- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వయసు సడలింపు పేరిట మోసం.. ప్రభుత్వంపై TRS చీఫ్ కల్వకుంట్ల కవిత ఫైర్
ఎన్నికల హామీలను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను వంచిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం వంచిస్తోందని తెలంగాణ రాష్ట్ర సేన (TRS) చీఫ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఇవాళ ఆమె సోషల్ మీడియాలో ప్లాట్‌ఫారమ్ ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఓట్లు దండుకున్న కాంగ్రెస్, గద్దెనెక్కిన తర్వాత నోటిఫికేషన్ల జారీని పూర్తిగా విస్మరించిందని ఆమె మండిపడ్డారు.
జీవో నెం.30 అమలులో ప్రభుత్వ వైఫల్యం..
నిరుద్యోగులకు మేలు చేస్తున్నట్లు నమ్మిస్తూ 2024 ఫిబ్రవరి 8వ తేదీన ప్రభుత్వం జీవో 30ని విడుదల చేసిందని, దీని ద్వారా ఉద్యోగ వయో పరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచారని కవిత గుర్తు చేశారు. ఈ సడలింపు రెండేళ్ల పాటు అమలులో ఉంటుందని పేర్కొన్నప్పటికీ, గత రెండున్నరేళ్లుగా ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా నిరుద్యోగుల వయస్సు ఉడిగిపోయేలా చేశారని ఆమె ఆరోపించారు. వయసు సడలింపు గడువు ముగిసిన వెంటనే ప్రభుత్వం తన అసలు రంగు బయటపెట్టిందని విమర్శించారు. వయసు సడలింపు పీరియడ్ ముగియగానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్‌లో అర్హత వయస్సును 18 నుంచి 34 ఏళ్లుగా పేర్కొనడం దుర్మార్గమని కవిత కామెంట్ చేశారు. ఇది నిరుద్యోగులకు ఓ చేత్తో ఇచ్చినట్లే ఇచ్చి మరో చేత్తో లాగేసుకున్న చందంగా ఉందని ప్రభుత్వ నిర్వాకాన్ని ఆమె ఎండగట్టారు.
ఆ నోటిఫికేషన్ రద్దు చేయాల్సిందే..
తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన నిరుద్యోగుల జీవితాలను అగం చేస్తే ఊరుకునేది లేదని కవిత హెచ్చరించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏప్రిల్ 20న జారీ చేసిన 01/OG/PC/2026 నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఎలాంటి పరిమితులు లేకుండా జీవో 30ని అమలు చేయాలని, లేని పక్షంలో నిరుద్యోగుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆమె ప్రభుత్వాన్ని కవిత హెచ్చరించారు.






