‘మళ్లీ చెప్తున్నా.. ఇది పక్కా లొట్టపీసు కేసే’: ఫార్ములా-ఈ ఛార్జ్‌షీట్‌పై కేటీఆర్ ఫైర్

by Gantepaka Srikanth |

తనపై ఫార్ములా-ఈ రేస్ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

‘మళ్లీ చెప్తున్నా.. ఇది పక్కా లొట్టపీసు కేసే’: ఫార్ములా-ఈ ఛార్జ్‌షీట్‌పై కేటీఆర్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: తనపై ఫార్ములా-ఈ రేస్ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ‘చిట్ చాట్’లో ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ కేసు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యేనని, ఇందులో అంగుళం కూడా నిజం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైందని, దీనిపై తాము అసెంబ్లీలో ‘ప్రైవేట్ మెంబర్ బిల్లు’ ప్రవేశపెడుతున్నామని కేటీఆర్ తెలిపారు. "మేము గ్యారెంటీలపై బిల్లు పెడుతుండటంతో, ప్రజల దృష్టిని మళ్లించేందుకే హడావుడిగా నాపై ఛార్జ్‌షీట్ వేశారు. ఇది ముమ్మాటికీ అక్రమ కేసు," అని ఆయన మండిపడ్డారు. ఈ కేసులో అధికారులను ఇబ్బంది పెట్టడం సరికాదని కేటీఆర్ హితవు పలికారు. "మీకు నాపై కక్ష ఉంటే నేరుగా నాపై తీర్చుకోండి. నిర్ణయం తీసుకున్నది నేను, కాబట్టి ఏ చర్యలైనా నాపైనే ఉండాలి. అనవసరంగా అధికారులను బలి చేయడం కరెక్ట్ కాదు," అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

డబ్బులు ఎక్కడికి వెళ్లాయో అందరికీ తెలుసు..

ఫార్ములా-ఈ నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలను కేటీఆర్ కొట్టిపారేశారు. "ఒక్క రూపాయి కూడా దారి మళ్లలేదు. డబ్బులు నేరుగా కంపెనీకి వెళ్లాయి, అది అందరికీ కనిపిస్తోంది. క్విడ్ ప్రో కో జరిగిందని చెబుతున్నారు కదా.. మరి గ్రీన్ కో కంపెనీపై ఎందుకు కేసు పెట్టలేదు? మీడియానే దీనిపై ఆలోచించాలి. హైదరాబాద్ ఇమేజ్ పెంచేందుకు, పెట్టుబడులు ఆకర్షించేందుకే ఈ రేస్ నిర్వహించాం. దీని వల్ల రాష్ట్రానికి ప్రయోజనం కలిగింది అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

అందాల పోటీలకు 200 కోట్లు ఎందుకు..?

ప్రస్తుత ప్రభుత్వంపై కూడా కేటీఆర్ ఎదురుదాడి చేశారు. "ప్రభుత్వం అందాల పోటీల కోసం 200 కోట్లు ఖర్చు చేసింది. దీనివల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం చేకూరింది? ఒక మహిళా ప్రతినిధి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసినా ఎందుకు స్పందించడం లేదు?" అని ప్రశ్నించారు. మొదటి నుంచి చెబుతున్నా.. ఇది 100% లొట్టపీసు కేసు. లేని కేసును ఉన్నట్లుగా మసిబూసి మారేడు కాయ చేస్తున్నారు. న్యాయపరంగా దీనిని ఎదుర్కొంటాం," అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Next Story