వరల్డ్ క్లాస్ ప్రమాణాలతో ‘ఫోర్త్ సిటీ’.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-02 06:25:17  IST  )

విద్య మీద పెట్టే ఖర్చు భవిష్యత్తుకు పెట్టుబడి లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

వరల్డ్ క్లాస్ ప్రమాణాలతో ‘ఫోర్త్ సిటీ’.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: విద్య మీద పెట్టే ఖర్చు భవిష్యత్తుకు పెట్టుబడి లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన సీఎం అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలోని క్రీడాకారులను ప్రోత్సహించడానికే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. విద్య మీద పెట్టే ఖర్చు.. భవిష్యత్తుకు పెట్టుబడి లాంటిదని తెలిపారు. పేద ఆరోగ్యం తమ ప్రభుత్వం బాధ్యత అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌళికర వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. రూ.2,700 కోట్లు అత్యాధునిక సదుపాయాలతో కొత్తగా ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తున్నామని తెలిపారు.

కులగణన చేసిన దేశానికి ఆదర్శంగా నిలిచాం..

దేశంలో వందేళ్ల క్రితం కులగణన జరిగిందని.. మళ్లీ వందేళ్ల తరువాత తొలిసారిగా తెలంగాణలో కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 56 శాతంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని.. కులగణనకు ఇన్‌స్పిరేషన్ తెలంగాణే అని సీఎం తెలిపారు.

పెట్టుబడులకు ఫ్యూచర్ సిటీ కేంద్ర బిందువు

ప్రపంచంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు.. అన్ని రంగాల్లో పోటీపడేలా పక్కాగా పాలసీ డాక్యుమెంట్‌ తీసుకొస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ నదికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టబోతున్నామని పేర్కొన్నారు. న్యూయార్క్, టోక్యోలతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామని తెలిపారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఫోర్ట్ సిటీ ఉండబోతోందని.. ప్రపంచ స్థాయి పెట్టుబడులకు అదే ఫ్యూచర్ సిటీ కేంద్ర బిందువుగా మారబోతోందని అన్నారు. దేశ, విదేశాలు తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చామని.. హైదరాబాద్‌ను మరింత తీర్చిదిద్దేందుకు జపాన్ సహకరిస్తుందని పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ మహానగరంగా ఆవిర్భవించిన విషయం అందరికీ తెలుసని అన్నారు. రీజినల్ రింగ్ రోడ్డుతో రాష్ట్ర రూపు రేఖలే మారబోతున్నాయని జోస్యం చెప్పారు. మెట్రో విస్తరించకపోవడం వల్లే హైదరాబాద్ టాప్ సిటీల్లో 9వ స్థానానికి పడిపోయిందని అన్నారు. త్వరలోనే మెట్రోను విస్తరించి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణ పోలీస్ నెంబర్‌వన్..

ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే, దేశంలో నెంబర్‌వన్ పోలీస్ వ్యవస్థగా తెలంగాణ అవతరించిందని ఆయన తెలిపారు. యువతను కుంగదీస్తున్న డ్రగ్స్‌ను నియంత్రించడంలో తెలంగాణ పోలీసులకు అవార్డు వచ్చిందని గుర్తు చేశారు. గంజాయి మాఫియా రాష్ట్రంలో అడుగు పెట్టాలంటేనే వారిలో వెన్నులో వణుకు పుడుతోందని అన్నారు. సుందరీమణుల అందాల పోటీలు మాత్రమే కాదు.. 108 దేశాలకు చెందిన ప్రతినిధులు అందాల పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. అందాల పోటీలతో తెలంగాణ బ్రాండ్‌ ప్రపంచానికి పరిచయం చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Next Story