చెరువు బఫర్ జోన్‌లో ఫ్లాట్ల పంట.. హైడ్రా చర్యలెక్కడా..?

by Bhanu |

ఓ పక్క చెరువులను సంరక్షించేందుకు హైడ్రా నిరంతరంగా కృషి చేస్తుంటే మరోపక్క చెరువులలో అక్రమంగా భవన నిర్మాణాలు వెలుస్తూనే ఉన్నాయి.

చెరువు బఫర్ జోన్‌లో ఫ్లాట్ల పంట.. హైడ్రా చర్యలెక్కడా..?
X

దిశ, పేట్ బషీరాబాద్: ఓ పక్క చెరువులను సంరక్షించేందుకు హైడ్రా నిరంతరంగా కృషి చేస్తుంటే మరోపక్క చెరువులలో అక్రమంగా భవన నిర్మాణాలు వెలుస్తూనే ఉన్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ గండి మైసమ్మ మండలం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో విస్తరించుకున్న ఫాక్స్ సాగర్ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతం లో శ్రీ షిరిడి సాయి బిల్డర్స్ నిర్మాణ సంస్థ భారీ అపార్ట్మెంట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తుంది.

పూర్తిగా ఎఫ్డిఎల్.. బఫర్ జోన్ ప్రాంతంలో…

కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామం, దుండిగల్ గండి మైసమ్మ మండలం దూలపల్లి గ్రామం , కొంపల్లి గ్రామం రెవెన్యూ పరిధిలో 462 ఎకరాల కు పైగా భూమిలో ఫాక్స్ సాగర్ చెరువు విస్తరించి ఉన్నది. ఈ చెరువు ఎఫ్బిఎల్, బఫర్ జోన్ ప్రాంతాలను 2013 లో సర్వే చేసి గుర్తించారు. దీని ప్రకారం శ్రీ షిరిడి సాయి బిల్డర్స్ నిర్మాణ సంస్థ సర్వేనెంబర్151, 179/సి లను పేర్కొంటూ అపార్ట్మెంట్ భవన నిర్మాణానికి అనుమతి తీసుకోంది. అయితే ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న అపార్ట్మెంట్ ప్రాంతం చెరువు ఎస్ టి ఎల్, బఫర్ జోన్ ప్రాంతంలోనే వస్తుంది. చెరువు కోఆర్డినేట్స్ ఏ 61 నుంచి ఏ 64 వరకు ఉన్న ప్రాంతంలోని ఈ నిర్మాణం జరుగుతున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది.

అనుమతులు ఎలా వచ్చాయి..?

2013 లోని చెరువు యొక్క ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ ప్రాంతాలను సర్వే చేసి హద్దులను గుర్తించారు. అయితే శ్రీ షిరిడి సాయి బిల్డర్స్ నిర్మాణ సంస్థకు చెరువు భూములలో అపార్ట్మెంట్ నిర్మాణం చేయడానికి అనుమతులు ఎలా వచ్చాయి అనేది ఇక్కడి ప్రశ్న. చెరువు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీరు ఈ అపార్ట్మెంట్ ప్రాంతం వద్దనున్న దూలపల్లి ప్రధాన రోడ్డులో నాలా నుంచి చెరువులోకి కలుస్తుంది. గతంలో అనేకమార్లు ఈ చెరువు వరదలతో అనేక కాలనీలు బస్తీలు నీట మునిగిన సంఘటనలు అనేకం ఉన్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఉన్న చెరువు భూమిలో కట్టిన అపార్ట్మెంట్స్, నివాస గృహాలకు వరద ముప్పు తప్పదనేది తెలుస్తుంది. సత్వరమే ఈ విషయంపై హైడ్రా స్పందించి కొత్తగా నిర్మాణం జరుగుతున్న అపార్ట్మెంట్, నివాస గృహాల నిర్మాణాలను ఆపేయాలని కోరుతున్నారు అక్కడివారు.

Next Story