- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనగణనలో ఆదివాసీ మతం కాలమ్ పెట్టాలి: కవిత
ఆదివాసీల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల హక్కులను హరిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. పెసా (PESA) చట్టానికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూల్లోని రక్షణలను తొలగిస్తోందని ధ్వజమెత్తారు. జనగణనలో మతం కేటగిరిలో ఆదివాసీ అనే కాలమ్ పెట్టలేదని దీంతో ఆదివాసీలు తాము ఆదివాసీలమని సగర్వంగా చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఇది దేశ మూలవాసులైన ఆదివాసీల సంస్కృతిని అవమానించడమేనని జనగణనలో తమది ఆదివాసీ మతం అని చెప్పుకునేలా ప్రత్యేక కాలమ్ పెట్టడంతో పాటు ఆదివాసీల భాష ‘కోయతూర్’ ను భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ చేర్చాలని డిమాండ్ చేశారు. ఇవాళ కవితతో మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర, ఆల్ ఇండియా ఆదివాసీ కానిస్టిట్యూషనల్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జేఏసీ నాయకులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలతో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను కవితకు చందా లింగయ్య దొర వివరించారు.
వారి గౌరవాన్ని కాపాడేలా రాజకీయ పార్టీ:
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల హక్కులను పరిరక్షించేందుకు ఆల్ ఇండియా ఆదివాసీ కానిస్టిట్యూషనల్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జేఏసీ చేస్తున్న పోరాటానికి తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందన్నారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం పాటు పడుతామని హామీ ఇచ్చారు. దేశంలోని 12 కోట్ల మంది ఆదివాసీలు నిజమైన భారత దేశ సంస్కృతికి ప్రతినిధులని వారి గౌరవాన్ని కాపాడేలా మేము ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టులో 3 లక్షల మంది ఆదివాసీలను అడవి నుంచి దూరం చేస్తున్నారని కవిత ఆరోపించారు. తిరిగి వారికి అడవిలో అన్ని సౌకర్యాలతో కూడిన పునరావాసం కల్పించడం లేదని మండిపడ్డారు.






