- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Budget Speech: అప్పుల నుంచి అభివృద్ధి వైపు.. డిప్యూటీ సీఎం రెండు గంటల బడ్జెట్ ప్రసంగం ఇదే!
శాసనసభలో బడ్జెట్ 2026-27 ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఆయన బడ్జెట్‌పై దాదాపు రెండు గంటల పాటు ప్రసంగించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పిన అడుగుజాడల్లోనే నడుస్తూ తమ పాలన సాగిస్తున్నామని.. తాము పాలకులం కాదు, ప్రజలకు సేవకులం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ఆయన శాసనసభలో బడ్జెట్ 2026-27 ప్రవేశపెట్టారు. ప్రజలు తమకు అప్పగించిన ఈ అధికారాన్ని ఒక బాధ్యతగా భావించి, ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకుపోతున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక, వ్యవస్థల విధ్వంసాన్ని సరిచేస్తూ, పాత అప్పులను, వాటి వడ్డీలను కట్టుకుంటూనే పాలనను గాడిలో పెట్టామని వెల్లడించారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలన్నదే తమ లక్ష్యమని.. అందుకోసమే అహర్నిశలు శ్రమిస్తున్నామని చెప్పారు. ఈ రెండేళ్లలోనే రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తీసుకురాగలిగామని తెలిపారు. బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదని.. ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు అని.. బడ్జెట్ ప్రజల జీవన స్థితిగతులు మార్పునకు దోహదపడే లెక్కలు అని వెల్లడించారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆశయాలను నిజం చేసే సంకల్ప పత్రమే ఈ బడ్జెట్ అని చెప్పారు.
రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.17,82,198 కోట్లు
2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) ప్రస్తుత ధరల ప్రకారం రూ.17 లక్షల 82 వేల 198 కోట్లు అని భట్టి వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే వృద్ధి రేటు 10.7 శాతంగా నమోదైందన్నారు. ఇదే సమయంలో దేశ జీడీపీ రూ.3 కోట్ల 57 లక్షల 13 వేల 886 కోట్ల కాగా, వృద్ధి రేటు 8 శాతంగా ఉన్నదని.. తెలంగాణ వృద్ధి రేటు దేశ సగటు వృద్ధి రేటు కంటే 2.7 శాతం ఎక్కువగా ఉన్నదని చెప్పారు. అదే విధంగా దేశ జీడీపీలో రాష్ట్ర జీఎస్‌డీపీ 5శాతం వాటా కలిగి దేశానికి ఒక బలమైన గ్రోత్ ఇంజిన్‌గా తెలంగాణ నిలుస్తున్నదని తెలిపారు. దేశ వృద్ధి రేటు తగ్గుతూ మందగమనంలో ఉన్నప్పటికీ, రాష్ట్ర వృద్ధిరేటులో మెరుగైన పెరుగుదల కనిపిస్తుందని చెప్పారు. అలాగే.. రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 4 లక్షల 18వేల 931 కాగా, వృద్ధి రేటు 10.2 శాతం అని.. దేశ తలసరి ఆదాయం రూ. 2 లక్షల 19 వేల 575 కాగా.. వృద్ధి రేటు కేవలం 6.9 శాతం అని తెలిపారు. దేశ తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,99,356 ఎక్కువ అని.. అంటే 1.9 రెట్లు అధికం అని వెల్లడించారు.
3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ
ప్రస్తుతం 200 బిలియన్ యూఎస్ డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి 1 ట్రిలియన్ యూఎస్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ యూఎస్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ఒక మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని భట్టి చెప్పారు. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం విభాగాల వారీగా ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కో ఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. 2021-22 సంవత్సరంలో రాష్ట్రానికి కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రూ.4,826 కోట్లు వచ్చాయని.. తమ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటిదాకా 7,072 కోట్ల రూపాయలను సాధించిందన్నారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ, మరిన్ని నిధులను సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పరిమితులకు మించి చేసిన అప్పుల కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడిందని.. ఈ తప్పిదాన్ని సరిదిద్దేందుకు, గత ప్రభుత్వం అధిక వడ్డీకి తెచ్చిన రూ.25,612 కోట్ల రుణాలను తక్కువ వడ్డీకి పునర్వ్యవస్థీకరించి ఉందన్నారు. అంతేకాకుండా, రుణ చెల్లింపుల వ్యవధిని పెంచి, అసలు చెల్లించాల్సిన కాలాన్ని 20 -39 సంవత్సరాలకు పొడిగించిందని.. ఈ రుణ పునర్వ్యవస్థీకరణ ద్వారా 2025-26 నుంచి 2031-32 దాకా చెల్లించాల్సిన రూ.34,058 కోట్ల నుంచి 11,915 కోట్లకు తగ్గిందని తెలిపారు. దీని ద్వారా రాష్ట్రానికి రూ.22,142 కోట్ల క్యాష్ అవుట్ ఫ్లో తగ్గి నగదు వెసులుబాటు కలిగిందన్నారు.
