గురుకులాల్లో ఫౌండేషన్ కోర్సులు.. ఈ విద్యా సంవత్సరం నుంచే షురూ

by Kema Shiva Kumar |

తెలంగాణలోని గురుకులాల పనితీరు ఇకపై మెరుగుపడనుంది.

గురుకులాల్లో ఫౌండేషన్ కోర్సులు.. ఈ విద్యా సంవత్సరం నుంచే షురూ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని గురుకులాల పనితీరు ఇకపై మెరుగుపడనుంది. సాంఘీక సంక్షేమ గురుకులాల్లో చదివే పిల్లల భవిష్యత్ మారిపోనుంది. పేద, అణగారిన వర్గాల విద్యార్థులు అత్యున్నత శిఖరాలకు చేరేలా సోసైటీ కార్యాచరణ సిద్ధం చేస్తుంది. టీజీఎస్.డబ్ల్యూఆర్ఈఐఎస్ గురుకులంలో చదువుతన్న విద్యార్థులు 8వ తరగతి నుండే ఫౌండేషన్ కోర్సులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రైవేటు కోచింగ్​సెంటర్లకు ధీటుగా ఐఐటీ, నీట్, యూపీఎస్సీ ప్రవేశ పరీక్షలకు స్టూడెంట్స్​సన్నద్ధం చేసేందుకు టీజీఎస్.డబ్ల్యూఆర్ఈఐఎస్ యంత్రాంగం రెడీ అయిపోయింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు చర్యలు కూడా చేపట్టింది.

10 కాలేజీల్లోనూ ఫౌండేషన్ కోర్సులు..

టీజీఎస్.డబ్ల్యూఆర్ఈఐఎస్ ఆధ్వర్యంలో నడుపబడుతున్న హైదరాబాద్ లోని గౌలిదొడ్డి, కరీంనగర్ జిల్లాలో సీఓఈ ఇంటర్ కళాశాలలో అడ్మిషన్ లభించాలంటే ఒక అదృష్టం ఉండాలని తెలంగాణలోని లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రుల నోట పలికే మాటలు. ఈ రెండు కళాశాలలో రెండు సంవత్సరాల కాల పరిమితిలోనే ఇంటర్ విద్యార్థినీ, విద్యార్థులు అకాడమిక్ సిలబస్ తోపాటు ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కళాశాలలు అలాగే ఎంబీబీఎస్​కోర్సులో చేరేందుకు దేశవ్యాప్తంగా నిర్వహించే ఐఐటీ, జేఈఈ తోపాటు నీట్​లాంటి ప్రవేశ పరీక్షలో అధిక సంఖ్యలో ర్యాంకులు సాధించడం జరుగుతోంది. పదవ తరగతి అనంతరం ఈ రెండు కళాశాలలో సీట్లు లభించకపోతే విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఇతర కళాశాలలో అడ్మిషన్ కు అంతగా ఆసక్తి చూపరు. గౌలిదొడ్డి, కరీంనగర్ సీఓఈ విద్యా సంస్థల మాదిరిగా రాష్ట్రంలోని 10 కళాశాలలను ఇదే తరహాలో తీర్చిదిద్దాలని గురుకుల సోసైటీ నిర్ణయించింది.

