పీఎం ధన్-ధాన్య కృషి యోజన పథకంలో తెలంగాణ నాలుగు జిల్లాలు

by Malleboina Mahesh |

రాష్ట్రంలోని నారాయణపేట, గద్వాల, జనగామ, నాగర్ కర్నూల్ జిల్లాలను ప్రధాన్ మంత్రి ధన్-ధాన్య కృషి యోజన (పీఎండిడికేవై ) పథకంలో కేంద్రం చేర్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

పీఎం ధన్-ధాన్య కృషి యోజన పథకంలో తెలంగాణ నాలుగు జిల్లాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని నారాయణపేట, గద్వాల, జనగామ, నాగర్ కర్నూల్ జిల్లాలను ప్రధాన్ మంత్రి ధన్-ధాన్య కృషి యోజన (పీఎండిడికేవై ) పథకంలో కేంద్రం చేర్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిసి తెలంగాణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఙతలు తెలిపారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఉత్పాదకత పెంపు, పంటల మార్పిడి, నీటిపారుదల, నిల్వ, ఉత్పత్తుల విలువ పెంచేవిధంగా ప్రాసెసింగ్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఒక చారిత్రాత్మక మార్పు తెచ్చే పథకమని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి ఎంపికైన నాలుగు జిల్లాలకు రూ.960 కోట్ల వార్షిక వ్యయం తో ఆరేళ్ల పాటు అమలు చేయబోతుందన్నారు. ఈ యోజన 36 కేంద్ర పథకాల సమన్వయంతో పాటు రాష్ట్ర పథకాలతో అనుసంధానం అవుతూ, ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని వినియోగించుకోవడం ద్వారా తక్కువ ఉత్పాదకత చూపుతున్న జిల్లాలలోని రైతులకు విస్తృతంగా లాభం చేకూరుస్తుందన్నారు.

ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన అమలు విధానం

దేశంలోని వెనుకబడిన వ్యవసాయ జిల్లాల్లో ఉత్పాదకత, మౌలిక సదుపాయాలు రైతుల ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో ప్రకటించింది.ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 100 వ్యవసాయ జిల్లాలు గుర్తించబడ్డాయి. ఈ జిల్లాల్లో పంట ఉత్పాదకత తక్కువగా ఉండటం, ఏడాదిలో ఒకే పంట సాగు, రుణాల అందుబాటు సగటు కంటే తక్కువగా ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎంపిక జరిగింది.

పథకం ప్రధాన లక్ష్యాలు..

వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించడం, సుస్థిర వ్యవసాయ పద్ధతులను విస్తరించడం, పంచాయతీ, బ్లాక్ స్థాయిలో పంట కోత అనంతరం నిల్వ సదుపాయాలను బలోపేతం చేయడం, మైక్రో ఇరిగేషన్ వంటి నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా సేద్యాన్ని మెరుగుపరచడం, తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యవసాయ రుణాలను సులభతరం చేయడం

36 కేంద్ర , రాష్ట్ర పథకాల సమన్వయం..

ఈ పథకం కింద 11 మంత్రిత్వ శాఖలు, విభాగాల కింద అమలులో ఉన్న 36 పథకాలను ఏకీకృతంగా సమన్వయం చేస్తారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్, మిషన్ ఆన్ ఆయిల్‌సీడ్స్ , ఆయిల్ పామ్, హార్టికల్చర్ మిషన్, పీఎం ఎస్కేవై, పీఎం ఎఫ్ఎంఈ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కూడా ఈ జిల్లాలో కలపాలని కోరడం జరిగింది. తద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది.

అమలు విధానం..

జిల్లా స్థాయిలో, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన “జిల్లా ధన్–ధాన్య కృషి సమితి ఏర్పాటవుతుంది. ఈ కమిటీ జిల్లా స్థాయి వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రణాళికను సిద్ధం చేసి, అమలును పర్యవేక్షిస్తుంది. రాష్ట్ర స్థాయిలో, ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర ధన్–ధాన్య సమితి ఏర్పాటవుతుంది. జాతీయ స్థాయిలో మంత్రి, కార్యదర్శి స్థాయి కమిటీలు పథకాన్ని పర్యవేక్షిస్తాయి. జిల్లా స్థాయిలో బేస్‌లైన్ సర్వే నిర్వహించి ఉత్పాదకత లోపాలు, నీటి వనరులు, మార్కెట్ మౌలిక సదుపాయాలు, కోల్డ్‌స్టోరేజ్, రుణాల పరిస్థితి మొదలైన అంశాలను విశ్లేషణ చేసి వాటి ఆధారంగా 5 సంవత్సరాల ఫలితాల ఆధారిత కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయబడుతుంది.

Next Story