ఫార్ములా ఈ-కార్ రేసు.. ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చేనా?

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-09-14 03:13:54  IST  )

ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ప్రాసిక్యూషన్ కోసం అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ నుంచి వెళ్లిన ఫైల్‌ను గవర్నర్ లీగల్ ఒపీనియన్‌కు పంపించినట్లు తెలుస్తున్నది.

ఫార్ములా ఈ-కార్ రేసు.. ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ప్రాసిక్యూషన్ కోసం అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ నుంచి వెళ్లిన ఫైల్‌ను గవర్నర్ లీగల్ ఒపీనియన్‌కు పంపించినట్లు తెలుస్తున్నది. న్యాయ సలహా మేరకు ప్రాసిక్యూషన్‌కు పర్మిషన్ ఇవ్వడమా? లేదా? అనే క్లారిటీ వస్తుందని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో క్విడ్ ప్రోకో జరిగిందని ఏసీబీ నిర్ణయానికి వచ్చింది. ఆ మేరకు పూర్తి ఆధారాలను సేకరించిన ఏసీబీ ప్రాసిక్యూషన్ కోసం అనుమతి ఇవ్వాలంటూ రాసిన లేఖను గవర్నర్ అనుమతి కోసం పంపిన విషయం తెలిసిందే. అయితే మంత్రులు తీసుకున్న విధానపరమైన నిర్ణయాల్లో అక్రమాలు జరిగితే, విచారణ కోసం గవర్నర్ అనుమతి తీసుకోవాలి. అందుకే ఈ కేసులో కేటీఆర్‌ను విచారించే ముందు గవర్నర్ నుంచి పర్మిషన్ తీసుకున్న తరువాతే ఏసీబీ, ఆయన్ను రెండుసార్లు విచారించింది. ఇప్పుడు ప్రాసిక్యూషన్ కోసం కూడా రాజ్ భవన్ అనుమతి తీసుకోవాలి.

రాజ్ భవన్‌కు క్విడ్ ప్రోకో ఆధారాలు

ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో క్విడ్ ప్రోకో జరిగిందని భావిస్తున్న ఏసీబీ అందుకు కావాల్సిన ఆధారాలను సేకరించింది. హెచ్ఎండీఏ అకౌంట్ నుంచి రేసు నిర్వహణ కంపెనీకి రూ.46 కోట్లు చెల్లించింది. అయితే కొన్ని రోజుల తరువాత అదే కంపెనీ బీఆర్ఎస్ పార్టీ దగ్గర రూ.44కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ కొన్నట్లు ఏసీబీ గుర్తించినట్లు తెలుస్తున్నది. ఈ ఆధారాలను అన్నింటినీ గవర్నర్‌కు పంపించినట్లు సమాచారం. ఈ కేసులో ఏ-1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ-3గా హెచ్ఎండీఏ అధికారి బీఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. కేటీఆర్ ఆదేశాలనే తాము పాటించామని, ఆయన అదేశాల మేరకు రేసు నిర్వహణ సంస్థకు రూ.46 కోట్లు రిలీజ్ చేశామని విచారణ సమయంలో ఏ2, ఏ3 స్టేట్‌మెంట్ ఇచ్చారు. ప్రాసిక్యూషన్‌కు కావాల్సిన ఆధారాలను సేకరించామని, వాటిని పరిశీలించిన తర్వాత ప్రాసిక్యూషన్ చేసేందుకు గవర్నర్ నుంచి అనుమతి వస్తుందనే దీమాలో ఏసీబీ అధికారులు ఉన్నారు. రెండు మూడు రోజుల్లో రాజ్ భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందని, వెంటనే కోర్టులో చార్జిషీట్ వేస్తామని ఏసీబీలోని సీనియర్ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.

Next Story