అణగారిన వర్గాల స్టూడెంట్స్ భవిష్యత్తుకు

ముఖ్యంగా అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థుల బంగారు భవిష్యతుకు, వారు అత్యున్నత శిఖరాలకు చేరేలా ఒక నూతనమైన కార్యాచరణ రూపొందించిన టీజీఎస్.డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి డా. వి.ఎస్. అలుగు వర్షిణి ఈ ఫౌండేషన్ కోర్సుకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో విద్యారులు ఇప్పుడు కేవలం ఇంటర్ విద్యను అభ్యసిస్తూ ఈ రెండు కళాశాలలో.. అనగా గౌలిదొడ్డి, కరీంనగర్ సీఓఈ విద్యాసంస్థల నుండి మంచి ర్యాంకులు సాధిస్తున్న నేపథ్యంలో మరో 10 కళాశాలలో 8వ తరగతి నుండే ఫౌండేషన్ కోర్సులను.. అనగా ఇప్పుడు రెగ్యులర్ గా అందిస్తున్న నీట్, ఐఐటీ, జేఈఈ, క్లాట్, క్యూఏట్, యూపీఎస్సీ వంటి కీలకమైన పోటీ, ప్రవేశ పరీక్షల్లో అత్యధిక స్కోర్ చేయడంతో పాటు మన గురుకుల విద్యార్థులు మరిన్ని ర్యాంకులు, మంచి సీట్లు సాధించేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ ఫౌండేషన్ కోర్సును అమలు చేసేలా పలువురు విద్యారంగ నిపుణులు సూచించడం, పలు దఫాలుగా గురుకుల కళాశాలల అధ్యాపకులు, అలాగే హైస్కూల్ స్థాయి విద్యార్థుల తల్లిదండ్రులు అమూల్యమైన సూచనలు చేశారు. వీటన్నింటిని క్రోడీకరించి టీజీఎస్.డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ అంశంపై పలు దఫాలు చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

మెరిట్ ఆధారిత విద్యార్థులకు శిక్షణ..

8వ తరగతి నుండే నీట్, ఐఐటీ జేఈఈ, క్లాట్, క్యూఏట్, యూపీఎస్సీ వంటి కీలకమైన పోటీ, ప్రవేశ పరీక్ష ల్లో ఈ తరహా ఫౌండేషన్ కోర్సులో నిష్ణాతులైన అధ్యాపకులతో శిక్షణ ఇప్పించేందుకు గురుకుల కార్యదర్శి ప్రత్యేక దృష్టిసారించారు. ఈ కోర్సులను పటిష్టంగా, పకడ్బందీగా అమలు చేసేలా ఒక కార్యాచరణ ప్రణాళికను సైతం రూపొందించడం జరిగింది. సాంఘిక సంక్షేమ గురుకులలో ప్రస్తుతం చదివే విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం 2025-26 (8వ తరగతిలో చేరే వారు) ఈ ఫౌండేషన్ కోర్సుపై ఆసక్తి ఉన్న విద్యార్థినీ, విద్యార్థులకు ఒక ప్రవేశ పరీక్షను నిర్వహించి అధిక మార్కులు సాధించిన మెరిట్ ఆధారిత విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సులో చేరేందుకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు.

గురుకుల చరిత్రలోనే గేమ్ ఛేంజర్.. ​

ఈ ఫౌండేషన్ కోర్సు అమలుకు మైక్రో షెడ్యూల్, వీకెండ్ టెస్ట్, వ్యక్తిగత కౌన్సిలింగ్, నీట్, ఐఐటీ, జేఈఈతో పాటు, క్లాట్, క్యూఏట్, యూపీఎస్సీ పోటీ పరీక్షల్లో అత్యున్నత నైపుణ్యం, నిష్ణాతులైన టీచింగ్ అనుభవం ఉన్నా అధ్యాపకులతో విద్యార్థులకు ఈ ఫౌండేషన్ కోర్స్ ద్వారా శిక్షణ ఇచ్చేలా ప్లాన్ రూపొందించారు. ఇది గురుకుల సొసైటీ ఏర్పడిన నాటి నుండి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఒక మైలు రాయిగా నిలువనుంది. అలాగే, ఇదీ గురుకుల చరిత్రలో ఓ గేమ్ ఛేంజర్​గా మారనుంది. ఈ శిక్షణ ద్వారా గ్రామీణ ప్రాంతాల నుండి నిరుపేద, కుటుంబాలకు చెందిన దళిత, బడుగు బలహీన వర్గాలతో పాటు ముఖ్యంగా అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఇలాంటి శిక్షణ ఇవ్వడం వల్ల అత్యున్నత శిఖరాలను అధిరోహించేందుకు దోహదపడుతుందని కార్యదర్శి డా. వి.ఎస్. అలుగు వర్షిణి విశ్వాసం వ్యక్తం చేశారు.

Next Story