తెలంగాణ రాజకీయాల్లో సంచలనం: కవిత పెట్టబోయే పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే!

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-19 12:01:37  IST  )

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కల్వకుంట్ల కవితతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు.

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం: కవిత పెట్టబోయే పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కల్వకుంట్ల కవితతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని జాగృతి కార్యాలయంలో కవితను కలిసిన ఆయన, అధికారికంగా తెలంగాణ జాగృతిలో చేరారు. త్వరలో కవిత స్థాపించబోయే కొత్త పార్టీలో కీలక పాత్ర పోషించేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాథోడ్ బాపూరావుతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. రాథోడ్ బాపూరావు తన ఉద్యోగాన్ని వదులుకుని మరీ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. జాగృతి ద్వారానే ఆయన గతంలో బీఆర్ఎస్‌లో చేరారు అని కవిత పేర్కొన్నారు. 2006లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తమ కుటుంబం వారం రోజుల పాటు ఉండి హెల్త్ క్యాంపు నిర్వహించిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణలోని ఉద్యమకారులందరూ ఇప్పుడు కొత్త పార్టీ వైపు చూస్తున్నారు. అనేక జిల్లాల నుండి నేతలు, కార్యకర్తలు మాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మా కొత్త పార్టీకి విశేష ఆదరణ లభిస్తుందని కవిత స్పష్టం చేశారు.

కవిత పిలుపు..

తెలంగాణ అభివృద్ధి కోసం ఉద్యమకారులందరూ ఏకం కావాలని కవిత పిలుపునిచ్చారు. ఏ స్పిరిట్‌తో అయితే తెలంగాణ ఉద్యమంలో పని చేశామో, అదే స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధి కోసం పునరంకితం కావాలని కోరారు. బూర్జువా పార్టీలను వదిలి కొత్త పార్టీలోకి రావాలని ఆమె ఉద్యమకారులను కోరారు. ఇదే వేదికపై సిరిసిల్ల నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన నేతలకు ఆమె సాదరంగా ఆహ్వానం పలికారు. రాథోడ్ బాపూరావు వంటి సీనియర్ నేత తోడవడంతో కవిత రాజకీయ భవిష్యత్ వ్యూహాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

జనగణనలో ఆదివాసీ మతం కాలమ్ పెట్టాలి: కవిత

Next Story