రూపాయికి వచ్చేది 42 పైసలే..
కేంద్రానికి పన్నుల రూపంలో ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుస్తుంటే... తిరిగి కేంద్రం పన్నుల పంపకాల ద్వారా మనకు ఇస్తున్నది మనం కట్టే ప్రతి రూపాయిలో సగటున 42 పైసలేనని డిప్యూటీ సీఎం తెలిపారు. జనాభా నియంత్రణ పాటిస్తూ, సొంత రాబడి పెంచుకుంటూ, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న రాష్ట్రాలకు ఈ పంపకం ద్వారా తీవ్ర అన్యాయం జరుగుతూ వస్తుందన్నారు. 16వ ఆర్థిక సంఘం ముందు బలమైన వాదనను వినిపించి తెలంగాణ వాటాను 2.102 శాతం నుంచి 2.174 శాతానికి పెంచడం జరిగిందన్నారు. అలాగే.. క్యూర్, రేర్, ప్యూర్ అనే మూడు ప్రాంతాల ఆధారంగా సమతుల్య, సుస్థిర అభివృద్ధి సాధించడానికి రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి వ్యూహాన్ని ప్రతిపాదించిందని చెప్పారు. దావోస్‌లో ఆవిష్కరించిన నెక్స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030 ద్వారా ఈ రంగంలో ఇప్పటిదాకా రూ.73,360 కోట్ల పెట్టుబడులను ఆకర్షించామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి దార్శనిక నాయకత్వంలో 30 వేల ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
నిరుద్యోగులకు 67,763 ఉద్యోగాలు..
గత ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడిందని, టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించే అత్యున్నతమైన గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించలేక, పరీక్షా పత్రాలు లీక్ కావడంతో రాజ్యాంగబద్ధ సంస్థ నవ్వులపాలు అయిందని భట్టి అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఎందరో నిరుద్యోగులు ప్రాణాలు కోల్పోయారని.. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యూపీఎస్సీ స్థాయిలో టీజీపీఎస్సీని పునర్ వ్యవస్థీకరించి, నిరుద్యోగుల ఆకాంక్షలను గుర్తించి, ఇప్పటివరకు 67,763 మంది నిరుద్యోగులకు నియామక పత్రాలు అందించడం జరిగిందన్నారు. సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద, మధ్యతరగతి, ధనిక అని తేడా చూడకుండా రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా జూన్, 02, 2026 నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని నూతనంగా ప్రవేశపెడ్తున్నామన్నారు. భూభారతి ద్వారా ఈ ఏడాది 3 లక్షల 76 వేల కొత్త పట్టాదారు పాస్ బుక్స్ జారీ చేయబడ్డాయన్నారు. రూ.12,600 కోట్లతో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ద్వారా 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లను అందించి, వారి పురోగతికి ఇతోధికంగా తోడ్పడతామన్నారు. రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యతగా తాము భావిస్తున్నామని అందుకే ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి రూ.23,179 కోట్లు ప్రతిపాదిస్తున్న ట్లు చెప్పారు. మార్చి 13, 2026 తెలంగాణ విద్యుత్ రంగానికి చరిత్రాత్మక రోజు అని.. ఆ రోజు 18,228 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ను సమర్థవంతంగా నెరవేర్చడమే కాకుండా 341.08 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక వినియోగాన్ని నమోదు చేశామన్నారు. ఇది తెలంగాణ అభివృద్ధి వేగాన్ని స్పష్టంగా చూపించే సూచిక అని అన్నారు. నాణ్యమైన, నైపుణ్యం కలిగిన విద్యను అందించాలనే సంకల్పంతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి 33 జిల్లాల్లో 1,362 ప్రీ-ప్రైమరీ విభాగాలను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించామని.. రాబోయే విద్యా సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని 2,000 నుంచి 2,500 ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు 2025–26 విద్యా సంవత్సరంలో 93 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలను యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ఆఫ్ ఎక్సలెన్స్‌గా ప్రకటించామన్నారు.
విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం
2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో రాష్ట్రంలో నూతనంగా బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని భట్టి తెలిపారు. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రతి విద్యార్థికి వారానికి మూడు రోజులు అల్పాహారంతోపాటు పాలు, మిగతా మూడు రోజులు రాగి జావ అందిస్తామన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్న విద్యార్థులకు ఇకపై నూతనంగా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నామని తెలిపారు. ఇంటర్మీడియట్ విద్య చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలను పంపిణీ చేయాలని నిర్ణయించామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వసతి గృహాలు, గురుకుల విద్యా సంస్థల్లోని వంటశాలల ఆధునీకరణకు 100 కోట్ల రూపాయలు ప్రతిపాదించామన్నారు. నైపుణ్యాలకు సంబంధించిన అన్ని సంస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు, పాలిటెక్నిక్ కళాశాలలు, టామ్‌కామ్‌లను ఈ స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువస్తామని.. యువతను బ్లూ కాలర్ ఉద్యోగాల కోసం సన్నద్ధం చేసేలా.. ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ తదితర విద్యాసంస్థల తరహాలో ఈ విశ్వవిద్యాలయాన్ని తయారు చేయటం తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్‌ని సిద్ధం చేసి, వారికి డిజిటల్ హెల్త్ కార్డులు అందజేస్తామని తెలిపారు. నూతనంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతున్నామని.. మెడికల్ విద్యను విస్తరించేందుకు కొత్తగా 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారా మెడికల్ కాలేజీలు ప్రారంభించబడ్డాయన్నారు. ఉద్యోగుల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టామని.. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే కోటి 20 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుందని.. 60 ఏండ్ల వరకు 10 లక్షల రూపాయల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, విమాన ప్రమాదంలో మరణిస్తే 2 కోట్ల రూపాయల అదనపు కవరేజీ లభించే విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేశామని వెల్లడించారు. ఈ పథకం 7 లక్షల 57 వేల ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తిస్తుందని చెప్పారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద కొత్తగా డా.బి.ఆర్.అంబేద్కర్ నాలెడ్జ్ టవర్‌ను నిర్మిస్తున్నామని.. అదేవిధంగా, నింబోలి అడ్డ కాచిగూడలో బాబూ జగ్జీవన్ రామ్ పేరుతో నూతన వసతి గృహాన్ని నిర్మిస్తామని తెలిపారు. హైదరాబాద్ మహానగర ప్రాంతానికి ఔటర్ రింగ్ రోడ్ వరకు తాగునీరు, మురుగునీటి సేవలను,హైదరాబాద్ మహానగర వాటర్ బోర్డు అందిస్తున్నదని.. గోదావరి తాగునీటి ప్రాజెక్టు, కొత్త రిజర్వాయర్లు, 39 మురుగునీటి శుద్ధి కేంద్రాలను మంజూరు చేశామని, వాటి నిర్మాణం వివిధ దశలలో కొనసాగుతుందన్నారు.
నక్సలిజం.. పునరావాసం
నక్సలిజాన్ని గత ప్రభుత్వం, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కేవలం శాంతి-భద్రతల సమస్యగానే పరిగణించి, పోలీసు, సైనిక బలగాలతో అణచివేసే ప్రయత్నం చేశాయని.. కానీ, తమ ప్రభుత్వం ఈ సమస్య మూలాలను విశ్లేషించి యువతకు సరైన జీవనోపాధి, సామాజిక గౌరవం, ఆర్థిక భరోసా కల్పిస్తే అడవుల్లోకి వెళ్లిన వారు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలుస్తారనే సామాజిక-ఆర్థిక వాస్తవాన్ని గుర్తించిందని భట్టి తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-2023 వరకు 347 మంది మావోయిస్టులు లొంగిపోగా.. తమ ప్రభుత్వం ఏర్పడిన 2023 డిసెంబర్ 7 నుంచి 2026 మార్చి 8 వరకు 732 మంది వివిధ స్థాయి క్యాడర్ మావోయిస్టులు లొంగిపోయారన్నారు. చరిత్రలో మొదటిసారిగా హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడంతో ప్రపంచం దృష్టిని హైదరాబాద్ ఆకర్షించిందని తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే తాను ప్రతిపాదిస్తున్న ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశా దీపం అని అన్నారు. అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేసి ఆర్భాటాలకు పోకుండా ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యతనిచ్చామని తెలిపారు.
నాలుగో సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3.24 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇది ఆయన వరుసగా (కాంగ్రెస్ ప్రభుత్వంలో) ప్రవేశపెట్టిన నాల్గవ బడ్జెట్ కాగా, ఇందులో ఇందిరమ్మ ఇళ్లు, సాగునీరు, విద్య, గ్రామీణాభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేశారు. అంతకుముందు ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ ఆలయంలోని అమ్మవారి వద్ద బడ్జెట్ ప్రతులను పెట్టి భట్టి పూజలు నిర్వహించారు.
రెండు గంటలపాటు బడ్జెట్ ప్రసంగం
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రూ.3,24,234 కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. మధ్యాహ్నం 12.04 గంటలకు ప్రారంభమైన భట్టి బడ్జెట్ ప్రసంగం మధ్యాహ్నం 1.55 నిమిషాల వరకు కొనసాగింది. అంటే సుమారు రెండు గంటలపాటు బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపించారు. కాగా.. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే భట్టిని సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. ప్రభుత్వ విప్‌లు, మంత్రులు, ఎమ్మెల్యేలు భట్టిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. ‘‘ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యం’’ అంటూ అంబేద్కర్ చెప్పిన మాటలతో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించడం విశేషం.






