సిటీ ట్రైనింగ్ సెంటర్‌కు శంకుస్థాపన.. భరోసా, కమాండ్ కంట్రోల్ సెంటర్‌లను ప్రారంభించిన డీజీపీ

by Ramesh Naini |

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లిలో నిర్మించనున్న సిటీ ట్రైనింగ్ సెంటర్ (సీటీసీ)కు డీజీపీ బి.శివధర్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు.

సిటీ ట్రైనింగ్ సెంటర్‌కు శంకుస్థాపన.. భరోసా, కమాండ్ కంట్రోల్ సెంటర్‌లను ప్రారంభించిన డీజీపీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: (Rachakonda Police Commissionerate) రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లిలో నిర్మించనున్న సిటీ ట్రైనింగ్ సెంటర్ (సీటీసీ)కు డీజీపీ బి.శివధర్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. కమిషనరేట్ పరిధిలోని సరూర్ నగర్‌లో భరోసా సెంటర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ నూతన భవనాలకు ప్రారంభోత్సవం చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు ఆధ్వర్యంలో మేడిపల్లిలో సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ.. దివీస్ లేబరేటరీస్ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులతో సిటీ ట్రైనింగ్ సెంటర్ ను నిర్మించడానికి ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో పోలీస్ సిబ్బంది పిల్లలతో పాటు సాధారణ ప్రజలకు కూడా 50% సీట్లను కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిపారు. సైబర్ క్రైమ్ నేరాలను అరికట్టేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను బలోపేతం చేసి, వారికి అవసరమైన సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు.

రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు "అర్రైవ్, అలైవ్ " పేరుతో డిసెంబర్ లో వాహనదారులకు, డ్రైవర్లకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నామని తెలిపారు. రాచకొండ కమిషనరేట్ నూతన భవనం కోసం దాదాపు 50 ఎకరాలకు పైగా భూమిని ప్రభుత్వం కేటాయించేందుకు మాజీ శాసనసభ్యులు ఎం .సుధీర్ రెడ్డి కృషి చేసినందుకు ఆయనకు డీజీపీ కృతజ్ఞతలు తెలియజేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ.. మేడిపల్లిలో సిటీ ట్రైనింగ్ సెంటర్‌లో పోలీస్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను అందించేందుకు సీటీసీ ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దివీస్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ డి.మధుబాబు, సంస్థ జీఎం సుబ్బారావులు మాట్లాడారు. పోలీస్ శాఖకు అవసరమైన సహాయం చేసేందుకు సీఎస్ఆర్ పథకంతో సంబంధం లేకుండా చేయూత అందిస్తామని వెల్లడించారు.

మహిళల భద్రత కోసమే భరోసా కేంద్రాల ఏర్పాటు

మహిళల భద్రత కోసం భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి తెలిపారు. రాచకొండ పరిధిలోని సరూర్ నగర్ ప్రాంతంలో నిర్మించిన భరోసా కేంద్రాన్ని డీజీపీ ప్రారంభించారు. మహిళా బాధితులకు పూర్తి రక్షణ కల్పించడంతోపాటు, చట్టం ప్రకారం అన్ని రకాల కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడతాయని సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలు భరోసా కేంద్రాలను సంప్రదించవచ్చన్నారు. తెలంగాణ పోలీస్ హౌసింగ్ ఇన్ఫ్రాటెక్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్ప్ లిమిటెడ్ ఎం.డీ ఎం రమేష్ , రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ టి .ఉషారాణి పాల్గొన్నారు.

అందెశ్రీకి నివాళి అర్పించిన డీజీపీ

ప్రముఖ కవి దివంగత అందెశ్రీ భౌతికకాయాన్ని లాలాగూడ ప్రాంతంలోని జిహెచ్ఎంసి మైదానంలో డీజీపీ శివధర్ రెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి సానుభూతిని తెలిపారు. అందెశ్రీ రచించిన గేయం తెలంగాణ పాడుకొనే జాతి గీతంగా అందరి హృదయాలలో నిలిచిపోయిందని, తెలంగాణ ఉద్యమ గేయాలలో ప్రముఖ స్థానం వహించిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Next Story