- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Drug mafia: ఫ్రీ బ్యాంకాక్ టూర్ ఎర.. డ్రగ్స్ మాఫియా అసలు ఆట ఇదే!
‘ఫ్రీగా బ్యాంకాక్ ట్రిప్.. ఫైవ్ స్టార్ హోటల్‌లో వసతి.. అయితే వచ్చేటప్పుడు ఒక పార్శిల్ తీసుకురావాలి. రాగానే ఇంకో రూ. 25 వేల వరకు ఇస్తాం.’ అంటూ ఈజీ మనీ పేరిట డ్రగ్స్ ముఠాలు యువతకు గాలం వేస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ఫ్రీగా బ్యాంకాక్ ట్రిప్.. ఫైవ్ స్టార్ హోటల్‌లో వసతి.. అయితే వచ్చేటప్పుడు ఒక పార్శిల్ తీసుకురావాలి. రాగానే ఇంకో రూ. 25 వేల వరకు ఇస్తాం.’ అంటూ ఈజీ మనీ పేరిట డ్రగ్స్ ముఠాలు యువతకు గాలం వేస్తున్నాయి. ఉచిత విదేశీ పర్యటనల ముసుగులో అమాయక యువత, సినీ అవకాశాల కోసం ఎదురుచూసే జూనియర్ ఆర్టిస్టులను మ్యూల్స్ డ్రగ్స్ క్యారియర్లుగా మారుస్తూ రూ. వందల కోట్ల డ్రగ్స్ దందా సాగిస్తున్న ఓ అంతర్జాతీయ ముఠా గుట్టును తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరోకు చెందిన ఈగిల్ బృందం, కేంద్ర దర్యాప్తు సంస్థలు సంయుక్తంగా రట్టు చేశాయి.
కోట్లు కురిపించే ఓజీ..!
బ్యాంకాక్ మార్కెట్లో కిలోకు రూ. 3 లక్షలకు లభించే హైడ్రోపోనిక్ గంజాయి (ఓజీ) ఇండియాలో రూ.80 లక్షల నుంచి రూ. కోటి వరకు పలుకుతోంది. దీని రవాణా కోసం స్మగ్లర్లు అమాయకులను పావులుగా వాడుకుంటున్నారు. ముంబైకి చెందిన హేమంగ్ ప్రమోద్ కేలుస్కర్ అనే కింగ్‌పిన్ ఈ భారీ నెట్‌వర్క్ కు మాస్టర్ మైండ్. ఇతని ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఏకంగా 300 మంది కుర్రాళ్లు క్యారియర్లుగా మారి ఈ దందా సాగిస్తున్నారంటే మాఫియా నెట్‌వర్క్ ఎంతలా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. సరుకు వస్తే కోట్లు వస్తాయి.. ఒకవేళ పట్టుబడితే మ్యూల్స్ బలవుతారు. ఇదే కేలుస్కర్ ముఠా మాస్టర్ ప్లాన్.
ఒక్కడే 101 సార్లు ట్రిప్
యూపీకి చెందిన తివారీ అనే యువకుడు ఏకంగా 101 సార్లు బ్యాంకాక్‌కు వెళ్లి వచ్చాడు. ఈ అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా వలలో తెలంగాణ యువత కూడా పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా 14 మంది కుర్రాళ్లు ఈ ఉచ్చులో చిక్కుకోగా, వారి కదలికలపై పక్కా నిఘా పెట్టిన తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు ఇప్పటికే పది మందిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ హైడ్రోపోనిక్ గంజాయి వాడకాన్ని అరికట్టేందుకు డీఆర్ఐ ‘ఆపరేషన్ వీడ్ అవుట్’ పేరిట రంగంలోకి దిగింది. ముంబై, జైపూర్, లక్నో, కోల్‌కతాల్లో ఏకకాలంలో దాడులు చేసి 20 రోజుల్లో వంద కిలోలకు పైగా సరుకును పట్టుకుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కస్టమ్స్ అధికారులు ఏకంగా రూ.700 కోట్ల విలువైన 1005 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని పట్టుకున్నారంటే ఈ సైలెంట్ స్మగ్లింగ్ ఏ స్థాయిలో జరుగుతోందో స్పష్టమవుతోంది.
జీవితకాలం జైలే -సందీప్ శాండిల్య
‘‘విలాసాల మాటేమో కానీ.. ఇలాంటి నేరాలు చేస్తే ఏకంగా జీవితకాలం జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదు. నేరం ఎంత పక్కాగా చేసినా ఏనాటికైనా బయటపడుతుంది. తరచుగా విదేశాలకు వెళ్లేవారి ఫ్రీక్వెంట్ ఫ్లైయర్స్ డేటా, అనుమానాస్పద కదలికలపై గట్టి నిఘా పెట్టిన ఈగల్ ఫోర్స్ తొలుత ఈ అంతర్జాతీయ ముఠా గుట్టును పసిగట్టి కస్టమ్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్సీబీతో కలిసి రెండు నెలల పాటు పక్కా స్కెచ్ వేసి మరీ కేలుస్కర్ ముఠా ఆట కట్టించాయి. ఈజీ మనీ ఆశచూపి ఉచిత విదేశీ ట్రిప్పులు ఆఫర్ చేసే ముఠాలతో అప్రమత్తంగా ఉండాలి’’ అని టీజీ ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు.






