Formula E-Race Case: నత్తనడకన ఫార్ములా ఈ-రేసు కేసు విచారణ..

by Kema Shiva Kumar |

ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ మందకొడిగా సాగుతున్నది.

Formula E-Race Case: నత్తనడకన ఫార్ములా ఈ-రేసు కేసు విచారణ..
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ మందకొడిగా సాగుతున్నది. ఎఫ్ఐఆర్ నమోదై 50 రోజులు గడుస్తున్నా అనుకున్న స్థాయిలో పురోగతి కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఏసీబీ అధికారులు ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ఎన్ రెడ్డి, ఎస్ నెక్స్ట్ జెన్ డైరెక్టర్లను విచారించారు. అనంతరం ఎఫ్ఈవో సంస్థ ప్రతినిధులకు నోటీసులు జారీ చేయగా.. ఆ తర్వాత కేసు విచారణ ముందుకు సాగడం లేదు. ఏసీబీ అధికారుల తీరు వల్లే కేసు విచారణ మందకోడిగా సాగుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నలుగురిని విచారించిన ఏసీబీ

ఫార్ములా ఈరేస్ వ్యవహారంలో ఏసీబీ అధికారులు డిసెంబర్ 19న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే అదే రోజు ఈ కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ హై కోర్టును ఆశ్రయించారు. పలు వాయిదాల్లో విచారణ జరిపిన హై కోర్టు జనవరి ఏడో తేదీన ఆ పిటిషన్ ను కొట్టివేసింది. అప్పటి వరకు ఏసీబీ అధికారులు ఎవరినీ విచారించలేదు. ఆ తర్వాత దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని హై కోర్టు ప్రశ్నించిన తర్వాతే ఏసీబీ అధికారుల్లో కదలిక వచ్చింది. విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలకు నోటీసులు అందజేశారు. జనవరి 8, 9, 10 తేదీల్లో ముగ్గురిని విచారించారు. ఆ తర్వాత జనవరి 18న ఎస్ నెక్స్ట్ జెన్ సంస్థ డైరెక్టర్ ను విచారించారు. ఎఫ్ఐఆర్ నమోదై 50 రోజులు, ప్రాథమిక విచారణ పూర్తి చేసి దాదాపు నెల రోజులు గడుస్తున్నా.. కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కేసులో దూకుడుగా వ్యవహరించాల్సిన ఏసీబీ.. నత్తనడకన విచారణ కొనసాగించడంపై విమర్శలు వస్తున్నాయి.

ఎఫ్ఈవో సంస్థ విచారణపై రాని స్పష్టత

ఈ-రేస్ నిర్వహణకు యూకేకు చెందిన ఫార్ములా ఈ కార్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఈవో) సంస్థకు హెచ్ఎండీఏ ద్వారా రూ. 46 కోట్లు చెల్లించారు. అయితే ఫార్ములా ఈ రేస్ పై కేసు నమోదు చేసిన ఏసీబీ ఈ సంస్థకు నోటీసులు జారీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆలస్యం చేసిందనే విమర్శలు వస్తున్నాయి. విచారణకు హాజరు కావాలని జనవరి 25న యూకేకు చెందిన ఎఫ్ఈవో సంస్థ సీఈవోకు ఏసీబీ అధికారులు నోటీసులను మెయిల్ చేశారు. దీనిపై స్పందించిన సంస్థ సీఈవో యూకే నుంచి రావాలంటే సమయం పడుతుందని, నాలుగు వారాల టైమ్ ఇవ్వాలని అదే రోజు మెయిల్ ద్వారా ఏసీబీ అధికారులను కోరారు. ఎఫ్ఈవో సీఈవో స్టేట్మెంట్ రికార్డ్ చేస్తేనే కేసు దర్యాప్తు ముందుకు సాగుతుందని అధికారులు చెబుతున్నారు.

అయితే, ఎఫ్ఈవో సంస్థ ప్రతినిధులు విచారణకు ఎప్పుడు హాజరవుతారో స్పష్టత లేకుండా పోయింది. వారు అడిగిన నాలుగు వారాల్లోని రెండు వారాల సమయం ఇప్పటికే గడిచిపోయింది. అయితే నాలుగువారాల్లోగా వారు విచారణకు హాజరవుతారా అనే అంశంపై కూడా ఏసీబీ అధికారుల వద్ద స్పష్టత లేకుండాపోయింది. విచారణ కోసం ముందుగానే ఎఫ్ఈవో సంస్థకు నోటీసులు జారీ చేయాలనే అంశాన్ని ఏసీబీ అధికారులు విస్మరించారనే విమర్శలు వస్తున్నాయి. మొదట్లోనే నోటీసులు అందజేస్తే కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిల విచారణ పూర్తి కాగానే, ఎఫ్ఈవో సంస్థ విచారణ పూర్తయి కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చి ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

Next Story