- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టు అగ్రనేత గణపతి ఆచూకీపై క్లారిటీ.. దేవ్‌జీ లొంగుబాటుపై ట్విస్ట్
మావోయిస్ట్ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోతున్నారని గతకొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్ట్ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోతున్నారని గతకొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో గణపతి లొంగిపోతాడని ఇటీవల వార్తలు విస్తృతమయ్యాయి. 50 ఏళ్ల పాటు మావోయిస్ట్ ఉద్యమాన్ని నడిపిన ముప్పాళ్ల వెంకటేశ్వరరావు అలియాస్ గణపతి.. ఆపరేషన్ కగార్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం నేపాల్‌లో ఆయన ఆశ్రయం పొందుతున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ తాజా పరిణామాలపై మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. గణపతి కుమారుడు తనతో మాట్లాడిన విషయాలను మరియు ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు.
కుమారుడి ఆవేదన - గోనె క్షమాపణలు..
గణపతి కుమారుడు ముప్పాల శ్రీనివాసరావు(వాసు) ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారని, ఆయన తనకు అత్యంత ఆప్తుడని గోనె తెలిపారు. గణపతిని కుమారుడు చూడలేదు. కుమారుడికి నెలరోజుల వయసున్నప్పడే గణపతి ఉద్యమంలోకి వెళ్లారు. అయితే ఇటీవల తన తండ్రి లొంగుబాటుపై వస్తున్న వార్తల వల్ల వాసు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని పేర్కొన్నారు. "వాసు పంపిన వ్యక్తిగత సందేశాలను నేను మీడియాకు వెల్లడించడంతో ఆయన నా నంబర్‌ను బ్లాక్ చేశారు. ఆయన అనుమతి లేకుండా ఆ వివరాలు బయటపెట్టినందుకు నేను బహిరంగంగా క్షమాపణలు కోరుతున్నాను" అని గోనె ప్రకాష్ రావు అన్నారు.
గణపతి ఆచూకీపై సందేహాలు..
తనకు ఉన్న సమాచారం ప్రకారం గణపతి ప్రస్తుతం భారత భూభాగంలో లేరని, ఆయన నేపాల్ వంటి సురక్షిత ప్రాంతంలో ఉండవచ్చని గోనె అభిప్రాయపడ్డారు. 2018లోనే గణపతి అనారోగ్య కారణాలతో నాయకత్వ బాధ్యతల నుండి తప్పుకున్నారని గుర్తుచేశారు. 77 ఏళ్ల వయస్సులో ఉన్న గణపతి ఇకనైనా బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలని గోనె కోరారు. "తుపాకీ పట్టే కాలం పోయింది, ఇప్పుడున్న టెక్నాలజీ మరియు రాజ్యాంగబద్ధమైన పోరాటాల ద్వారా పీడిత ప్రజలకు మెరుగైన న్యాయం చేయవచ్చు. మీరు వస్తే మీ అనుభవంతో ప్రజల కోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని ఆయన పిలుపునిచ్చారు.
దేవ్ జీ లొంగుబాటుపై క్లారిటీ..
మరో అగ్రనేత దేవ్ జీ స్వచ్ఛందంగా లొంగిపోలేదని, అనారోగ్యంతో షెల్టర్ కోసం వస్తుండగా పోలీసులు ట్రాక్ చేసి పట్టుకున్నారని గోనె వెల్లడించారు. భవిష్యత్తులో దేవ్ జీ కోరట్ల నియోజకవర్గం నుండి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. లొంగిపోయే మావోయిస్టులకు కేవలం నగదు రివార్డులే కాకుండా, వారి కుటుంబాలకు ఇళ్లు, ఉపాధి వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గోనె ప్రకాష్ రావు విజ్ఞప్తి చేశారు.






