ఏం నేరం చేశారని కేసీఆర్‌ను వేధిస్తున్నారు?: మాజీ ఎమ్మెల్యే

by Gantepaka Srikanth |

రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు.

ఏం నేరం చేశారని కేసీఆర్‌ను వేధిస్తున్నారు?: మాజీ ఎమ్మెల్యే
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో కేసీఆర్‌కు వచ్చిన పేరుప్రతిష్టలు చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం విషం కక్కుతున్నదని ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. నయాపైసా దుర్వినియోగం లేకున్నా ఏదో అవినీతి జరిగినట్లు అబద్ధాలు ప్రచారం చేసి ప్రజలను పక్కదారి పట్టించిన కాంగ్రెస్ జిత్తులమారి రాజకీయం చూసి గోబెల్స్ కూడా సిగ్గు పడతాడని ఎద్దేవా చేశారు. అసలు ఏం నేరం చేశారని కేసీఆర్‌ను వేధిస్తున్నారని ప్రశ్నించారు. ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ సాధించినందుకా? 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో కాంగ్రెస్, బీజేపీలను గడగడలాడించి మెడలు వంచినందుకా? తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల కలను సాకారం చేసేందుకు ఆమరణ దీక్ష చేపట్టి చావు నోట్లో తలపెట్టి పోరాడినందుకా? పదేళ్ల ముందు చూపు పాలనతో తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం కట్టి కోటి ఎకరాలకు సాగు నీరిచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేసినందుకా? అని నిలదీశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేక చేతులెత్తేసిన రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌కు నోటీసుల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని మండిపడ్డారు. రేవంత్ సర్కార్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌తో గోక్కున్నోళ్లెవరూ బాగుపడలేదని, ఆయన జోలికొచ్చినందుకు కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

Next Story