గ్రేటర్ బడ్జెట్ కు తుది మెరుగులు.. విలీన మున్సిపాలిటీలకూ చోటు

by Naga Rani Yarlagadda |

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) 2026-27 వార్షిక బడ్జెట్ రూపకల్పన కొలిక్కి వచ్చింది.

గ్రేటర్ బడ్జెట్ కు తుది మెరుగులు.. విలీన మున్సిపాలిటీలకూ చోటు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) 2026-27 వార్షిక బడ్జెట్ రూపకల్పన కొలిక్కి వచ్చింది. జీహెచ్ఎంసీ ఆదాయ, వ్యయాల ఆధారంగా ఈసారి అదనంగా రూ.2వేల కోట్లను పెంచి రూ.11,050 కోట్లు ఉండేలా అధికారులు నిర్ణయించారు. గ‌తేడాది 2025-26 బ‌డ్జెట్‌ను రూ.8,440 కోట్లతో రూపొందించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి జీహెచ్ఎంసీలోకి 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయడంతో వాటికి పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ రూపొందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. అందులో భాగంగానే బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ నెల 11న జ‌రుగ‌నున్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ క‌మిటీ స‌మావేశంలో డ్రాఫ్ట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

అధికారులతో చర్చలు..

జీహెచ్ఎంసీ బడ్జెట్ రూపకల్పనపై అదనపు, జోనల్, డిప్యూటీ కమిషనర్లతో చర్చించాలని కమిషనర్ కర్ణన్ నిర్ణయించినట్లు తెలిసింది. అయితే జీహెచ్ఎంసీకి ఆదాయ, వ్యయాలతోపాటు 27 యూఎల్బీలకు సంబంధించిన ఆదాయం, అప్పులు, ఖర్చులు, చేపట్టాల్సిన మౌలిక వసతుల గురించి సంబంధిత డిప్యూటీ కమిషనర్లతో కమిషనర్ కర్ణన్ చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే జోనల్ కమిషనర్లు, అదనపు కమిషనర్లు, చీఫ్ ఇంజినీర్లు, సిటీ ప్లానర్లు, ఎస్ఈలు వార్షిక బడ్జెట్ ఆదాయ వ్యయాల ప్రతిపాదనలను సిద్ధంచేసే పనిలో ఉన్నారు. గతంలో హెడ్ ఆఫీసు స్థాయిలోనే బడ్జెట్‌ను తయారుచేసేవారు. కానీ గతేడాది నుంచి డిప్యూటీ కమిషనర్ల నుంచి అంచనాలను అడుగుతున్నారు. జీహెచ్ఎంసీ చట్టం-1955 సెక్షన్ 182 ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ అంచనాల నివేదికను ప్రతిఏటా నవంబర్ 10లోపు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం ముందు ప్రవేశపెట్టాలి. కానీ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, 27 యూఎల్బీల విలీనం నేపథ్యంలో ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీ అనుమతి తీసుకున్నట్లు తెలిసింది.

డ్రాఫ్ట్ బడ్జెట్ రూ. 11,050 కోట్లు..

రాష్ట్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్లోనూ హైదరాబాద్ మహానగరానికి కేటాయింపులు పెరుగుతాయనీ, రెవెన్యూ రిసీట్స్, ప్రాపర్టీ ట్యాక్స్, టౌన్ ప్లానింగ్, ఎస్టేట్, పార్కుల ఆదాయాలూ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 27 విలీన యూఎల్బీల ఏరియాలో అభివృద్ధి పనులు చేపట్టడానికి బడ్జెట్‌లో ప్రతిపాదించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెవెన్యూ రిసీట్స్ రూ.4,445 కోట్లుగా ఉంటే ఈ ఏడాది రూ.5,550 కోట్లుగా ఉండొచ్చని, క్యాపిటల్ వ్యయం రూ.4000 కోట్లు ఉంటే వచ్చే ఏడాది రూ.5,500 కోట్లుగా పెరుగుతుందని అధికారుల అంచనా. హెచ్-సిటీ ప్రాజెక్టులు కార్యరూపంలోకి రావడంతోపాటు ఎస్ఎన్డీపీ, నాలాల మాస్టర్ ప్లాన్, సీఆర్ఎంపీ, వీధిదీపాల నిర్వహణ సైతం పెరిగే అవకాశముందని చెబుతున్నారు. 2024-25లో బడ్జెట్ అంచనాలు రూ.7,937 కోట్లుగా ఉంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలు రూ.8,440 కోట్లకు పెరిగింది. ఈ రెండు బడ్జెట్ల వ్యత్యాసం రూ.503 కోట్లుగానే ఉంది. అయితే, వచ్చే వార్షిక బడ్జెట్ అంచనాలు రూ.11,050 కోట్ల వరకు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఆదాయంపై ఆశలు..

జీహెచ్ఎంసీకి ప్రధాన ఆదాయ వనరులుగా ప్రాపర్టీ ట్యాక్స్, టౌన్ ప్లానింగ్ నుంచే వచ్చేదే అధికం. అయితే ప్రాపర్టీ వసూళ్లను రూ.3వేల కోట్లకు పెంచడానికి కమిషనర్ కర్ణన్ సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు. పాత బకాయిలను వసూలు చేయడానికి 2 నెలలకు ముందుగానే ఓటీఎస్(వన్ టైం సెటిల్‌మెంట్) స్కీమ్ తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నారు. అయితే జీహెచ్ఎంసీతోపాటు 27 విలీన యూఎల్బీల్లో సైతం ఆస్తి పన్ను భారీగా వసూలయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు మాల్స్, ఇతర వాణిజ్య భవనాల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ ఆదాయాన్ని సైతం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నారు. 2025-26లో రూ.2,500 కోట్లతోపాటు 27 మున్సిపాలిటీల నుంచి మరో రూ.500 కోట్లు వసూలు చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు టౌన్ ప్లానింగ్ ద్వారా రూ.2వేల కోట్లకు పైగానే ఆదాయం వచ్చే అవకాశాలున్నాయని ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే రూ.1500 కోట్లు, 27 మున్సిపాలిటీల్లో మరో రూ.500 కోట్ల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

ఈ నెల 11న స్టాండింగ్ కమిటీ భేటీ..

హైదరాబాద్ మహానగర బడ్జెట్ గురించి ఈ నెల 11న జరగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. జీహెచ్ఎంసీతోపాటు 27 యూఎల్బీ బడ్జెట్ గురించీ చర్చించనున్నారు. ఆదాయ, వ్యయాల గురించి సభ్యులు చర్చించే అవకాశముంది. ఈ బడ్జెట్ గురించి జనవరిలో నిర్వహించే జనరల్ బాడీ సమావేశంలో చర్చించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Next Story