఖ ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వారోత్సవాలను నిర్వహించనుంది.

సమ్మర్ క్యాంపులు నుంచి కల్చరల్ పోటీల వరకు.. రేపటి నుంచి విద్యా వారోత్సవాల సందడి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యాశాఖ ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వారోత్సవాలను నిర్వహించనుంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, విద్యా నాణ్యత మెరుగుదలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమాన్ని రేపు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ వేదికపై నుంచి క్యూర్ రీజియన్‌లోని పాఠశాలలకు సంబంధించిన వివిధ అభివృద్ధి పనులను, మౌలిక సదుపాయాల కల్పన కార్యక్రమాలను సీఎం ప్రారంభించనున్నారు. ఈ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి సంబంధించి ఆయా జిల్లాల డీఈఓలకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్ పరిధిలోని విద్యార్థులను 15 వేల మంది విద్యార్థులను బస్సుల ద్వారా కార్యక్రమానికి హాజరయ్యేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర గీతంతో వారోత్సవాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. అనంతరం పాఠశాల బ్యాండ్లు, ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందాలు మార్చ్ పాస్ట్ నిర్వహిస్తారు. కార్యక్రమంలో ప్రతిభా అవార్డులు ప్రదానం చేయనున్నారు. అలాగే ఐఐటీ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించిన కేజీబీవీ యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ విద్యార్థులకు ల్యాప్ టాప్స్ పంపిణీ చేయనున్నారు.

వారోత్సవాల ప్రత్యేకతలు:

ప్రభుత్వ పాఠశాలలను అభ్యసన కేంద్రాలుగా మార్చడం, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తోడ్పడటం. వారం రోజుల పాటు పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల విజయాలు, ఉపాధ్యాయుల చొరవలు, కొత్త అడ్మిషన్ల పెంపుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు, స్థానిక కమ్యూనిటీ సభ్యులను ఈ ఉత్సవాల్లో భాగస్వాములను చేస్తారు. పాఠశాలల్లో సృజనాత్మక ప్రదర్శనలు, హాజరు గుర్తింపు వంటి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా సాగుతాయి.

వారం రోజుల పాటు కార్యక్రమాలు:

మే 11న పీఎంశ్రీ పాఠశాలల్లో సమ్మర్ క్యాంపులను ప్రారంభిస్తారు. ఈ క్యాంపులో అకడమిక్, కోడింగ్, కళలు, క్రీడలు, యోగా నేర్పిస్తారు. 12 న పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు పీఎంశ్రీ పాఠశాలల్లో రెమిడియల్ క్యాంపులు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు నిర్వహిస్తారు. 13న జిల్లా స్థాయిలో అందరు సర్పంచులను ఆహ్వనించి సమావేశం నిర్వహిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, అకడమిక్ కార్యక్రమాలు వివరించాల్సి ఉంటుంది. మే 14 న బడిబాట కార్యక్రమం నిర్వహిస్తారు. అన్ని పాఠశాలలను శుభ్రపరిచి అలంకరించి ఇంటింటికి ప్రవేశాలపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులతో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంటుంది. మే 15న పాఠశాలలు, గ్రామ కమ్యూనిటీ లైబ్రరీలో కార్యక్రమాలు ఉంటాయి. పుస్తక ప్రదర్శనలు, పఠన పోటీలు నిర్వహిస్తారు. మే 16న మండల స్థాయిలో విద్యార్థులకు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ పై శిక్షణ ఇస్తారు. కళలు, హస్తకళలు, సంగీతం, నాట్యం, నాటకం, సాహిత్య తదితర సాంస్కృతిక పోటీలు ఉంటాయి. పర్యావరణ హిత పదార్థాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయాల్సి ఉంటుంది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రతిభా ప్రదర్శనలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపాల్సి ఉంటుంది. మే 17 న ప్రతి జిల్లా కేంద్రంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, టీచర్లకు సన్మాన కార్యక్రమంతో పాటు, కల్చరల్ ప్రోగ్రాంలను నిర్వహిస్తారు.

Next Story